Chief Minister Jagan : జనం మెచ్చని జగన్
ABN , First Publish Date - 2023-01-29T03:09:31+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ గ్రాఫ్ భారీగా పడిపోయింది. ‘సంక్షేమంలో, అభివృద్ధిలో, పారదర్శక పాలనలో మేమే టాప్’ అని ప్రభుత్వం చెబుతుండగా...
ప్రజాదరణ.. 56.5% నుంచి 39.7 శాతానికి డౌన్
ఏడాదిలోనే భారీగా పడిపోయిన గ్రాఫ్
సీ-ఓటర్ ఇండియా టుడే సర్వే
అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్ గ్రాఫ్ భారీగా పడిపోయింది. ‘సంక్షేమంలో, అభివృద్ధిలో, పారదర్శక పాలనలో మేమే టాప్’ అని ప్రభుత్వం చెబుతుండగా... అంత సీన్ లేదని రాష్ట్ర ప్రజలు తేల్చేసినట్లు ‘సీ ఓటర్ - ఇండియా టుడే’ సర్వే తెలిపింది. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులకు వారి సొంత రాష్ట్రాల్లో ఉన్న ప్రజాదరణపై ఈ సర్వే జరిగింది. 2022 జనవరిలో జరిగిన సర్వేలో జగన్ పనితీరుపై 56.5శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో అది 17 శాతం తగ్గి... 39.7శాతానికి పడిపోయింది. ఈ జాబితాలో 73.2శాతం ఓట్లతో ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ అగ్రస్థానంలో నిలిచారు. ఇక... ‘ఎవరు బెస్ట్ సీఎం’ అని ప్రశ్నించినప్పుడు గతేడాది జగన్‌కు 3.9శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 1.6శాతానికి పడిపోయాయి. ఈ జాబితాలో 39.1శాతం ఓట్లతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అగ్రస్థానంలో ఉన్నారు. ఇక... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏ జాబితాలోనూ చోటు దక్కలేదు.
వైసీపీలో మళ్లీ కలవరం...
మంత్రులు, మాజీ మంత్రులకు సంబంధించిన 38 నియోజకవర్గాల్లో... కేవలం ఏడుగురే మళ్లీ గెలుస్తారంటూ ‘ఐప్యాక్’ సర్వే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై వైసీపీలో కలవరం కొనసాగుతుండగానే జగన్‌కు ప్రజాదరణ భారీగా తగ్గిందంటూ ‘సీఓటర్- ఇండియా టుడే’ సర్వే బయటికి వచ్చింది. ఈ జాబితాలో... రెండోస్థానంలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రజాదరణ 58.9 శాతం నుంచి 69.2 శాతానికి పెరగడం గమనార్హం. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ(3), ఛత్తీ్‌సగఢ్ సీఎం భూపేశ్ బఘేల్(4), మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్(5), యూపీ సీఎం ఆదిత్యనాథ్(7), గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్(9) ప్రదరణ పెంచుకున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌ధామి ప్రజాదరణ 1.5శాతం తగ్గింది. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రజాదరణ 60నుంచి 45శాతానికి పడిపోయింది.
సీఎం - స్వరాష్ట్రాల్లో ప్రజాదరణ
1. నవీన్ పట్నాయక్, ఒడిసా 73.2%
2. అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ 69.2%
3. హిమంత బిశ్వ శర్మ, అసోం 68.3%
4. భూపేశ్ బఘేల్, ఛత్తీ్‌సగఢ్ 55.7%
5. శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ 54.7%
6. పుష్కర్ ధామి, ఉత్తరాఖండ్ 53.4%
7. యోగి ఆదిత్యనాథ్, యూపీ 48.6%
8. ఎంకే స్టాలిన్, తమిళనాడు 45.7%
9. భూపేంద్ర పటేల్, గుజరాత్ 43.6%
10. జగన్మోహన్ రెడ్డి, ఏపీ 39.7%