Cyber Crime: పర్యాటకంలో సైబర్ దొంగలు
ABN , Publish Date - Jan 12 , 2025 | 05:05 AM
సైబర్ నేరగాళ్లు దేనినీ వదిలి పెట్టడం లేదు. బెదిరింపులు, డిజిటల్ అరెస్టుల నుంచి అనేక రూపాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు పర్యాటక ప్రాంతాలపైనా సైబర్ నేరస్తులు పంజా విసురుతున్నారు.
ప్రభుత్వ రిసార్టుల పేరిట నకిలీ వెబ్‌సైట్లు.. ఏకంగా ఏపీటీడీసీ పర్యవేక్షణలోని వాటిపైనే వల
2 రాష్ట్రాల్లోని పర్యాటక ప్రదేశాలే లక్ష్యంగా మోసాలు
సూర్యలంక హరిత బీచ్ రిసార్టు పేరిట సైబర్ మోసం
మేనేజర్ పేరిట హైదరాబాద్ వాసికి రూ.7,535కు టోపీ
గుర్తించిన బాధితుడు.. పోలీసులకు ఫిర్యాదు
(బాపట్ల-ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్లు దేనినీ వదిలి పెట్టడం లేదు. బెదిరింపులు, డిజిటల్ అరెస్టుల నుంచి అనేక రూపాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు పర్యాటక ప్రాంతాలపైనా సైబర్ నేరస్తులు పంజా విసురుతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో గదులు బుక్ చేసుకునే విషయంలో సైబర్ మోసాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ వాసిని సైబర్ నేరస్తులు ఇలాంటి మోసమే చేశారు. వారి బ్యాంక్ అకౌంట్ మధ్యప్రదేశ్‌లో ఉండగా.. ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్ మాత్రం బాపట్లలోనే ఉండడం విశేషం! అచ్చం ప్రభుత్వ వైబ్‌సైట్‌ను తలపించేలా నకిలీ సృష్టించి.. ఫోన్ నంబరుతో సహా వివరాలన్నీ ఆ సైట్‌లోనే పేర్కొని పక్కాగా నమ్మించి మోసం చేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆధీనంలోని రిసార్టుల్లో గదుల బుకింగే లక్ష్యంగా సాగుతున్న దందా వెలుగులోకి వచ్చింది.
ఏం జరిగింది?
హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఓ ప్రైవేటు ఉద్యోగి కుటుంబంతో కలిసి సెలవుల్లో బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో గడపడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నెల 12న గదుల బుకింగ్ కోసం ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను ఆశ్రయించారు. హరిత బీచ్ రిసార్టు పేరిట ఉన్న వెబ్‌సైట్‌లో కాంటాక్టు నంబరుకు ఫోన్ చేశారు. దీంతో మేనేజర్ తానేనంటూ సంజయ్ గుప్తా అనే వ్యక్తి పరిచయం చేసుకుని నగదు బదిలీ చేయాల్సిన ఖాతా వివరాలను వాట్సాప్ చేశారు. ఇక్కడే బ్యాకింగ్ సిస్టమ్‌లో ఉండే లొసుగులను ఆసరా చేసుకున్నారు. సహజంగా ప్రైవేటు బ్యాంకు ఖాతాలకు ఏ బ్రాంచ్ ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్ ద్వారా అయినా నగదు బదిలీ చేసే అవకాశం ఉంటుంది. సైబర్ నేరగాడు పంపించిన అకౌంట్ నంబరు మధ్యప్రదేశ్‌దే అయినా ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్ బాపట్లది చూపించడంతో బాధితుడికి అనుమానం రాలేదు. వెంటనే రెండు గదుల బుకింగ్ కోసం పంపించిన అకౌంట్ నంబరుకు రూ.7,535 బదిలీ చేశారు. ఇక అక్కడ నుంచి సైబర్ దొంగలు మరో ఎత్తుగడకు తెరతీశారు. నగదు బదిలీ కాలేదని, ఇంకోసారి పేమెంట్ చేయమని కోరగా, పేమెంట్ సక్సెస్ అయినట్లు తనకు మెసేజ్ రావడంతో ఉద్యోగికి అనుమానం వచ్చింది. పూర్తి వివరాలు అడగ్గా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో సైబర్ మోసానికి గురైనట్లు సదరు ఉద్యోగికి అర్థమైంది. వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడు నివాసం ఉంటున్న హైదరాబాద్ పరిఽధిలోని ఏరియా పోలీస్ స్టేషన్‌కి కేసును బదిలీ చేశారు.
