ABN ఎవరికీ భయపడదు.. ఎలాంటి కథనం ప్రసారం చేయడానికీ వెనుకాడదు.. దూసుకెళ్తున్న దమ్మున్న చానెల్

ABN , First Publish Date - 2021-10-15T17:33:10+05:30 IST

ఏబీఎన్‌ ఎవరికీ భయపడదు. ఎలాంటి కథనం ప్రసారం చేయడానికైనా వెనుకాడదు...

ABN ఎవరికీ భయపడదు.. ఎలాంటి కథనం ప్రసారం చేయడానికీ వెనుకాడదు..  దూసుకెళ్తున్న దమ్మున్న చానెల్

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి మొదలై పుష్కరమే అయినా.. ఈ కాలంలోనే ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. ఎన్నెన్నో విజయాలు సాధించింది. జర్నలిజంలో నూతన ఒరవడులను సృష్టించింది. ఇప్పుడు పుష్కరోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా సామాజిక బాధ్యతతో అధిగమించిన మైలురాళ్లలో కొన్నింటిని ఓసారి నెమరేసుకుందాం... 


ఏబీఎన్‌ ఎవరికీ భయపడదు. ఎలాంటి కథనం ప్రసారం చేయడానికైనా వెనుకాడదు. ఎవరి గుట్టును బయట పెట్టడానికైనా జంకు చూపించదు. ఏ ఉన్నతాధికారి తప్పు చేసినా, ఏ వ్యవస్థల్లో పొరపాట్లు దొర్లినా ఉన్నది ఉన్నట్లు, నిజమైన, నిఖార్సైన కథనాలను ప్రసారం చేస్తుంది. ఆధారాలతో సహా బయటపెడుతుంది. అధికారంలో ఉన్నవాళ్ల తప్పులను ఎత్తిచూపుతుంది. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతుంది. అదే సమయంలో బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది. ఒక అధికార భవనంలో జరిగిన రాసలీలల వ్యవహారాల గుట్టును ధైర్యంగా ప్రసారం చేసింది దమ్మున్న ఛానెల్‌ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆ కథనం ప్రకంపనలు సృష్టించింది.


ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో అనైతిక సంబంధం బండారాన్ని కూడా ఏబీఎన్‌ బట్టబయలు చేసింది. ఆలయంలో పనిచేసే ఓ ఉద్యోగి అక్కడే పనిచేసే సహోద్యోగినితో సాగిస్తున్న రాసలీలల వ్యవహారం ఏబీఎన్‌ కెమెరాకు చిక్కింది. ఆ వార్తలను నిర్భీతిగా ప్రసారం చేసింది ఏబీఎన్‌. ఈ కథనంతో స్పందించిన ఉన్నతాధికారులు ఆ ఉద్యోగులిద్దరినీ సస్పెండ్‌ చేశారు.


విజయవాడలో పాస్‌పోర్ట్‌ ఆఫీస్‌నే బార్‌గా మార్చిన రీజినల్‌ పాస్‌పోర్ట్‌ ఆఫీసర్‌ తతంగాన్ని కూడా ఏబీఎన్‌ కెమెరాలో బంధించింది. ఓ మధ్యాహ్నం వేళ.. తన ఛాంబర్‌లోనే మందుబాటిల్‌ ఓపెన్‌ చేసి.. మామిడికాయ చట్నీని స్టఫ్‌గా లాగిస్తున్న పాస్‌పోర్ట్‌ ఆఫీసర్‌ దృశ్యాలను ఏబీఎన్‌ ప్రసారం చేసింది. ఆ కథనం ప్రసారమైన వెనువెంటనే ఉన్నతాధికారులు రియాక్ట్‌ అయ్యారు. ఆ అధికారిని సస్పెండ్‌ చేశారు. 


ఐపీఎస్‌ అధికారి సీతారామాంజనేయులు బెజవాడ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో ఓ మహిళా డాక్టర్‌ను వేధించిన వ్యవహారాన్ని మొదటగా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి బట్టబయలు చేసింది. 2010 సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో మహిళా డాక్టర్‌, బెజవాడ సీపీ మధ్య జరిగిన సెల్‌ఫోన్‌ సంభాషణలు, ఎస్‌ఎంఎస్‌ల ఆధారాలను గుర్తించిన ఏబీఎన్‌.. వాటిపై ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. దీంతో, అప్పటి డీజీపీ అరవిందరావు విచారణకు ఆదేశించారు. ఆధారాలను పరిశీలించిన కమిటీ.. తమ నివేదికను సమర్పించింది. దీంతో, సీపీ సీతారామాంజనేయులును బదిలీ చేశారు. ఏబీఎన్‌ సంపాదించిన ఆధారాల క్రమంలో.. విచారించిన కమిటీ.. సమస్యలతో తనను ఆశ్రయించిన మరికొందరు మహిళలను కూడా అప్పటి బెజవాడ సీపీ ట్రాప్‌ చేశారని నిర్ధారించినట్లు అప్పట్లో చెప్పుకున్నారు కూడా. ఈ వ్యవహారం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సెన్సేషనల్‌ అయ్యింది.


