Share News

Leopard: ఆ జిల్లాను వణికిస్తున్న చిరుత పులులు.. తాజాగా ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Jan 20 , 2025 | 11:24 AM

రాజన్న సిరిసిల్ల: కొన్ని నెలలుగా చిరుత పులుల సంచారం జిల్లా వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మనుషులు, మూగజీవాలపై దాడులు చేస్తూ తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ శివారు ప్రాంతంలో చిరుతపులి సంచరించినట్లు గ్రామస్థులు తెలిపారు.

Leopard: ఆ జిల్లాను వణికిస్తున్న చిరుత పులులు.. తాజాగా ఏం జరిగిందంటే..
Leopard

రాజన్న సిరిసిల్ల: కొన్ని నెలలుగా చిరుత పులుల(Leopard) సంచారం జిల్లా వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మనుషులు, మూగజీవాలపై దాడులు చేస్తూ తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా గంభీరావుపేట (Gambhiraopeta) మండలం ముస్తఫానగర్ (Mustafanagar) శివారు ప్రాంతంలో చిరుతపులి సంచరించినట్లు గ్రామస్థులు తెలిపారు. రాసమల్లరాజు అనే రైతుకు చెందిన గేదెపై గ్రామ శివారు ప్రాంతంలో చిరుత దాడి చేసి చంపేసింది. చిరుతను గమనించిన కొంతమంది రైతులు పెద్దఎత్తున హాహాకారాలు చేసుకుంటూ గ్రామంలోకి పరుగులు పెట్టారు. అనంతరం విషయాన్ని గ్రామస్థులకు తెలియజేశారు. కాగా, చిరుత సంచారం నేపథ్యంలో ముస్తఫానగర్ ప్రజలు, రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గ్రామంలోకి వచ్చి దాడి చేస్తుందేమోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విషయాన్ని అటవీశాఖ అధికారులకు చేరవేశారు.


కాగా, గతేడాది డిసెంబర్ 15న ఓ యువకుడిపై చిరుతపులి దాడి చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇల్లంతకుంట మండలం వెల్జీపూర్ గ్రామంలో బొల్లారం నాగరాజు అనే రైతుకు చెందిన లేగదూడపై చిరుత దాడి చేసి చంపేసింది. అలాగే ముస్తాబాద్ మండలం చిప్పలపల్లిలోనూ చిరుత సంచరించింది. చిప్పల్లపల్లి శివారులో దూడపై దాడి చేసి తినేసింది. వరస ఘటనలతో జిల్లా ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఎప్పుడు ఎటు నుంచి చిరుత వచ్చి దాడి చేస్తుందేమోనని వణికిపోతున్నారు.

Updated Date - Jan 20 , 2025 | 11:26 AM