విస్తుపోయే వాస్తవాలు
బాధితుడు నగదు బదిలీ చేసిన రోజే హైదరాబాద్‌లోని ఆ బ్యాంకు శాఖకు వెళ్లి అకౌంట్‌పై ఆరా తీయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. సైబర్ నేరగాడు పంపించిన ఖాతా నంబరు మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా పరిధిలోని డిరోయ్ ప్రాంతంలో ఉన్నట్లు తెలిసింది. మేనేజర్ పేరిట సంజయ్‌గుప్తా ఖాతా మాత్రం సౌరభ్‌సేన్ అనే వ్యక్తి పేరిట ఉన్నట్లు తేలింది. వేర్వేరు ప్రాంతాల నుంచి ఆ ఖాతాకు రూ.10 వేల లోపు నగదు జమ అవుతుండడం అవన్నీ కూడా ఎక్కువగా రెండు రాష్ట్రాల్లోని పర్యాటక ప్రదేశాల నుంచే కావడంతో సైబర్ నేరగాళ్ల లక్ష్యంపై స్పష్టత వచ్చింది. నెల క్రితం శ్రీశైలంలో కాటేజీల బుకింగ్‌లో కూడా రూ.28,000 సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్ పేరిట బురిడీ కొట్టించారనే ఫిర్యాదు కూడా హైదరాబాద్‌లోని ఆ బ్యాంకు శాఖ వద్దకే వచ్చినట్లు సమాచారం. కానీ, అప్పుడే ఆ ఖాతాను బ్లాక్ చేయాలంటే సైబర్ క్రైం డిపార్ట్‌మెంట్ నుంచి గాని, పోలీస్ శాఖ వద్ద నుంచి గాని ఆదేశాలు రావాల్సి ఉంటుంది. అయితే, అలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఖాతా కొనసాగుతూనే ఉందని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. కాగా, ప్రైవేటు బ్యాంకుల విషయంలో ఎక్కడి ఖాతాకైనా ఏ ప్రాంతం ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్ ద్వారా అయినా నగదు బదిలీ చేసే వీలుండడం సైబర్ నేరగాళ్లకు కలిసి వచ్చింది.
నిర్లక్ష్యమే కారణం
దాదాపు ఐదు నెలల క్రితం బాపట్ల సూర్యలంక తీరంలోని హరిత బీచ్ రిసార్ట్ విషయంలో 30 మంది వరకు పర్యాటకులు ఈ తరహా సైబర్ మోసాలకు గురయ్యారు. రూ.5 లక్షల వరకు సైబర్ నేరగాళ్లు దోచేశారు. ఖాతాల వివరాలతో సహా రిసార్టు మేనేజర్ బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్‌లో అప్పుడే ఫిర్యాదు చేశారు. తర్వాత ఆ తరహా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు విషయంలో పోలీసులు అంతంతమాత్రంగానే స్పందించారు. ఆ సమయంలో జరిగిన మోసాల్లో ఖాతా వివరాలు రాజస్థాన్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కానీ, అక్కడ వరకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకోవడం ఖర్చుతో కూడుకున్నవి కావడంతో పోలీసులు మౌనం వహించారు.
ప్రభుత్వ వెబ్‌సైట్‌నే నమ్మాలి!
ప్రభుత్వ ఆధీనంలో ఉండే అన్ని రిసార్టులకు హరిత అనే పేరుంటుంది. కానీ, ఏపీటీడీసీ పరిధిలోని టూరిజం.ఏపీ.గవ్.ఇన్ అనే వెబ్‌సైట్ మాత్రమే ప్రభుత్వ పర్వవేక్షణలో ఉంటుంది. సైబర్ నేరగాళ్లు హరిత బీచ్ రిసార్టు, సూర్యలంకతోపాటు మరికొన్ని పర్యాటక ప్రాంతాల పేరుతో హరిత రిసార్టును కా మన్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. గతంలోనూ సూర్యలంక హరిత బీచ్ రిసార్టు పేరుతో సైబర్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. గదులు బుక్ చేసుకునే పర్యాటకులు ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారానే ఆన్‌లైన్ ప్రక్రియ చేపట్టాలి.
జి. అశోక్, ఏపీటీడీసీ హరిత బీచ్ రిసార్ట్ మేనేజర్, సూర్యలంక