రాగ ద్వేషాలకు అతీతంగా, తన పర భేదాలు లేకుండా పనిచేసేవాళ్లే విలేఖరులు.. అలాంటి రిపోర్టింగే అసలైన పాత్రికేయం అని పాత్రికేయ ఉద్ధండులు పాఠాలు బోధిస్తారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎప్పుడూ ఆ నైజాన్ని అనుసరిస్తుంది. ఆ క్రమంలోనే.. 2018లో విజయవాడ దుర్గగుడిలో క్షుద్రపూజల వ్యవహారాన్ని మొట్టమొదటగా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి బట్టబయలు చేసింది. సీసీకెమెరాల ఫుటేజీని కూడా ప్రసారం చేసింది. దీంతో, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో ఉన్నతస్థాయి కమిటీ వేస్తే మూడు రోజుల్లోనే నివేదిక సమర్పించారు. ఆసమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ.. అధికార తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తన కుమారుడు లోకేష్‌కోసమే దుర్గగుడిలో క్షుద్రపూజలు చేయించారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. అయితే, ఐఏఎస్‌ అధికారుల నివేదికతో అప్పటి ఆలయ ఈవో సూర్యకుమారిని ప్రభుత్వం బదిలీ చేసింది. 

స్పాట్‌...


ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ హయాంలో జరుగుతున్న అక్రమాల పుట్టను బద్దలు కొట్టింది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. ప్రధానంగా దుర్గమ్మ గుడిలో చీరల కుంభకోణం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. దేవాలయ భూముల సెటిల్‌మెంట్‌ వ్యవహారంపై ఆధారాలతో సహా కథనాలు ప్రసారం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పలువురిమీద చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు. ఈ వ్యవహారంలో మంత్రి వెల్లంపల్లి  పీఏపై కేసు నమోదయ్యింది. మంత్రి ఓఎస్డీని సరెండర్‌ చేశారు. అలాగే, దుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు మాయమైన విషయంలోనూ ఏబీఎన్‌ ముందుగా వార్తా కథనాలు ఇచ్చింది. 


ఇక, అమరావతి ఉద్యమంలో ప్రజల గొంతుకగా నిలబడుతోంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. రాజధానిని మార్చేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు, రూపొందిస్తున్న ప్రతిపాదనలు రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరమంటూ ఎత్తిచూపుతోంది. రాజధానికోసం భూములిచ్చిన రైతులను జైలు పాలు చేసినా, తమ పంట పొలాలలను ధారాదత్తం చేసిన మహిళా రైతుల మీద లాఠీచార్జీలకు పాల్పడినా, మహిళా రైతుల రక్తం కళ్ల జూస్తున్నా.. ప్రతి పరిణామాన్ని రిపోర్ట్‌ చేస్తోంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. వైసీపీ సర్కారు తీరును ఏబీఎన్‌ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తోంది. ప్రజా ఉద్యమానికి మద్దతుగా నిలుస్తోంది. అమరావతి రైతులు ఉద్యమించిన ప్రతిసారీ ప్రజల గొంతుక అవుతోంది. ఫలితంగా అమరావతి రైతులకు భరోసా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి అని గొప్పగా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. 


అలాగే, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమానికీ వెన్నుదన్నుగా నిలుస్తోంది దమ్మున్న ఛానెల్‌ ఏబీఎన్‌. 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అంటూ మరోసారి ఆనాటి ఉద్యమ స్మృతులను నెమరేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బయటకు చెబుతున్న మాటలు, అంతర్గతంగా సాగిస్తున్న  వ్యూహాలను ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తోంది. విశాఖ ఉక్కు విషయంలో రాజకీయ పార్టీల బండారాన్ని కూడా పారదర్శకంగా ప్రసారం చేస్తోంది. ఉక్కు సంకల్పంతో ఉద్యమకారులకు, స్థానిక ప్రజలకు అండగా నిలుస్తోంది. ప్రభుత్వ రంగంలో విజయవంతంగా కొనసాగుతున్న పరిశ్రమను ప్రైవేటుకు అప్పగిస్తే ఎలాంటి పరిణామాలుంటాయో ప్రత్యేక కథనాల ద్వారా చూపించడమే కాదు.. హెచ్చరిస్తోంది. ప్రత్యేక చర్చలు చేపడుతోంది. 

స్పాట్‌... 



మొన్నటికి మొన్న.. ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకుల ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. మీడియా సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేతలు.. సర్కారు పెద్దల నుంచి ఫోనొస్తే.. ఎంతలా వణికిపోతారో, ఎలా వాళ్లకు కంట్రోల్‌లో ఉంటామని జీహుజూర్‌ అంటారో కళ్లకు కట్టినట్టు చూపించింది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. మీడియా సమావేశంలో ఉండగా..  ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్‌ చేసిన సమయంలో ఏపీ జేఏసీ నాయకుడు బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి నాయకుడు బొప్పరాజు.. ఏ విధంగా రియాక్ట్‌ అయ్యారో ప్రేక్షకులే చూశారు. 


