Tamilnadu Hill Stations Tour : సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. ఈ హిల్ స్టేషన్లు అస్సలు మిస్సవకండి..
ABN , Publish Date - Feb 27 , 2025 | 05:34 PM
Tamilnadu Hill Stations Tour : భారతదేశంలోని అత్యంత అందమైన హిల్ స్టేషన్లు మన పక్క రాష్ట్రంలోనే ఉన్నాయి. ఈ వేసవిలో ఫ్యామిలీతో కలిసి మీరు ప్రకృతి ఒడిలో సేదతీరాలని కోరుకుంటున్నట్లయితే.. ఈ హిల్ స్టేషన్లు సోయగాలు ఎట్టి పరిస్థితుల్లో మిస్సవకండి.

Tamilnadu Hill Stations Tour : వేసవి సెలవుల్లో ఫ్యామిలితో కలిసి చల్లని ప్రదేశాలకు వెళ్లి జాలీగా గడిపేందుకు ప్రణాళికలు వేస్తుంటారంతా. మనకు దగ్గర్లలోనే ప్రకృతి అందాలకు నెలవైన ఎన్నో అద్భుతమైన ప్రాంతాలున్నాయి. భారతదేశంలో ఉన్న అత్యంత సుందరమైన హిల్ స్టేషన్లలో కొన్ని తెలుగు రాష్ట్రాల పక్కనే ఉన్న తమిళనాడులోనూ ఉన్నాయి. సెలవుల్లో ఊహా ప్రపంచాన్ని సందర్శించిన అనుభూతి మీ సొంతం కావాలంటే.. ఈ హిల్ స్టేషన్లు తప్పక సందర్శించండి. ఇక తక్కువ ఖర్చుతో ఈ ప్రాంతాలను ఎలా చుట్టేయాలో ఓ లుక్కేయండి..
తమిళనాడులో తప్పక చూడాల్సిన హిల్ స్టేషన్లు ఇవే..
ఊటీ : కోయంబత్తూర్ నుంచి 89 కి.మీ దూరంలో ఉన్న ఊటీని "క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్" అని పిలుస్తారు. ఇది నీలగిరి కొండలకు రాజధాని. సముద్ర మట్టానికి 2,240 మీటర్ల ఎత్తులో ఉన్న ఊటీలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, తేయాకు తోటలు, సుందరమైన లోయలు, అందమైన సరస్సులు, పిక్నిక్ స్పాట్‌లు, బొటానికల్ గార్డెన్‌లు, గులాబీ తోటలు తప్పక సందర్శించాల్సిన ప్రాంతాలు.
కొడైకెనాల్ : సముద్ర మట్టానికి 2,133 మీటర్ల ఎత్తులో ఉన్న కొడైకెనాల్ పళని కొండలకు దక్షిణాన ఉంది. ఈ ప్రాంతం సహజ సౌందర్యానికి, జలపాతాలకు, ట్రెక్కింగ్ ట్రైల్స్‌కు ప్రసిద్ధి. మీరు కొడైకెనాల్ వెళితే కోకర్స్ వాక్, సిల్వర్ క్యాస్కేడ్, కోడై సరస్సును సందర్శించడం మర్చిపోవద్దు.
కూనూర్ : ఊటీకి కేవలం 18 కి.మీ దూరంలో ఉంటుంది కూనూర్ నీలగిరి కొండలలో రెండో అతి పెద్ద హిల్ స్టేషన్. ఈ ప్రాంతం నీలగిరి టీ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడి టీ తోటలు, సిమ్స్ పార్క్, డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్‌లు మెమొరబుల్ ఎక్స్‌పీరియన్స్ పంచుతాయి.
వల్పరై : తమిళనాడులో అంతగా తెలియని హిల్ స్టేషన్ వల్పరై. ఈ ప్రాంతమంతా తేయాకు తోటలు, జలపాతాలు, సుందరమైన లోయలతో నిండి ఉంటుంది. వేసవిలో ఈ అందమైన ప్రాంతాన్ని ఒక్కసారైనా చూసితీరాల్సిందే.
హోగేనక్కల్ : ప్రసిద్ధ నది కావేరి వివిధ జలపాతాలుగా విడిపోయే ప్రదేశం హోగేనక్కల్. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని నదీ తీరాన ఉన్న ఒక చిన్న గ్రామం. ఇక్కడి జలపాతాల అందాలు చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. దీనిని భారతదేశ నయాగర జలపాతం అని కూడా పిలుస్తారు తెలుసా. ఈ అందమైన ప్రాంతం స్వర్గం కంటే తక్కువ కాదు అంటారు చూసినవాళ్లు.
ఇలా ప్లాన్ చేసుకోండి..
బస్సు : బస్సు ప్రయాణానికి చాలా ఖర్చవుతుంది. కానీ, మీరు హైదరాబాద్ లేదా తెలంగాణలోని ఇతర ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల నుంచి చెన్నై లేదా కోయంబత్తూర్‌కు నేరుగా బస్సులో చేరుకోవచ్చు. ఆపై మీకు నచ్చిన హిల్ స్టేషన్ చేరుకోవడానికి స్థానిక బస్సును ఎంచుకోవచ్చు. ఛార్జీ ఖర్చు మొత్తంగా ఒక్కొక్కరికి ₹2,000 - ₹3,000 వరకూ అవుతుంది.
రైలు మార్గం : మీరు హైదరాబాద్ లేదా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రధాన నగరాల నుండి చెన్నై లేదా కోయంబత్తూర్‌కు రైలులో ప్రయాణించి మీరు అనుకున్న హిల్ స్టేషన్‌కు స్థానిక రైలు లేదా బస్సులో వెళ్లవచ్చు.
తెలుగు రాష్ట్రాల నుంచి తమిళనాడు హిల్ స్టేషన్లకు కొన్ని IRCTC టూర్ ప్యాకేజీలు ఇక్కడ ఉన్నాయి:
1. హైదరాబాద్ నుంచి ఊటీ, కొడైకెనాల్, మైసూర్ టూర్ ప్యాకేజీ : ఈ 6 రోజుల ప్యాకేజీ హైదరాబాద్ నుంచి ప్రారంభమై ఊటీ, కొడైకెనాల్ మరియు మైసూర్‌లను కవర్ చేస్తుంది. ప్యాకేజీలో రవాణా, వసతి, దర్శనీయ స్థలాలు ఉంటాయి. టికెట్ ధర ఒక్కో వ్యక్తికి ₹12,990 - ₹19,990.
2. విజయవాడ నుంచి తమిళనాడు హిల్ స్టేషన్ టూర్ ప్యాకేజీ : ఈ 5-రాత్రి, 6-పగళ్ల ప్యాకేజీ విజయవాడ నుంచి ప్రారంభమై ఊటీ, కొడైకెనాల్, సమీపంలోని ఇతర ప్రముఖ ప్రాంతాలను కవర్ చేస్తుంది. టికెట్ ధర ఒక్కో వ్యక్తికి ₹10,990 - ₹16,990.
3. సికింద్రాబాద్ నుంచి కొడైకెనాల్, ఊటీ టూర్ ప్యాకేజీ : ఈ 5 రోజుల ప్యాకేజీ సికింద్రాబాద్ నుండి ప్రారంభమై కొడైకెనాల్, ఊటీలను కవర్ చేస్తుంది. టికెట్ ధర ఒక్కో వ్యక్తికి ₹9,990 - ₹14,990
ఈ ప్యాకేజీలు IRCTC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని ఆన్‌లైన్‌లో లేదా ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. సీజన్, వసతి ఎంపికలు, ఇతర అంశాలను బట్టి ధరలు మారతాయని గమనించాలి.
కారు : తెలుగు రాష్ట్రాల నుండి తమిళనాడులోని హిల్ స్టేషన్లకు డ్రైవింగ్ చేస్తూ వెళ్లడం ఒక మంచి అనుభూతిని పంచుతుంది. అద్దె టాక్సీ లేదా మీ స్వంత వాహనం ద్వారా వెళితే ఒక్కొక్కరికి ₹5,000 - ₹10,000 వెచ్చించాల్సి రావచ్చు.
Read Also : 18 ఏళ్లు నిండొద్దని.. బర్త్ డేకు ముందే కుమారుడిని చంపిన తల్లి
టీమిండియా భారీ విరాళం.. మనసులు గెలిచారు బాస్
చెరుకు తోటలో దాక్కున్న నిందితుడు.. పోలీసులు ఏం చేశారంటే..