Cold Wave: చలి.. అసలు ‘తగ్గేదేలే’
ABN , Publish Date - Jan 06 , 2025 | 04:08 AM
రాష్ట్రంలో అసలు ‘తగ్గేదేలే’ అన్నట్లు చలి విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి.
అర్లీలో 5.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
రాష్ట్రవ్యాప్తంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్/ కోహీర్/ ఆసిఫాబాద్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అసలు ‘తగ్గేదేలే’ అన్నట్లు చలి విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. ఈ సీజన్‌లోనే అత్యల్పంగా శనివారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా అర్లీ (టీ)లో 5.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యూ)లో 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవగా, తిర్యాణి మండలంలోని గిన్నెధరి గ్రామంలో 6.1 డిగ్రీలు, తిర్యాణిలో 7.3 డిగ్రీలు, వాంకిడి, కెరమెరిలో 7.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలితీవ్రత ఒక్కసారిగా పెరగడంతో జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు వణికిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 7.1 డిగ్రీలు నమోదవగా, అల్గోల్‌లో 7.7, మల్‌చెల్మలో 9.5, మొగుడంపల్లిలో 9.8, సత్వార్‌లో 9.8, న్యాల్‌కల్‌లో 6.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని చిప్పల్‌తుర్తిలో 10.7, నర్సాపూర్‌లో 11.1, సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్-భూమ్‌పల్లి 10.9, కొండపాక 11.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో రాబోయే మూడు రోజులలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని, ఆదిలాబాద్ జిల్లాలో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.