Share News

Formula-E: ఫార్ములా-ఈలో క్విడ్‌ ప్రోకో!

ABN , Publish Date - Jan 07 , 2025 | 04:50 AM

ఫార్ములా-ఈ కార్ల రేసు నిర్వహణ రూపంలో గ్రీన్‌ కో ఎనర్జీస్‌ కంపెనీకి, బీఆర్‌ఎస్‌ పార్టీకి మధ్య పరస్పర లబ్ధి(క్విడ్‌ ప్రో కో) జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Formula-E: ఫార్ములా-ఈలో క్విడ్‌ ప్రోకో!

  • గ్రీన్‌ కో నుంచి బీఆర్‌ఎ్‌సకు 41 కోట్ల విరాళం

  • 2022లో అనుబంధ సంస్థల ద్వారా చెల్లింపు

  • తర్వాత 2 నెలలకే పుట్టిన కంపెనీ ఏస్‌ నెక్స్ట్‌ జెన్‌

  • గ్రీన్‌ కో సంస్థ డైరెక్టర్లతోనే ఏర్పాటు

  • దాంతోనే ఫార్ములా-ఈ ఒప్పందం

  • ఏపీ, తమిళనాడుల్లో గ్రీన్‌ కో భారీ ప్రాజెక్టులు

  • హైదరాబాద్‌లో పుట్టి దేశమంతా విస్తరణ

  • దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల విలువ లక్ష కోట్లు

హైదరాబాద్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కార్ల రేసు నిర్వహణ రూపంలో గ్రీన్‌ కో ఎనర్జీస్‌ కంపెనీకి, బీఆర్‌ఎస్‌ పార్టీకి మధ్య పరస్పర లబ్ధి(క్విడ్‌ ప్రో కో) జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటై దేశవ్యాప్తంగా దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు నిర్వహిస్తున్న ఆ సంస్థ ఇక్కడి ప్రభుత్వం నుంచి ఏదో ఒక రూపంలో లబ్ధి పొందే లక్ష్యంతో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితికి భారీ ఎత్తున విరాళాలు ఇచ్చిందని అంచనా వేస్తున్నాయి. సొంతంగా, అనుబంధ సంస్థల ద్వారా అధికారికంగానే ఎన్నికల బాండ్ల రూపంలో ఈ సంస్థ రూ.41 కోట్ల విరాళాలు ఆ పార్టీకి అందజేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. 2022 ఏప్రిల్‌ 8న ఒకేరోజు రూ.31 కోట్లు, అక్టోబరు 10న మరో పది కోట్లు గ్రీన్‌కో, అనుబంధ సంస్థలు కలిపి చెల్లించుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. విరాళాలు అందజేసిన రెండు నెలల్లోనే గ్రీన్‌ కో డైరెక్టర్లు అయిన అనిల్‌ చలమలశెట్టి, మహేష్‌ కొల్లి కలిసి రాష్ట్రంలో ఫార్ములా ఈ రేస్‌ నిర్వహణ కోసం అప్పటికప్పుడు ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ అనే సంస్థను ఏర్పాటు చేయడాన్ని గుర్తు చేస్తున్నాయి.


ఆ తర్వాత అదే సంస్థతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫార్ములా ఈ కార్ల రేసు నిర్వహణకు ఒప్పందం చేసుకోవడం గమనార్హం. గ్రీన్‌కో ఎనర్జీ్‌సతో పాటు దాని అనుబంధ కంపెనీలు గ్రీన్‌కో సోలార్‌ పవర్‌, గ్రీన్‌కో శ్రీసాయికృష్ణ హైడ్రో ఎనర్జీ, గ్రీన్‌కో రాయల విండ్‌ పవర్‌, సనోలా విండ్‌ ప్రాజెక్ట్‌, రాయలసీమ విండ్‌ ఎనర్జీ, ఆస్మాన్‌ ఎనర్జీ, అనంతపుర విండ్‌ ఎనర్జీస్‌, గంగ్‌దారీ హైడ్రోపవర్‌, సరోజ రెన్యువబుల్స్‌, శ్రేయాస్‌ రెన్యువబుల్‌ ఎనర్జీస్‌, ఆచింత్య సోలార్‌ పవర్‌, పెన్నార్‌ రెన్యువబుల్స్‌, సువర్చాస్‌ సోలార్‌ పవర్‌, విశ్వరూప సోలార్‌ పవర్‌, సనోలా విండ్‌ ప్రాజెక్ట్స్‌, గ్రీనిభ్రిత్‌ సోలార్‌ పవర్‌ బీఆర్‌ఎ్‌సకు విరాళాలు ఇచ్చిన సంస్థల్లో ఉన్నాయి. ఒక్కో సంస్థ రూ.కోటి నుంచి నాలుగు కోట్ల వరకు బీఆర్‌ఎ్‌సకు విరాళాలు ఇచ్చాయి. గ్రీన్‌ కో దాని అనుబంధ సంస్థల ద్వారా విరాళాలుగా ఇచ్చిన రూ.41 కోట్లకు ప్రతిఫలంగానే గ్రీన్‌కో డైరక్టర్లు ప్రారంభించిన ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ కంపెనీకి ఫార్ములా ఈ రేస్‌ నిర్వహణ బాధ్యతలను అప్పగించారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2022లో బీఆర్‌ఎ్‌సకు బాండ్లు అందిన తర్వాతే 2023 ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేసు జరిగిందని గుర్తు చేస్తున్నాయి.


