Atchannaidu: జగన్ అక్రమాలు బయటపడితే తీహార్ జైలుకే
ABN , First Publish Date - 2023-11-24T14:45:12+05:30 IST
మైకు దొరికితే చాలు నీతులు వల్లించే జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాసుదేవ రెడ్డి సహా 41 మందికి కోర్టు నోటీసులివ్వడంపై ఏం సమాధానం చెబుతారు
అమరావతి: సీఎం జగన్ (Cm jagan)పై టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ‘‘అనకొండ జగన్ రెడ్డి అవినీతి బాగోతం బహిర్గతం అయింది. జగన్ రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటీ బయటకొస్తున్నాయి. లేని అవినీతిని చంద్రబాబుకు రుద్దే ప్రయత్నంలో బట్టబయలవుతున్న జగన్ రెడ్డి బండారం. కోర్టు నోటీసులపై స్పందించే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా?, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు వెనకేసుకున్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మరో రూ.2 లక్షల కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టారు.’’ అని ఆరోపించారు.
‘‘మైకు దొరికితే చాలు నీతులు వల్లించే జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాసుదేవ రెడ్డి సహా 41 మందికి కోర్టు నోటీసులివ్వడంపై ఏం సమాధానం చెబుతారు?, ప్రభుత్వ ప్రకటనలన్నీ ఏకపక్షంగా జగన్ రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్‌కు కట్టబెట్టారు. ప్రభుత్వ పనుల కోసం సిమెంటు సరఫరా కాంట్రాక్టుల్ని భారతి సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్‌కు ఇచ్చారు. 104, 108 అంబులెన్సుల నిర్వహణ బాధ్యతలు, రామాయపట్నం, కాకినాడ పోర్టుల్ని తన అవినీతి కేసుల్లోని అరబిందోకిచ్చారు. తన బినామీలకు, తన అవినీతి సహ నిందితులకు ప్రభుత్వ ఆస్తులు ధారాదత్తం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. జగన్ రెడ్డి చేసిన పాపాలన్నీ ఇప్పటికే బట్టబయలయ్యాయి. త్వరలోనే మిగిలిన నిజాలన్నీ బయటకొచ్చి అటు నుంచి తీహార్ జైలుకు పోవడం తథ్యం.’’ అని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.