Telangana MLC Result: తెలంగాణ ఫలితంపై ఉత్కంఠ.. ఎక్కువ ఓట్లు వచ్చినా.. ఇలా జరిగితే ఆ అభ్యర్థి అవుట్
ABN , Publish Date - Mar 04 , 2025 | 01:31 PM
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఎవరు విజయం సాధిస్తారనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా సాగే ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో అభ్యర్థి విజయాన్ని ఎలా నిర్దారిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో గెలుపు ఎవరనే ఉత్కంఠ వీడలేదు. ఇప్పటివరకు ఓట్లను కట్టలు కట్టారు. చెల్లని ఓట్లను తీసేసి, విజయానికి కావల్సిన కోటాను ఎన్నికల అధికారి నిర్ణయిస్తారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. ఇక్కడ ఫలితం వెలువడటానికి మరో 24 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలింగ్ పూర్తైన తర్వాత బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గెలుస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పేరు గట్టిగా వినిపించింది. బ్యాలెట్ బాక్సులు తెరిచిచూస్తే మాత్రం ప్రసన్న హరికృష్ణ మొదటి ప్రాధాన్యత ఓట్లలో మూడో స్థానానికి పరిమితమయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మొటి ప్రాధాన్యత ఓటు వేసిన ఓటర్లు రెండో ప్రాధాన్యత ఓటు ప్రసన్న హరికృష్ణకు వేసే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. ప్రసన్న హరికృష్ణ రెండో స్థానంలో ఉండి.. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఒకరు 3వ స్థానంలో ఉంటే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ప్రసన్న హరికృష్ణ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో ఉంటే మాత్రం ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన ఓటర్ల బ్యాలెట్ పేపర్‌లో రెండో ప్రాధాన్యత ఓట్లను ఒకటి, రెండో స్థానంలో ఉన్న అభ్యర్థికి బదలాయిస్తారు. అలా జరిగితే అంజిరెడ్డి, నరేందర్ రెడ్డికి తొలి ప్రాధాన్యత ఓటు వేసి.. ప్రసన్న హరికృష్ణకు రెండో ప్రాధాన్యత వేసిన హరికృష్ణ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య గట్టిపోటీ ఉండే అవకాశం ఉంది.
ఇదే జరిగితే..
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానంలో గెలుపుపై కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ త్రిముఖ పోరులో కాంగ్రెస్ ఓట్లను ప్రసన్న హరికృష్ణ బాగా చీల్చారాని, ఓట్ల చీలిక బీజేపీకి లాభం చేసిందనే ప్రచారం జరుగుతోంది. మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా పోటీ మాత్రం నలుగురి మధ్య ఉంటుందని అంచనా వేయగా.. చివరికి ముగ్గురు మధ్య ప్రధాన పోటీ నడిచింది. ప్రసన్న హరికృష్ణ రెండో స్థానంలో ఉంటే మాత్రం గెలుపు అవకాశాలు ఎక్కువుగా ఉండొచ్చు. మూడో స్థానంలో ఉంటే మాత్రం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.
మొత్తం 56 మంది
సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల ఎన్నిక కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఓట్ల లెక్కింపులో తేడా ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంతమంది పోటీఉంటే అన్ని ఓట్లను ఒక ఓటరు వేయవచ్చు. అయితే వీటిలో ప్రాధాన్యత క్రమం ఉంటుంది. ఒకటో ప్రాధాన్యత ఒక అభ్యర్థికి మాత్రమే వేయాలి. ఆ తర్వాత క్రమసంఖ్య ప్రకారం 56 వరకు ఓట్లు వేయవచ్చు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత కోటా ఓట్లు రాకపోతే అతి తక్కువ ఓట్లు సాధించి చివరి స్థానంలో ఉన్న అభ్యర్థిని ఎలిమినేట్ చేసి, ఆ అభ్యర్థి బ్యాలెట్ పేపర్లలో రెండో ప్రాధాన్యత ఓటును పైనున్న అభ్యర్థులకు బదలాయిస్తారు. ఇలా కోటా ఓట్లు వచ్చే వరకు లెక్కింపు కొనసాగుతుంది. ఎప్పుడైతే కోటా ఓట్లు వస్తాయో.. అప్పుడు లెక్కింపు ప్రక్రియ ఆపి.. ఫలితాన్ని ప్రకటిస్తారు. 56 మంది పోటీలో ఉన్నప్పటికీ సాధారణంగా మూడు, నాలుగు స్థానాల్లో ఉండే అభ్యర్థుల ఎలిమినేషన్‌తోనే ఫలితం తేలే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..
సిట్ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here