మొన్నటికి మొన్న విశాఖలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన వైసీపీ సర్కారు బాగోతాన్ని మొదటగా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి బట్టబయలు చేసింది. డాక్యుమెంట్లను కూడా బయటపెట్టి.. ఆధారాలతో సహా ప్రజల ముందుంచింది. విశాఖలోని మొత్తం 128 ఎకరాలున్న 13 ఆస్తులను ఎస్‌బీఐ క్యాప్‌ ట్రస్టీ కంపెనీకి తాకట్టు పెట్టింది. ఈ ఆస్తుల మార్కెట్‌ విలువ 2వేల 9వందల 54 కోట్లుగా చెబతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌కు తొలుత ఈ ఆస్తులను బదలాయించి.. ఆ తర్వాత కార్పొరేషన్‌ తరపున తనఖా పెట్టేశారు. సెప్టెంబర్‌ 27వ తేదీన విజయవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఈ తాకట్టు ప్రక్రియ జరిగింది. ఈ వ్యవహారాన్ని మొట్టమొదటగా బయటపెట్టింది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. అంతేకాదు.. రెండోదశలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విజయవాడలోని బరమ్‌పార్క్‌, నెల్లూరు, కర్నూలు, కడప, దిండిలో ఉన్న హరిత రిసార్ట్‌లు వంటి ఆస్తులను తనఖా పెట్టి రుణాలు తీసుకునేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ వ్యవహారాన్ని కూడా ఏబీఎన్‌ బయటపెట్టింది.


క్షణక్షణం అప్రమత్తంగా ఉంటూ అందరి కంటే ముందుగా సమాచారాన్ని ప్రేక్షకులకు అందిస్తూ న్యూస్‌రూమ్‌ అప్‌డేట్స్‌ దూసుకెళ్తున్నాయి. ఏబీఎన్‌ టీమ్.. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంటూ, చురుకైన పాత్రను పోషిస్తూ సంస్థ ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా వార్తా ప్రసారాలకు మెరుగులు దిద్దుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ సందర్భాల్లో ఎగిసిన ఉద్యమాలకు సంబంధించిగానీ, గతేడాది దేశ రాజధానిలో వెల్లువెత్తిన రైతు ఉద్యమం గురించి గానీ, ఇటీవలే అఫ్ఘానిస్తాన్‌లో చోటు చేసుకున్న పరిణామాలపై గానీ మినిట్‌ టు మినిట్‌ అప్‌డేట్స్‌ ప్రసారం చేసింది. నాన్‌స్టాప్‌ కవరేజీతో వార్తల ప్రాధాన్యతకు పెద్దపీట వేసింది. న్యూస్‌రూమ్‌ డ్రైవ్‌లతో జనం అటెన్షన్‌ను ఇటువైపు తిప్పేలా చేసింది.


సంప్రదాయ మీడియాగా మీడియా రంగంలో ప్రవేశించినప్పటికీ.. ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను ఒడిసిపట్టుకుంటూ, టెక్నాలజీని వంట బట్టించుకుంటూ, ఆధునిక పరిజ్ఞానాన్ని మిళితం చేసుకుంటూ దూసుకుపోతున్న ఏబీఎన్‌ ప్రస్తుతం డిజిటల్‌ ఎరాలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. నెక్ట్స్‌ జనరేషన్‌ కోసం.. నెక్ట్స్‌ లెవెల్‌ ప్రోగ్రామ్‌లకు రూపకల్పన చేస్తోంది. డిజిటల్‌ ఎరాలో డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను మిగతా మీడియా సంస్థలకన్నా భిన్నంగా, ఇతర సంస్థల కన్నా వినూత్నంగా తీర్చిదిద్దింది. ప్రత్యేక టీమ్‌ ద్వారా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పైనా తన సహజ ధోరణిలోనే దూసుకుపోతోంది. డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌కోసమే ఎక్స్‌క్లూజివ్‌గా కొన్ని  స్పెషల్‌ ప్రోగ్రామ్‌లను, ప్లే లిస్ట్‌లను డిజైన్‌ చేసింది ఏబీఎన్‌. డీజే న్యూస్‌, ఆర్‌జె న్యూస్‌, ఏబీఎన్‌ 3 మినిట్స్‌, ఏబీసీ న్యూస్‌ పేరిట తనదైన శైలిలో స్పెషల్ న్యూస్‌ను ప్రెజెంట్‌ చేస్తోంది. 


- సప్తగిరి గోపగోని, చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి


ఇవి కూడా చదవండిImage Caption

Updated Date - 2021-10-15T17:33:10+05:30 IST