Pattabhiram: జగన్‌రెడ్డి ఇసుకదోపిడీపై వాస్తవాలను తొక్కిపెడుతున్నారు
ABN , First Publish Date - 2023-11-14T17:59:52+05:30 IST
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ( CM JAGAN REDDY ) ఇసుకదోపిడీని ప్రజలకు తెలియచేస్తున్న టీడీపీ, మీడియా సంస్థలపై విషం కక్కుతూ వాస్తవాలు తొక్కిపెడుతున్నారని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ( Kommareddy Pattabhiram ) అన్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ( CM JAGAN REDDY ) ఇసుకదోపిడీని ప్రజలకు తెలియచేస్తున్న టీడీపీ, మీడియా సంస్థలపై విషం కక్కుతూ వాస్తవాలు తొక్కిపెడుతున్నారని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ( Kommareddy Pattabhiram ) అన్నారు. మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జయప్రకాశ్ పవర్ వెంచర్స్ పేరు చెబుతూ.. జగన్ రెడ్డి ఇసుకమాఫియాను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు గతంలో ఇచ్చిన ఇసుక తవ్వకాల కాంట్రాక్ట్ కాలపరిమితి నిజంగా ప్రభుత్వం పొడిగిస్తే, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెంకటరెడ్డి ఎందుకు బయటపెట్టడం లేదు? 2023 మే నుంచి జయ ప్రకాశ్ పవర్ వెంచర్స్ వారు రాష్ట్రంలో ఎలాంటి ఇసుక తవ్వకాలు జరపడంలేదు అనడానికి ఆ సంస్థ జీఎస్టీ రికార్డ్సే నిదర్శనం. మే నుంచి అక్టోబర్ వరకు జయప్రకాశ్ పవర్ వెంచర్స్ వారు ఎలాంటి జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయలేదు. నిజంగా రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు వారే జరుపుతున్నట్టయితే, ఇసుక రీచ్ లలో వే బిల్లులు వారే ఇస్తున్నట్టయితే కచ్చితంగా ప్రతినెలా జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేయాల్సిందే. అలా చేయకుంటే అదో పెద్ద నేరమని ఆ సంస్థకీ తెలుసా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు జయప్రకాశ్ పవర్ వెంచర్సే జరుపుతున్నట్టయితే, జీఎస్టీ రిటర్నులు ఎందుకు ఫైల్ చేయడంలేదో వెంకటరెడ్డి చెప్పాలి. జీఎస్టీ చెల్లింపులు.. దొంగ వేబిల్లులు చూశాక రాష్ట్రంలో ఇసుకతవ్వకాలు జయప్రకాశ్ పవర్ వెంచర్స్ చేయడం లేదని.. వెంకటరెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని తేలిపోయింది’’ అని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు.
ఇసుకదోపిడీ సీఐడీ చీఫ్ సంజయ్‌కు కనిపించడంలేదా?
‘‘జగన్‌రెడ్డే తన దోపిడీకోసం ఇప్పటికీ జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థను వాడుకుంటూ, తప్పుడు వే బిల్లులు ఇస్తూ, తన ఇసుక మాఫియా సాయంతో విచ్చలవిడిగా ఇసుక దోపిడీ సాగిస్తున్నాడు. ఒక సంస్థ పేరు చెబుతూ.. గత 6 నెలలుగా జగన్‌రెడ్డి అతని ప్రభుత్వం చేస్తున్న ఇసుకదోపిడీ సీఐడీ చీఫ్ సంజయ్‌కు కనిపించడంలేదా? రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక కుంభకోణంలో ఏ-1 జగన్‌రెడ్డి.. ఏ-2 మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఏ-3 డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి. వీళ్లందరిపై కేసులు పెట్టే ధైర్యం సీఐడీకి ఉందా? మేం లేవనెత్తిన ప్రశ్నలకు వెంకటరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి వెంటనే సమాధానం చెప్పాలి. లేకుంటే ఇసుకాసురుడు జగన్‌రెడ్డి ఇసుక దోపిడీ ఆటకట్టించేవరకు వదిలిపెట్టం. మా వద్ద ఉన్న ఆధారాలతో సీఐడీకి ఫిర్యాదు చేస్తాం. మా ఫిర్యాదు ఆధారంగా సీఐడీ చీఫ్ సంజయ్ ముఖ్యమంత్రిని.. మంత్రి పెద్దిరెడ్డిని...వెంకటరెడ్డిని విచారిస్తాడో లేదో చూస్తాం. ఏ విభాగం.. ఏఅధికారి అయినా నిబంధనల ప్రకారం పనిచేయాల్సిందే. లేకుంటే వారు కోర్టు బోనులో నిలబడి ప్రజలకు సమాధానం చెప్పక తప్పదు. పేదలపై భారం లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉచిత ఇసుక విధానం అమలు చేయడం నేరమా.. జగన్‌రెడ్డి యథేచ్ఛగా ఇసుక దోచేస్తూ.. తన దోపిడీకోసం కొన్ని సంస్థలు, వ్యక్తుల్ని బలిచేయడం నేరం కాదా?’’ అని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు.