Varla Ramaiah: చంద్రబాబు అక్రమ కేసులో యంత్రాగం మొత్తాన్ని జగన్‌రెడ్డి మొహరిస్తున్నారు
ABN , First Publish Date - 2023-09-27T22:23:14+05:30 IST
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును అభూత కల్పనలతో అరెస్టు చేసి, తర్వాత సాక్ష్యాల కోసం సీఐడీ పరుగులు పెడుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) ఎద్దేవ చేశారు.
అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును అభూత కల్పనలతో అరెస్టు చేసి, తర్వాత సాక్ష్యాల కోసం సీఐడీ పరుగులు పెడుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) ఎద్దేవ చేశారు. బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘జగన్మోహన్రెడ్డి రాజకీయ కక్షతోనే చంద్రబాబును జైలు పాలు చేశారు. నేరం జరిగితే పోలీసు వ్యవస్థ సాక్ష్యాలు సేకరించిన తర్వాత అరెస్టు చేసి కోర్టుకు పంపుతారు. కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసి సాక్ష్యాలు వెతుకుతున్నారు. ముఖ్యమంత్రి కక్ష గట్టి, తనలానే చంద్రబాబు కూడా జైలు జీవితం గడపాలనేలా వ్యవహరిస్తున్నారు. సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్‌పై జగన్‌రెడ్డి ఒత్తిడి తెచ్చి చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టించారు. అరెస్టు చేసి 19 రోజులైనా ఇంత వరకు సాక్ష్యాలు సేకరించలేకపోయారు. జగన్‌రెడ్డి కక్ష, కార్పణ్యాలకు చంద్రబాబు అరెస్టు ప్రత్యక్ష నిదర్శనం. కేసును క్వాష్ చేయాలని చంద్రబాబు పిటిషన్ వేస్తే.. యంత్రాంగం మొత్తాన్ని జగన్‌రెడ్డి మొహరిస్తున్నారు. ప్రభుత్వ న్యాయవాదులంతా విజయవాడలో మకాం వేసి అసలు అడ్వకేట్ జనరల్‌ను పక్కన పెట్టారు. చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతో కొట్టుమిట్టాడే అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌కు కీలక వ్యక్తిగా బాధ్యతలిచ్చారు. ఈ రోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ‘నాట్ బిఫోర్ మీ’ అన్నాక జరిగిన తంతు, ప్రభుత్వ న్యాయవాదులంతా చంద్రబాబుకి ఊరట కలగకూడదనేలా వ్యవహరించారు. కక్ష గట్టి, వెంటబడి, చంద్రబాబుకి న్యాయం జరగకూడదని ప్రభుత్వం బరితెగించింది. చంద్రబాబును సాధించాలని తప్పుడు, దొంగ కేసులు పెట్టారు. కానీ ప్రజలంతా చంద్రబాబుతోనే ఉన్నారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు’’ అని వర్లరామయ్య పేర్కొన్నారు.