Share News

Technology : ఈ కోడ్ ఉంటే.. మీ కుటుంబాన్ని సైబర్ నేరగాళ్లు ఏం చేయలేరు..

ABN , Publish Date - Jan 03 , 2025 | 12:03 PM

లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మనకంటే సైబర్ నేరగాళ్లు ఒకడుగు ముందే ఉంటున్నారు. కళ్లెదుట కనిపించకుండానే నిలువు దోపిడీ చేసేస్తున్నారు. అదే ఈ కోడ్ ఉంటే..మీ కుటుంబాన్ని సైబర్ నేరగాళ్లు ఏం చేయలేరు..

Technology : ఈ కోడ్ ఉంటే.. మీ కుటుంబాన్ని సైబర్ నేరగాళ్లు ఏం చేయలేరు..
Family Code Cyber Security

కొత్త సంవత్సరం సంతోషంతో పాటు సవాళ్లకు స్వాగతం పలకవచ్చు. మరీ ముఖ్యంగా స్రైబర్ క్రైం రేట్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే, లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మనకంటే సైబర్ నేరగాళ్లు ఒకడుగు ముందే ఉంటున్నారు. కళ్లెదుట కనిపించకుండానే వాట్సాప్ లింక్‌లు, ఫ్రాడ్ కాల్స్, మెసేజ్‍‌లు, డిజిటల్ అరెస్ట్ అంటూ జనాలను దోపిడి చేసిన సైబర్ మాయగాళ్లు. అయినవాళ్ల పేరు చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఫేక్ సంఘటనలు క్రియేట్ చేసే నిలువు దోపిడి చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రానున్న కాలంలో ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగే అవకాశాలున్నాయి. సైబర్ నేరగాళ్లకు అలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రతిఒక్కరూ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఒక పరిష్కారం కనిపెట్టింది.. అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ. డిజిటల్ ప్రపంచంలో మన వ్యక్తిగత డేటాతో పాటు ఫ్యామిలీ డేటా చోరీ కాకుండా ఫ్యామిలీ కోడ్ ఏర్పాటు చేసుకుంటే సైబర్ క్రైమ్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని సూచిస్తోంది. అసలు, ఈ ఫ్యామిలీ కోడ్ అంటే ఏమిటి? ఎలా క్రియేట్ చేసుకోవాలి.. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..


ఎఫ్‌బీఐ ఏం చెప్పింది..

మీ కుటుంబ సభ్యుల పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు మీ నుంచి డబ్బులు లాగకుండా ఉండేందుకు ఫ్యామిలీ కోడ్ క్రియేట్ చేసుకోవాలని సూచించింది. ఆ కోడ్ ఏదైనా కావచ్చు. మీకు నచ్చిన పాటలోని పదాలు, నెంబర్, వస్తువు, మనుషులు, ప్రాంతం, ఇలా ఏదైనా కావచ్చు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఇలాంటిది ఒక కోడ్ రూపొందించుకోవాలి. వాళ్లకి మాత్రమే తెలిసేలా జాగ్రత్తపడితే చాలు.


ఫ్యామిలీ కోడ్ అంటే..

సడన్‌‌గా ఇంట్లో ఉండగా మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందనో, మీ నాన్నని పోలీసులు జైల్లో వేశారనో వాట్సాప్‌లో వీడియోలు రావచ్చు. లేదా ఎవరైనా డీఫ్‌ఫేక్ టెక్నాలజీ వాడి వీడియో కాల్ చేసి ద్వారా మీ వాళ్లతో మాట్లాడించి డబ్బు అడిగించవచ్చు. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ సాయంతో ప్రమాదంలో ఇరుక్కున్నట్లు మీ కుటుంబ సభ్యుల గొంతుతో మాట్లాడించి బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ నెంబర్లు, పాస్‌వర్డ్‌లు చెప్పమని అడిగే ప్రమాదముంది. ఇలాంటి సమయాల్లో కాల్ చేసిన వ్యక్తి మీ కుటుంబ సభ్యుడే అని నిర్ధారించుకునేందుకు ఫ్యామిలీ కోడ్ ఏంటని అడగాలి. సరైన సమాధానం చెప్పకపోతే అది ఫేక్ కాల్ అని ఈజీగా మనకి అర్థమైపోతుంది.


ఎందుకు అవసరం..

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్లు వినియోగించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. టెక్నాలజీపై పూర్తి అవగాహన లేకున్నా చదువుకోనివారు, వృద్ధుల్లో చాలామంది కూరగాయలు, పళ్లు అమ్ముకునే వారి నుంచి ప్రతి ఒక్కరికీ డిజిటల్ పేమెంట్లు చేసేస్తున్నారు. అందుకే ఇలాంటి వారి నుంచి ఒకే ఒక్క ఫోన్ కాల్‌ లేదా క్లిక్‌తో రెప్పపాటులోనే కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మును స్వాహా చేస్తున్నారు సైబర్ మోసగాళ్లు. చదువుకున్న వారిని ఏఐ, డీఫ్‌ఫేక్ టెక్నాలజీ వాడి బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి నేరాలకు మన కుటుంబం బలి అవ్వకుండా ఉండేందుకు ఫ్యామిలీ కోడ్ ఉపయోగపడుతుంది.


ఉపయోగాలు..

స్కూలుకు, కాలేజీలకు వెళ్లిన పిల్లలు ఇంటికి తిరిగొచ్చేవరకూ తల్లిదండ్రులకు కంగారే. వారు ప్రమాదంలో ఉన్నట్టు ఎవరైనా అపరిచితులు కాల్ చేయగానే మరో ఆలోచన చేయరు. నైట్ షిఫ్ట్‌లో పనిచేసేందుకు ఆఫీసుకు వెళ్లిన భాగస్వాముల విషయంలోనూ అంతే. ఇలాంటివి కొన్నిసార్లు నిజమయ్యే అవకాశాలూ లేకపోలేదు. ఏది నిజమని సందిగ్ధంలో పడకుండా ఉండేందుకు మీకు ఫ్యామిలీ కోడ్ ఉపయోగపడుతుంది.

Updated Date - Jan 03 , 2025 | 01:31 PM