Share News

Rohit Sharma: 22 గజాల పిచ్‌పై రోహిత్ చదరంగం.. ఎత్తులు పారితే కప్పు ఖాయం

ABN , Publish Date - Feb 17 , 2025 | 02:03 PM

Champions Trophy 2025: అందరిదీ ఒకదారైతే తనదో దారి అంటున్నాడు భారత సారథి రోహిత్ శర్మ. హట్కే సోచో అంటూ ప్రత్యర్థుల కోసం వినూత్నంగా ఆలోచిస్తున్నాడు హిట్‌మ్యాన్. అవతలి జట్లను పడగొట్టేందుకు పాత ఆయుధాన్ని బయటకు తీస్తున్నాడు.

Rohit Sharma: 22 గజాల పిచ్‌పై రోహిత్ చదరంగం.. ఎత్తులు పారితే కప్పు ఖాయం
Rohit Sharma

13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచ కప్‌ను గతేడాది భారత్‌కు అందించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. పొట్టి వరల్డ్ కప్-2024లో టీమిండియాను విజేతగా నిలిపి అందర్నీ గర్వించేలా చేశాడు. ఇప్పుడు అదే హిట్‌మ్యాన్ ముందు మరో బిగ్ చాలెంజ్ ఉంది. 12 ఏళ్లుగా ఊరిస్తున్న చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను చాంపియన్‌గా నిలబెట్టడం. ఫిబ్రవరి 19 నుంచి మొదలయ్యే టోర్నీలో టీమిండియాను గెలిపించే బాధ్యత రోహిత్ మీద ఉంది. టీ20ల్లో అనుకున్నది సాధించాడు కాబట్టి ఇక వన్డేల్లో తన డ్రీమ్‌ను నెరవేర్చుకోవాల్సిన టైమ్ ఇది. వన్డే ప్రపంచ కప్-2023 ట్రోఫీ తృటిలో చేజారినందున చాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవడం రోహిత్‌కు ఆవశ్యకంగా మారింది. అందుకే అతడు పాత ఆయుధాన్ని బయటకు తీస్తున్నాడు.


రికార్డులు ఏం చెబుతున్నాయి?

చాంపియన్స్ ట్రోఫీలో ముగ్గురు స్పిన్నర్ల ఫార్ములాను భారత్ ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు స్పిన్నర్లకు తోడుగా వెటరన్ పేసర్ మహ్మద్ షమి, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో కలిపి ఐదుగురు నిఖార్సయిన బౌలింగ్ యూనిట్‌తో బరిలోకి దిగాలని రోహిత్-కోచ్ గంభీర్ భావిస్తున్నారట. ఈ టోర్నీలో భారత మ్యాచులకు దుబాయ్ ఆతిథ్యం ఇస్తోంది. అక్కడి పిచ్‌లు స్పిన్ కంటే పేస్‌కు ఎక్కువగా అనుకూలిస్తాయి. ఇటీవల కాలంలో అక్కడ జరిగిన మ్యాచుల్లోనూ పేసర్లే ఎక్కువ ప్రభావం చూపారు. పైగా దుబాయ్ కండీషన్స్‌కు బంతి టర్న్ అయ్యే అవకాశాలూ తక్కువే. అయినా 22 గజాల పిచ్‌పై రోహిత్ మాత్రం స్పిన్ ఎత్తుతో ప్రత్యర్థులకు చెక్ పెట్టాలని భావిస్తున్నాడట.


జైస్వాల్‌ను కాదని వరుణ్‌కు చాన్స్!

చాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్‌లో తొలుత అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌ను తీసుకున్నారు సెలెక్టర్లు. అయితే అనూహ్యంగా జస్‌ప్రీత్ బుమ్రా గాయంతో దూరమవడం, ఇంగ్లండ్‌తో సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి అదరగొట్టడంతో ఆ ప్లేస్‌లో అతడ్ని భర్తీ చేశారు. అప్పటికే స్క్వాడ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్‌ను నాన్ ట్రావెలింగ్ రిజర్వ్స్‌కు షిఫ్ట్ చేసి మరీ వరుణ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్ లాంటి పేసర్‌ను తీసుకునే చాన్స్ ఉన్నా రోహిత్-గంభీర్‌ స్పిన్నర్ కావాలనే పట్టుబట్టారట. దుబాయ్ పిచ్‌లు ఇన్నింగ్స్ మధ్యలో నెమ్మదించడం, మ్యాచ్ విన్నర్ లాంటి స్పిన్నర్లు జట్టులో ఉండటం, బుమ్రా జట్టులో లేకపోవడంతో స్పిన్ ఫోకస్డ్‌గా వెళ్లాలని నిర్ణయించుకున్నాడట రోహిత్. ఒకవేళ అతడి ఎత్తులు గానీ పారితే భారత్ ఒడిలో మరో కప్పు వాలిపోవడం ఖాయం. మరి.. ఏం జరుగుతుందో ఇంకొన్ని వారాల్లో తేలిపోనుంది.


ఇవీ చదవండి:

చాంపియన్స్ ట్రోఫీ ఉచితంగా చూసేయండిలా..

అబ్బాయిలకు గెలుపు.. అమ్మాయిలకు ఓటమి

గాయాల జాబితా చాంతాడంత!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 17 , 2025 | 02:04 PM