Sankranti Special Sakinalu: సకినాలు అంటే ఏంటి.. ఎన్ని వెరైటీలు చేసుకోవచ్చంటే..
ABN , Publish Date - Jan 12 , 2025 | 01:30 PM
ముగ్గులు, హరిదాసులు, పతంగులు, పిండి వంటలు, కోడి పందేలు, కొత్త సినిమాలు.. ఇలా సంక్రాంతి పండుగ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఈ ఫెస్టివల్ వచ్చేసింది.
ముగ్గులు, హరిదాసులు, పతంగులు, పిండి వంటలు, కోడి పందేలు, కొత్త సినిమాలు.. ఇలా సంక్రాంతి పండుగ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఈ ఫెస్టివల్ వచ్చేసింది. అందరూ పండుగ కోసం నగరాలను వీడి సొంతూళ్లకు పయనమవుతున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముుక్కనుమ.. ఇలా పండుగకు సంబంధించి ఏ రోజు ఏమేం చేయాలో ప్లాన్ చేసుకుంటున్నారు. ఆలయాల సందర్శన దగ్గర నుంచి పిండి వంటల తయారీ వరకు ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే పిండి వంటలు అనగానే అందరికీ సకినాలు బాగా గుర్తుకొస్తాయి. సంక్రాంతికి తెలంగాణలో సకినాలు తయారు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో వాటి తయారీ గురించి మరింతగా తెలుసుకుందాం..
సకినాలు అంటే ఏంటి?
తెలంగాణలో సకినాలను సంక్రాంతితో పాటు మిగతా సమయంలోనూ చేసుకుంటారు. అయినా సంక్రాంతి పండుగకు మాత్రం ఇవి ఉండాల్సిందే. వీటిని తెలంగాణ స్నాక్స్‌గా పిలుస్తుంటారు. బియ్యం, నువ్వులు, వాము లాంటి పదార్థాలు కలిపి తయారు చేసే సకినాలు చాలా క్రంచీగా ఉంటాయి. తింటుంటే కరకరా అంటాయి. సకినాల తయారీలో భాగంగా ముందు రోజు రాత్రి బియ్యంను కడిగి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీటిని వడగట్టాలి. అనంతరం గ్రైండ్ చేసి అందులో నువ్వులు, వాము, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత సన్నగా పిండిని వదులుతూ రెండు లేదా మూడు రింగులుగా తిప్పుకొని సకినాలు వేసుకోవాలి. అవి ఆరిన తర్వాత నూనెలో వేసి ఒక్కొక్కటిగా తీయాలి. అంతే కరకరలాడే సకినాలు రెడీ.
ఎన్నో వెరైటీలు!
సకినాల్లో చాలా వెరైటీలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి 5 వెరైటీలు. అవే.. తెల్ల సకినాలు, కారం సకినాలు, పచ్చిమిర్చి సకినాలు, పండుమిర్చి సకినాలు, నేతి సకినాలు.
తెల్ల సకినాలు: సాధారణ బియ్యంతో చేసే సకినాలే తెల్ల సకినాలు. బియ్యం పిండి, నువ్వులు, వాము, ఉప్పు దీని తయారీలో వాడతారు.
కారం సకినాలు: నువ్వులు, వాము, ఉప్పు కలిపిన బియ్యం పిండిలో ఎల్లిపాయ కారాన్ని జతచేస్తే నోరూరించే కారం సకినాలు రెడీ అయిపోతాయి.
పండుమిర్చి సకినాలు: బియ్యం పిండి మిశ్రమంలో పండుమిర్చి, ఎల్లిపాయ కారాన్ని మిక్స్ చేసి చేసేదే పండుమిర్చి సకినాలు. ఇవి చాలా స్పైసీగా ఉంటాయి.
నేతి సకినాలు: పిల్లల కోసం చేసేవే నేతి సకినాలు. బియ్యం పిండిలో నెయ్యి వేసుకొని చేసే ఈ సకినాలు తినేందుకు పిల్లలు ఎగబడతారు.
సకినాల వెనుక చరిత్ర!
సకినాలను స్నాక్స్‌గా మాత్రమే చూస్తే పొరపాటే. తెలంగాణలో ఎన్నో ఏళ్లుగా వీటిని పండుగ సమయాల్లో తయారు చేస్తూ వస్తున్నారు. గౌరీ మాత, వినాయకుడికి సకినాలను ప్రసాదంగా సమర్పించడం ఇక్కడి ఆచారంగా చెప్పుకోవచ్చు. పసుపు, కుంకుమతో తయారు చేసిన గౌరమ్మను మొక్కి, తొలి సకినాన్ని అక్కడ నైవేద్యంగా ఇచ్చి.. ఆ తర్వాతే కుటంబ సభ్యుల కోసం ఇతర సకినాలను చేస్తారు.
ఇవీ చదవండి:
యుద్ధ క్షేత్రం నుంచి శాంతి కోసం!
పొలిటికల్ గేమ్.. కాంగ్రెస్ ఏకాకి..!
సంక్రాంతి బరిలో ఉన్న ఈ పందెం కోళ్ల సంగతేంటి?
మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి