Congress: ఛలో రాజ్‌భవన్‌కు ఏపీసీసీ చీఫ్ పిలుపు.. కాంగ్రెస్ నేతల అరెస్ట్
ABN , First Publish Date - 2023-03-13T11:25:44+05:30 IST
అదానీ ఆర్ధిక నేరాలపై కమిటీ వేయాలంటూ ఛలో రాజభవన్‌కు ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు.
విజయవాడ: అదానీ ఆర్ధిక నేరాలపై కమిటీ వేయాలంటూ ఛలో రాజభవన్ (Chalo Raj Bhavan)కు ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు (APCC Chief Gidugu Rudraraja) పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు వివిధ జిల్లాల్లో కాంగ్రెస్ నేతల (Congress Leaders)ను హౌస్ అరెస్ట్ (House Arrest) చేశారు. ఈరోజు ఉదయం కాంగ్రెస్ కార్యాలయం నుంచి ర్యాలీగా రాజభవన్‌కు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయం నుంచి బయటకు రాగానే అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అరెస్టు అయిన వారిలో ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, క్రిస్టఫర్, సుంకర పద్మశ్రీ, మస్తాన్ వలీ, ఇతర నేతలు ఉన్నారు.
ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ... అదానీ ఆర్ధిక నేరాలపై కమిటీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు. నేడు ఆంధ్రరత్నభవన్ నుంచి రాజభవన్ వరకు ర్యాలీ చేపట్టామని.. ఛలో రాజభవన్ ద్వారా అదానీ అక్రమాలు గవర్నర్‌కు వివరించాలని నిర్ణయించామని అన్నారు. తమ కార్యక్రమాన్ని అన్యాయంగా అడ్డుకున్నారని మండిపడ్డారు. పోలీసులతో అక్రమ అరెస్టులు చేయించారన్నారు. అదానీ కోసం ప్రజల ఆస్తులను దోచి పెడతారా అని ప్రశ్నించారు. దేశంలో మోదీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. అదానీ సంస్థలకు అక్రమ మార్గంలో కోట్లు అప్పగించారని మండిపడ్డారు. అదానీ కంపెనీల బుక్ విలువ పెంచుతూ దేశ ఆర్ధిక వ్యవస్థను కుంగదీశారన్నారు. తమ ఏఐసీసీ నేతలు ఇచ్చిన పిలుపుతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మోదీ మాయలతో మోసం చేస్తున్న వైనాన్ని ప్రజలకు వివరిస్తామని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.