Nara Lokesh: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో.. రేపు CID విచారణకు లోకేశ్

ABN , First Publish Date - 2023-10-09T21:50:08+05:30 IST

తాడేపల్లిలోని SIT కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటలకు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు(Inner Ring Road Case)లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌(Nara Lokesh)ని ఏపీ సీఐడీ(AP CID) విచారించనుంది.

Nara Lokesh: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో..   రేపు CID విచారణకు లోకేశ్

అమరావతి: తాడేపల్లిలోని SIT కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటలకు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు(Inner Ring Road Case)లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌(Nara Lokesh)ని ఏపీ సీఐడీ(AP CID) విచారించనుంది. IRR allignment మార్పు కేసులో లోకేష్‌ను A-14గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో ఫైల్ చేసింది. లోకేష్‌ను CRPCలోని సెక్షన్ 41A క్రింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని ఏపీ హైకోర్ట్‌కు సీఐడీ చెప్పింది. ఈ మేరకు ఈ నెల 4వ తేదీన తొలుత లోకేష్‌ను విచారణకు రావాల్సిందిగా సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నోటీసులో హెరిటేజ్ బోర్డ్ తీర్మానాలు, అకౌంట్స్ పుస్తకాలు తీసుకురావాలని సీఐడీ కోరింది. ఈ నిబంధనలను ఏపీ హైకోర్ట్‌లో లోకేష్ సవాల్ చేశారు. వాదనల అనంతరం లోకేష్‌ను బుక్స్ కోసం వత్తిడి చేయవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరు కావాలని లోకేష్‌కు కోర్ట్ ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు రేపు ఉదయం 10 గంటలకు లోకేష్ విచారణకు రానున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి విజయవాడకి లోకేష్ చేరుకున్నారు. లోకేష్ విచారణకు హాజరవుతుండటంతో తాడేపల్లిలోని SIT కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. లోకేష్ విచారణకు వస్తుండటంతో టీడీపీ కార్యకర్తలు, నేతలు పెద్దఎత్తున తరలి వస్తారని పోలీస్‌లు భావిస్తున్నారు. మూడు దశల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీస్ బలగాలు SIT కార్యాలయం వద్ద మోహరించాయి.

Updated Date - 2023-10-09T21:57:25+05:30 IST