Tax Changes 2025: వేతనజీవులకు పన్ను ఉపశమనం
ABN , Publish Date - Apr 01 , 2025 | 05:35 AM
2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.12.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది. అలాగే, బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ, టీడీఎస్, టీసీఎస్ నిబంధనల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి

నేటి నుంచి అమల్లోకి
రూ.12.75లక్షల దాకా ఆదాయంపై పన్ను ఉండదు
టీడీఎస్, టీసీఎస్ నిబంధనలు, బ్యాంకు
ఖాతాల్లో కనీస నిల్వ తదితరాల్లోనూ మార్పులు
న్యూఢిల్లీ, మార్చి 31: కొత్త ఆర్థిక సంవత్సరం (2025-26) ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులు, వేతన జీవులు, వినియోగదారులకు సంబంధించిన కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని భారీగా పెంచడంతోపాటు సవరించిన ఆదాయం పన్ను శ్లాబులు అమల్లోకి రానున్నాయి. యూపీఐ నిబంధనల్లో మార్పులు, ఇతర మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. వాటి గురించి చూద్దాం...
బడ్జెట్‌లో అనూహ్య ప్రకటన..
దేశంలోని వేతన జీవులు ఊహించని విధంగా 2025 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను మినహాయింపునకు సంబంధించిన ప్రకటన చేశారు. రూ.12 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించే వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్‌ను కలిపితే మొత్తంగా రూ.12.75 లక్షల వరకు ఎలాంటి పన్నుచెల్లించాల్సిన అవసరం ఉండదు. కొత్త పన్ను విధానంలో శ్లాబులను కూడా సవరించారు. ఈ ప్రకటనలు వేతన జీవులకు భారీ ఊరటను కల్పించాయి. కొత్త పన్ను విధానంలో సెక్షన్ 87ఏ కింద లభించే పన్ను రిబేటును రూ.25 వేల నుంచి రూ.60 వేలకు పెంచారు. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి.
టీడీఎస్, టీసీఎస్‌ల్లో మార్పులు..
బ్యాంకు ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను చెల్లించేవారికి ఊరట కల్పిస్తూ ఏప్రిల్ 1 నుంచి టీడీఎస్ పరిమితిని ప్రభుత్వం పెంచింది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ వర్తింపు పరిమితి రూ.లక్షకు పెరగనుంది. దీంతో వార్షిక వడ్డీ ఆదాయం రూ.లక్ష దాటితే టీడీఎస్ వర్తిస్తుంది. 60 ఏళ్ల లోపు వారికి రూ.40 వేల నుంచి రూ.50వేలకు పెంచారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్) పరిమితి కూడా పెరగనుంది. ఇది విదేశీ ప్రయాణాలు, పెట్టుబడులు, ఇతర లావాదేవీలను ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం రూ.7 లక్షలకు పైగా విదేశాలకు పంపే సొమ్ము పై ఏ అవసరం కోసం పంపుతున్నారన్న ఆధారంగా 0.5 శాతం నుంచి 20 శాతం వరకు టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి ఈ పరిమితి రూ.10 లక్షలకు పెరగనుంది.
నూతన పెన్షన్ స్కీమ్..
పాత పెన్షన్ స్కీమ్ స్థానంలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) అమల్లోకి రానుంది. ఇది దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను ప్రభావితం చేయనుంది. కనీసం 25 ఏళ్ల సర్వీసు ఉన్న ఉద్యోగులు చివరి 12 నెలల సగటు బేసిక్ వేతనంలో 50 శాతానికి సమానంగా పెన్షన్‌ను పొందడానికి అవకాశం ఉంటుంది.
వినియోగంలోలేని నంబర్లకు యూపీఐ సేవల నిలిపివేత
యూపీఐ లావాదేవీలకు కొత్త భద్రతా చర్యలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అమల్లోకి తెస్తోంది. ఇందులో భాగంగా వినియోగంలోలేని నంబర్లకు అనుసంధానమైన యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. ఫోన్ నంబర్లు చాలా కాలం పాటు పని చేయకుండా ఇనాక్టివ్‌గా ఉంటే వాటికి అనుసంధానంగా ఉన్న గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి పేమెంట్ యాప్స్ సేవలు రద్దు కానున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తుంది. ఇనాక్టివ్ ఫోన్ నంబర్లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇనాక్టివ్ నంబర్లను బ్యాంకులు, థర్డ్ పార్టీ యూపీఐ ప్రొవైడర్లయిన ఫోన్ పే, గూగుల్ పేలు తప్పనిసరిగా తొలగించాల్సి ఉంటుంది. యూపీఐ లైట్‌లోని బ్యాలెన్స్‌ను తిరిగి బ్యాంక్ ఖాతాకు బదిలీచేసుకునే సదుపాయం కూడా ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వస్తుంది.
ఎన్‌పీఎస్ వాత్సల్యకు పన్ను ప్రయోజనాలు
పిల్లల భవిష్యత్తు దృష్ట్యా దీర్ఘకాలం పెట్టుబడి పెట్టే వారి కోసం తెచ్చిన ఎన్‌పీఎ్‌స వాత్సల్య పథకం కింద 2025-2026 ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు పొందడానికి అవకాశం ఉంది. సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద రూ.50వేల పన్ను ప్రయోజనాలు కల్పించారు. పాత పన్ను విధానంలో పన్ను చెల్లించే వారు దీన్ని వినియోగించుకోవచ్చు. కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపు ఉండదు.
బ్యాంకుల్లో కనీస నిల్వ...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ), కెనరా బ్యాంకు సహా ప్రధాన బ్యాంకులు ఏప్రిల్ 1 నుంచి ఖాతాల్లో కనీసంగా ఉండాల్సిన నిల్వను సవరించనున్నాయి. కస్టమర్లు తమ ఖాతాలో కనీస నిల్వను ఉంచని పక్షంలో అందుకు పెనాల్టీలను చెల్లించాల్సి ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Ranya Rao: వెలుగులోకి సంచలన విషయాలు..
Also Read: తొక్కే కదా అని పారేస్తున్నారా.. దీనిలోని పోషకాలు తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..
Sanjay Raut: మోదీ ఆ ప్లాన్‌తోనే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లారేమో..
వాట్సాప్‌లో కాదు.. పుస్తకాలు చదివి చరిత్ర తెలుసుకొండి: రాజ్‌ఠాక్రే
Monalisa Director: మోనాలిసా డైరెక్టర్‌పై కేసు.. అత్యాచారం, ఆపై అసభ్య వీడియోలతో వేధింపులు
For National News And Telugu News