Pattabhi: సజ్జల అలా చెప్పడం అతని అజ్ఞానానికి నిదర్శనం
ABN , First Publish Date - 2023-10-12T16:14:46+05:30 IST
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. పట్టాభి మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డి అతని జేబు సంస్థలు చంద్రబాబునాయుడిపై పెట్టే తప్పుడుకేసుల్ని
అమరావతి: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. పట్టాభి మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్ రెడ్డి అతని జేబు సంస్థలు చంద్రబాబుపై పెట్టే తప్పుడు కేసుల్ని తప్పు అని నిరూపించే ఆధారాలు తెలుగుదేశం వద్ద లేవని తాడేపల్లి ప్రధాన జీతగాడు సజ్జల చెప్పడం అతని అజ్ఞానానికి నిదర్శనం.’’ అని పట్టాభి మండిపడ్డారు. ఆయన ఇంకేం మాట్లాడారంటే..
• స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన వాస్తవాలను టీడీపీ ఇప్పటికే కట్టలకొద్దీ డాక్యుమెంట్లు, వెబ్ సైట్ రూపంలో ప్రజలముందు పెట్టిందని సజ్జలకు తెలియదా?
• టీడీపీ వాస్తవాలతో రూపొందించిన వెబ్ సైట్ ఓపెన్ చేసే కనీస పరిజ్ఞానం కూడా సజ్జలకు లేకపోతే, తమ పార్టీ కార్యాలయానికి వస్తే ఆయన కళ్లు బైర్లు కమ్మేలా వాస్తవాలు వెల్లడిస్తాం.
• ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా, భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తక్కువ ఖర్చుతో ఏపీలో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ను అమలు చేయడమే జగన్ రెడ్డి, సీఐడీ దృష్టిలో చంద్రబాబు చేసిన నేరం.
• దేశంలోని 15 పెద్ద రాష్ట్రాలకు సాధ్యంకాని విధంగా తక్కువ ఖర్చుతో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ను సమర్థవంతంగా అమలుచేయడమే చంద్రబాబు చేసిన పెద్ద తప్పు.
• భారత్ నెట్ ఫేజ్-1 లోభాగంగా దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏ రాష్ట్రం ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ను ఎలా అమలు చేసిందనే వివరాల్ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ జూలై18, 2019న వెల్లడించారు.
• చంద్రబాబు ప్రభుత్వం ఫేజ్-1లో భాగంగా రాష్ట్రంలో 24వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేసి, అందుకోసం కేవలం రూ.280కోట్లు వెచ్చించి, ఒక్కో కిలోమీటర్ కు రూ.1,16,666ల ఖర్చు మాత్రమే పెట్టింది.
• అదే కర్ణాటక ప్రభుత్వమైతే 14,010 కిలోమీటర్ల కేబుల్ నెట్ వర్క్ కు రూ.561కోట్ల57లక్షల82వేల273ల ఖర్చుతో ఒక్కో కిలోమీటర్ కు రూ.4,00,841లు వెచ్చించింది. ఇది మన రాష్ట్రం కంటే 243.5శాతం ఎక్కువ.
• పశ్చిమ బెంగాల్ 8,297 కిలోమీటర్ల కేబుల్ కు, రూ.310కోట్ల40లక్షలు ఖర్చుతో, ఒక్కో కిలోమీటర్ కు రూ.3.74లక్షలు వెచ్చిచింది. ఏపీతో పోలిస్తే 220.6 శాతం ఎక్కువ ఖర్చుపెట్టింది.
• మహారాష్ట్ర 33,530 కిలోమీటర్ల కేబుల్ వేసి, రూ.1238.85కోట్లు వెచ్చించి, , ఒక్కో కిలోమీటర్ కు రూ.3.69లక్షలు ఖర్చుపెట్టింది. ఏపీతో పోలిస్తే ఒక్కో కిలోమీటర్ కు మహారాష్ట్ర రూ.216.6శాతం అధికంగా ఖర్చుపెట్టింది.
• పొరుగున ఉన్న తెలంగాణ 5,369 కిలోమీటర్ల కేబుల్ వేసి, 186.73 కోట్లువెచ్చించి, ఒక్కో కిలోమీటర్ కు రూ.3,47,799 లుఖర్చుపెట్టింది. ఏపీతో పోలిస్తే ఒక్కో కిలోమీటర్ కు తెలంగాణ 198.1శాతం అదనం.
• ప్రతిదానికి రోల్ మోడల్ గా చెప్పుకునే గుజరాత్ 15,708 కిలోమీటర్ల కేబుల్ వేసి, రూ.367.60 కోట్లు వెచ్చించి, ఒక్కో కిలోమీటర్ కు రూ.2,34,021లు ఖర్చు పెట్టింది. గుజరాత్ ఏపీకంటే 100.5 శాతం ఎక్కువ ఖర్చుచేసింది.
• దేశంలోని అనేక రాష్ట్రాలు పెట్టిన ఖర్చుకంటే చాలా తక్కువగా కేవలం 1/4 శాతం వ్యయంతోనే చంద్రబాబు ఏపీలో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ను అమలుచేసి కేంద్రప్రభుత్వమే ఔరా అనేలా చేశారు.
• ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ద్వారా ఏపీ ప్రభుత్వమే దేశంలో తొలిసారి బీ.ఎస్.ఎన్.ఎల్ తర్వాత టెలికం లైసెన్స్ సాధించి టెలిఫోన్ సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుందని నేషనల్ మీడియానే చెప్పింది.
• ఈ విధంగా ప్రజలసొమ్ము పైసాపైసా ఆదాచేసి, ప్రజలకు మంచిచేసిన చంద్రబాబు ఈ అవినీతి ముఖ్యమంత్రి దృష్టిలో నేరగాడు.
• కేవలం తక్కువ ఖర్చుతో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పూర్తిచేయడమే గాక, దేశంలోనే మొదటిసారి చంద్రబాబు DWDM అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి, 24వేల కిలోమీటర్ల ఫైబర్ నెట్ ఆప్టిక్ కేబుల్ పూర్తి చేశారు.