Saif Ali Khan:ఆ పని కోసం సైఫ్ ఇంటికి వెళ్లి.. ఇంతలోనే..
ABN , Publish Date - Jan 19 , 2025 | 11:16 AM
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసి పరారైన అసలు నిందితుడు ఎట్టకేలకు థానేలో పోలీసులకు చిక్కాడు. అరెస్ట్ తర్వాత ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు అతడి గురించి పలు సంచలన విషయాలను వెల్లడించారు. నిందితుడు ఏ పని కోసం సైఫ్ ఇంటికి వెళ్లాడో అసలు నిజం బయటపెట్టినట్లు..

ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో రోజుకో సంచలన వార్త బయటికొస్తోంది. నిన్న రైల్వేస్టేషన్‌లో పారిపోతున్న అనుమానితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేయడంతో.. అసలు నిందితుడు దొరికేశాడనే కథనాలు వెలువడ్డాయి. అతడిని పట్టుకుని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్తుండగా తీసిన ఫోటోలు సోషల్ మీడియా, న్యూస్ ఛానెళ్లలో హల్‌చల్ చేశాయి. కానీ, పోలీసుల విచారణలో అతడికి, సైఫ్ కేసుకు ఎలాంటి సంబంధం లేదని తేలడంతో పోలీసులు విడిచిపెట్టేశారు. తాజాగా, ఆదివారం ముంబయికి సమీపంలోని థానేలో పొదల చాటున నిద్రిస్తుండగా అసలు నిందితుడిని బాంద్రా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు సైఫ్‌పై దాడి చేసింది తానే అని ఒప్పుకోవడంతో పాటు అనేక సంచలన నిజాలు వెల్లడించాడు.
బంగ్లా నుంచి వచ్చి..
నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసి పారిపోయిన దుండగుడు బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి అని పోలీసుల విచారణలో తేలింది. భారత్‌లోకి అక్రమంగా చొరబడిన ఇతడు 6 నెలలుగా ముంబయిలోనే నివసిస్తున్నాడు. విజయ్ దాస్ అనే పేరుతో ఒకహౌజ్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేసే ఇతడి అసలు పేరు షరీఫుల్ ఇస్లాం. బిజయ్ దాస్, మహ్మద్ ఇలియాస్ ఇలా రకరకాల మారు పేర్లతో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.
కోటి డిమాండ్ చేశాడు..
దొంగతనం కోసం నటుడి ఇంట్లోకి ప్రవేశించిన విజయ్ దాస్ ముందుగా సైఫ్ చిన్న కొడుకు 4 ఏళ్ల జేహ్ గదిలోకి ప్రవేశించాడు. బ్లేడ్ పట్టుకుని గదిలోకి వచ్చిన ఆగంతకుని చూసి బాలుడి ఆయా ఇలియమ్మ ఫిలిప్ గట్టిగా కేకలు వేయడం వల్ల సైఫ్ అక్కడికొచ్చాడు. నిందితుడి దాడిలో సైఫ్‌తో పాటు ఆయా కూడా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే, దాడికి ముందు నిందితుడు తనను కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆయా ఇలియమ్మ అలియాస్ లిమా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.
ఆ పని కోసం సైఫ్ ఇంటికి..
గురువారం తెల్లవారుజామున నటుడు సైఫ్‌ను అతడి ఇంట్లోనే దారుణంగా కత్తితో పొడిచి పరారయ్యాడు విజయ్ దాస్ అలియాస్ షరీఫుల్ ఇస్లాం. ఎందుకిలా చేశావని పోలీసులు ప్రశ్నించగా.. అసలు సంగతి బయటపెట్టాడు. నిజానికి తాను దొంగతనానికే సైఫ్ ఇంటికి వెళ్లాలని.. సడన్‌గా సైఫ్ కంటబడటంతో పారిపోయేందుకు కత్తితో పొడిచానని పోలీసులకు తెలిపాడు. త్వరలో నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ముంబై డీసీపీ ప్రకటించారు.