గ్రీన్‌ కో బాహుబలి సంస్థ

గ్రీన్‌కో ఎనర్జీస్‌ కంపెనీ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ కేంద్రంగా 2000 సంవత్సరంలో ఏర్పడింది. చాలా తక్కువ కాలంలోనే భారీ కంపెనీగా ఎదిగింది. అటు వ్యాపార వర్గాల్లో, ఇటు రాజకీయ, సినీ ప్రముఖుల్లో గ్రీన్‌ కో సుపరిచితమైన పేరు. చలమలశెట్టి అనిల్‌ గ్రీన్‌కో డైరెక్టర్‌గా ఉన్నపుడు ఆయన సోదరుడు సునీల్‌ అన్ని రాజకీయ పార్టీలతో సన్నిహిత సంబంధాలను నిర్వహించారు. వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా పైకి అనిల్‌ కనిపించినా కంపెనీకి కావాల్సిన అండదండలను రాజకీయ పార్టీల నుంచి సమకూర్చేది సునీలేనని సమాచారం. సునీల్‌ అన్ని రాజకీయ పార్టీలకూ సన్నిహితుడే. సునీల్‌ కాకినాడ లోక్‌సభ నియోజకవర్గంలో 2009లో ప్రజారాజ్యం నుంచి, 2019లో టీడీపీ నుంచి, 2024లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మూడు సార్లు మూడు పార్టీల నుంచి బరిలో దిగి ఓడిపోయినా అసలు లక్ష్యం నెరవేరింది. రాజకీయ సంబంధాలు ఆయనకు వ్యాపార విస్తరణకు ఉపయోగపడ్డాయని అంటారు. గ్రీన్‌ కో ద్వారా పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి రంగంలో అనేక ప్రాజెక్టులు చేపట్టారు. ప్రస్తుతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రూ.25 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఈ సంస్థ చేతిలో ఉన్నాయి.


అనుబంధ సంస్థలు వివిధ రాష్ట్రాల్లో దక్కించుకున్న ప్రాజెక్టులన్నీ కలిపితే సంస్థ పనులు రూ.లక్ష కోట్ల వరకు ఉంటాయని అంచనా. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న గ్రీన్‌కో కంపెనీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌తో పాటు 15 రాష్ట్రాల్లో 7.5 గిగావాట్‌ సామర్థ్యం కలిగిన భారీ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లను నిర్వహిస్తోంది. తమిళనాడులో ఏకంగా 33 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్‌ కేంద్రాలు పెట్టేందుకు ఈ సంస్థ అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలులోని పిన్నాపురం వద్ద 1680 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్‌ను నిర్మిస్తోంది. తెలంగాణలో పదేళ్లు ఏలిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్న గ్రీన్‌కో దేశమంతటా విస్తరించినా రాష్ట్రంలో మాత్రం విస్తరించలేక పోయింది. పదేళ్ల కిందట తెలంగాణలో పవన విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి, ప్రభుత్వానికి సమర్పించింది. ములుగు జిల్లాలో రూ.18,203 కోట్లతో 3960 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధమైంది. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ దీనికి క్లియరెన్స్‌ ఇవ్వడానికి వీలుగా విచారణ విధి విధానాలను కూడా జారీ చేసింది. ఈ రెండు కీలక ప్రాజెక్టులు కార్యరూపం దాల్చకుండానే ఆగిపోయాయి.

Updated Date - Jan 07 , 2025 | 04:50 AM