Harish rao: దావోస్ దారి ఖర్చులు వృధా చేసిన సీఎం రేవంత్
ABN , Publish Date - Jan 24 , 2025 | 05:20 PM
Harish rao: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు చురకలంటించారు. దావోస్ దారి ఖర్చులకు నగదు వృధా చేశారాంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.

హైదరాబాద్, జనవరి 24: మెగా కృష్ణారెడ్డి కంపెనీతో ఒప్పందానికి దావోస్ వెళ్ళాలా? అంటూ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు చురకలంటించారు. జూబ్లీహిల్స్‌లో రోడ్డుకు అటు వైపు సీఎం రేవంత్ రెడ్డి ఉంటారని.. ఇటు వైపు మెగా కృష్ణారెడ్డి ఉంటారని వివరించారు. దావోస్ టూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి దారి ఖర్చులు వృధా చేశారని మండిపడ్డారు.
శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే హరీష్ రావు విలేకర్లతో మాట్లాడుతూ.. గోదావరి జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. రేవంత్ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందంటూ నిప్పులు చెరిగారు.
ఏపీని ఆపడం చేతకాకుంటే.. అఖిల పక్షాన్ని తీసుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సూచించారు. ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి.. గురదక్షిణ చెల్లించుకొంటున్నట్లు అనుమానం కలుగుతోందని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. బనకచర్ల ద్వారా 200 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించుకు పోతుంటే.. రేవంత్ రెడ్డి మౌనంగా ఉండడం వెనుక కారణం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు.
ప్రాజెక్ట్ నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు ఉత్తరాలు రాస్తున్నారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు.. గోదావరి జలాలు తరలించుకుపోతుంటే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దావోస్, ఢిల్లీ యాత్రల్లో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. గోదావరి నీటిని ఆంధ్రప్రదేశ్, తుంగభద్ర నీళ్ళను కర్ణాటక తరలించుకుపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: మరికొన్ని గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు.. రైతు భరోసా పథకానికి కావాల్సింది ఇవే..
అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా నీటిని తరలించుకు పోతుంటే సీఎం రేవంత్ రెడ్డితోపాటు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు స్పందించరంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. నీటిపారదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫెయిల్ అయ్యారని విమర్శించారు. ఉత్తమ్‌కు చేతనైతే.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు.
Also Read: రైలు ప్రమాద బాధితులు.. నష్ట పరిహారం ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే..?
200 టీఎంసీల గోదావరి నీటిని పెన్నా బేసిన్‌కు తీసుకు వెళ్లడానికి ఆంధ్రప్రదేశ్ యుద్ద ప్రాతిపదికన ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించారు. హక్కుగా రావాల్సిన నీటిని సైతం 13 నెలలుగా తెలంగాణ ప్రభుత్వం సాధించ లేకపోయిందంటూ ఎద్దేవా చేశారు. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి రూ. 40 వేల కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పిస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారని ఈ సందర్భంగా హరీష్ రావు గుర్తు చేశారు.
తుంగభద్ర నుంచి నీళ్ళు రాకుండా కర్ణాటక అడ్డుకుంటోన్న సీఎం రేవంత్ రెడ్డి మాత్రం స్పందించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రయోజనాలు గండి కొట్టిన ఆదిత్యానాథ్ దాస్‌ను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ సలహాదారుగా పెట్టుకోవడం దారుణమైన విషయమని హరీష్ రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణకు అన్యాయం చేసినందుకు గతంలో ఇదే ఆదిత్యానాథ్ దాస్‌కు మూడు నెలల జైలు శిక్ష పడిందని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు.
For Telangna News And Telugu News