Tilak Varma Record: రోహిత్-కోహ్లీ వల్లే కాలేదు.. తిలక్ వర్మ సాధించి చూపించాడు
ABN , Publish Date - Jan 26 , 2025 | 02:29 PM
Tilak Varma Breaks Unbeaten Record: హైదరాబాదీ తిలక్ వర్మ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు అందరికీ చూపించాడు. టీమిండియా ఫ్యూచర్ స్టార్ తానేనని అతడు ప్రూవ్ చేశాడు.

భారత జట్టు మరో అద్వితీయ విజయాన్ని అందుకుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది టీమిండియా. ప్రత్యర్థి విసిరిన 166 పరుగుల లక్ష్యాన్ని మరో 4 బంతులు ఉండగానే ఛేదించింది. హైదరాబాదీ తిలక్ వర్మ (55 బంతుల్లో 72 నాటౌట్) స్టన్నింగ్ నాక్‌తో మెన్ ఇన్ బ్లూను విజయతీరాలకు చేర్చాడు. పోయిందనుకున్న మ్యాచ్‌లో పట్టుదలతో ఆఖరి వరకు ఆడి టీమ్‌కు విజయాన్ని అందించాడు. ఇదే క్రమంలో ఓ అరుదైన ఘనత అందుకున్నాడు. అది ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
కొత్త చరిత్ర!
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చేయలేనిది తిలక్ వర్మ సాధించాడు. టీ20 క్రికెట్‌లో ఈ ఇద్దరు స్టార్లు అందుకోని ఓ ఘనతను తెలుగు కుర్రాడు అందుకున్నాడు. టీ20 క్రికెట్‌లో రెండు డిస్మిసల్స్ మధ్య అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు తిలక్. గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన టీ20లో 20 పరుగులు చేసిన ఈ లెఫ్టార్మ్ బ్యాటర్.. ఆ తర్వాత వరుసగా 4 ఇన్నింగ్స్‌ల్లో నాటౌట్‌గా ఉన్నాడు. ఈ మ్యాచుల్లో 107 నాటౌట్, 120 నాటౌట్, 19 నాటౌట్, 72 నాటౌట్‌గా అతడి స్కోర్లు ఉన్నాయి. మొత్తంగా గత డిస్మిసల్‌కు ఇప్పటికి అతడి బ్యాట్ నుంచి 318 పరుగులు వచ్చాయి. తద్వారా పొట్టి ఫార్మాట్‌లో రెండు డిస్మిసల్స్ మధ్య అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అతడు చరిత్ర సృష్టించాడు.
టాప్-5లో ఎవరెవరు?
టీ20ల్లో రెండు డిస్మిసల్స్ మధ్య అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో మార్క్ చాప్‌మన్ (271 పరుగులు), ఆరోన్ ఫించ్ (240), శ్రేయస్ అయ్యర్ (240), డేవిడ్ వార్నర్ (239) టాప్-5లో ఉన్నారు. అందరికంటే పైన ఉన్నాడు తిలక్. కోహ్లీ, రోహిత్‌లు పొట్టి ఫార్మాట్‌లో ఎన్నో రేర్ ఫీట్స్ నమోదు చేశారు. పరుగుల వరద పారించారు. కానీ ఇలా ఒక డిస్మిసల్‌కు ఇంకో డిస్మిసల్‌కు మధ్య అత్యధిక పరుగులు మాత్రం బాదలేదు. దీంతో రేర్ ఫీట్ సాధించిన తిలక్‌ను అంతా ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అతడు ఇలాగే ఆడుతూ టీమిండియాకు రియల్ మ్యాచ్ విన్నర్‌గా మారాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:
తిలక్‌ను పొగుడుతున్నారు.. గేమ్ చేంజర్‌ను మర్చిపోతున్నారు
టీ20 ఉత్తమ క్రికెటర్‌గా అర్ష్‌దీప్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి