Nara lokesh Ap Police: లోకేష్ కదలికలపై నిఘా.. ఎన్ని బృందాలు కన్నేశాయంటే..!
ABN , First Publish Date - 2023-09-23T04:00:23+05:30 IST
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఏపీ పోలీసులు నిఘా పెట్టాయా?.. అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. ప్రస్తుతం దేశ రాజధానిలో ఉన్న ఆయన కదలికలపై రెండు పోలీసు బృందాలు కన్నేశాయి....
ఢిల్లీలో ఏపీ పోలీసు బృందాలు
యువనేత కదలికలపై కన్ను
అమరావతి, న్యూఢిల్లీ, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై (Nara lokesh)ఏపీ పోలీసులు (AP Police) నిఘా పెట్టాయా?.. అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. ప్రస్తుతం దేశ రాజధానిలో ఉన్న ఆయన కదలికలపై రెండు పోలీసు బృందాలు కన్నేశాయి. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఏపీ సీఐడీ (AP CID) నుంచి ఒక బృందం, ఇంటెలిజెన్స్ నుంచి మరో బృందం ఐదు రోజులుగా మకాం వేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఆయన ఎవరెవరిని కలుస్తున్నారు? ఆయన్ను ఎవరు పరామర్శిస్తున్నారు? వంటి వివరాలను సీఐడీ, ఇంటెలిజెన్స్ బృందాలు రాబడుతున్నట్లు సమాచారం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ నెల 9న చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత లోకేశ్‌ను సైతం అరెస్టు చేస్తామంటూ రాష్ట్ర మంత్రులే స్వయంగా ప్రకటించారు. అందుకు అనుగుణంగా సీఐడీ ఉన్నతాధికారులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఫైబర్ నెట్ కేసులో మాజీ ఐటీ మంత్రి లోకేశ్‌ను అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకటి రెండు రోజుల తర్వాత లోకేశ్ రాజమహేంద్రవరం వస్తారని భావించినప్పటికీ పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆయన వివిధ పార్టీల నాయకులతో కలిసి ఏపీలో అరాచక పాలన, అవినీతి గురించి వివరిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ఏపీ పోలీసులు ఢిల్లీకి బృందాలను పంపి లోకేశ్ కదలికలపై నిఘా పెట్టి ఆయన ప్రతి అడుగులోనూ ఏమి చేస్తున్నారనే కూపీ లాగుతున్నారు.
ఎంపీలతో లోకేశ్ సమాలోచనలు
చంద్రబాబు (Chandrababu)క్వాష్ పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేయడంతో తదుపరి కార్యాచరణపై పార్టీ ఎంపీలతో లోకేశ్ చర్చలు జరిపారు. ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్‌తో శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. ‘‘టీడీపీ అఽధినేత చంద్రబాబును తప్పుడు కేసులో అక్రమంగా అరెస్టు చేయించిన సైకో జగన్ తీరుపై దేశమంతా చర్చకు వచ్చేలా చేసిన టీడీపీ ఎంపీలను అభినందించా. చంద్రబాబు అక్రమ అరెస్టును పార్లమెంటులో చర్చకు తెచ్చి దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు గట్టిగా పోరాటం చేశారు. భవిష్యత్తు కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాం’’ అని లోకేశ్ అన్నారు.