Share News

Hyderabad: సంక్రాంతికి ముందే హైదరాబాదీలకు మరో పండగ.. నేటి నుంచి ప్రారంభం..

ABN , Publish Date - Jan 03 , 2025 | 08:22 AM

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ జోష్‌లో ఉండగానే హైదరాబాదీలను ఖుషీ చేసేందుకు మరో పండగ వచ్చేసింది. సంక్రాంతికి ముందే వచ్చే ఈ పండగ నేటి నుంచే ప్రారంభమైంది.

Hyderabad: సంక్రాంతికి ముందే హైదరాబాదీలకు మరో పండగ.. నేటి నుంచి ప్రారంభం..
Numaish Exhibition

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ జోష్‌లో ఉండగానే హైదరాబాదీలను ఖుషీ చేసేందుకు మరో పండగ వచ్చేసింది. సంక్రాంతికి ముందే వచ్చే ఈ పండగ నేటి నుంచే ప్రారంభమైంది. అదే ప్రపంచంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్.. నుమాయిష్. ఇక్కడ దొరకని వస్తువులంటూ ఉండవు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఉన్న స్థానికులు మొదలుకుని ప్రముఖ కంపెనీల వరకూ ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. అదొక్కటేనా.. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఎంటర్‌టైన్ చేసేందుకు రకరకాల థీమ్స్, ఈవెంట్స్‌తో పాటు ఆహారప్రియుల కోసం ప్రత్యేక ఫుడ్‌కోర్టులు నిర్వహిస్తారు. అందుకే, కొత్త సంత్సరం వెంటబెట్టుకొచ్చే ఈ ఎగ్జిబిషన్ కోసం ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తారు హైదరాబాదీలు. 8 దశాబ్దాలకు పైగా ఏటా జనవరి 1 నుంచి 45 రోజులపాటు జరిగే నాంపల్లి ఎగ్జిబిషన్ చరిత్ర ఏంటి.. ఈ ప్రదర్శనకు ఎందుకంత ప్రాముఖ్యత.. తదితర విశేషాలేంటో తెలుసుకుందాం..


నుమాయిష్ మొదలైందిలా..

స్థానిక ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో 1937లో ఉస్మానియా పట్టభద్రుల సంఘం నుమాయిష్ ఏర్పాటు కోసం నివేదిక తయారుచేసి ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌అలీఖాన్‌కు పంపించింది. అందుకు నిజాం అనుమతి లభించడంతో తొలిసారి 1938 ఏప్రిల్‌ 6వ తేదీన పబ్లిక్ గార్డెన్‌( అప్పటి బాగేఆమ్‌)లో ఏడవ నిజాం చేతులమీదుగా మొదలైంది.. నుమాయిష్‌ మస్నూవత్‌ ఇ ముల్కీ.. అంటే స్థానిక ఉత్పత్తుల ప్రదర్శనశాల. తొలి ఏడాది 10 రోజులు పాటే నుమాయిష్ నిర్వహించారు. తర్వాత ప్రజల్లో ఆదరణలాగే నుమాయిష్‌లో స్టాళ్ల సంఖ్య ఏటికేడు పెరగసాగింది. దీంతో స్థలాభావం కారణంగా 1946 తర్వాత నుంచి నాంపల్లిలో నిర్వహించడం మొదలుపెట్టారు.


అతిపెద్ద మేళా..

స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటైన నుమాయిష్‌లో...ప్రముఖ పారిశ్రామిక సంస్థలు స్టాళ్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతాయి. అందుకే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనగా వ్యవహరిస్తారు. ఇక్కడ రూ.10 నుంచి లక్షల రూపాయల విలువైన వైవిధ్యమైన వస్తువులు లభిస్తాయి. దేశవిదేశీ పరిశ్రమల్లో తయారైన వస్త్రాలు, దుప్పట్లు, హ్యాండీక్రాఫ్ట్స్ సహా లక్షల వెరైటీలు నాంపల్లి గ్రౌండ్స్‌లో ‌కొలువు దీరతాయి. మహిళలు మాత్రమే కొన్ని స్టాళ్లు నిర్వహిస్తుంటారు. పిల్లలు, పెద్దలను అలరించేందుకు ఎగ్జిబిషన్‌‌లో టాయ్ ట్రైన్స్, గేమ్స్, మ్యాజిక్ షోలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సారి ఎగ్జిబిషన్ అంతా చుట్టి వచ్చేందుకు డబుల్ డెక్కర్ బస్సును అందుబాటులోకి తెచ్చారు. 26 ఎకరాల్లో నిర్వహించే నుమాయిష్‌కు ఏటా 25 లక్షల మందికి పైగా సందర్శకులు తరలివస్తారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా పదివేలమందికి ఉపాధి లభిస్తుంది. ఈసారి 2500పైగా స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి.

Updated Date - Jan 03 , 2025 | 08:22 AM