Bonda Uma: న్యాయవ్యవస్థపై ఇంత దుర్మార్గంగా మాట్లాడడం జగన్ పాలనలోనే చూస్తున్నాం
ABN , First Publish Date - 2023-11-23T15:14:34+05:30 IST
గౌరవప్రదమైన న్యాయవ్యవస్థ... న్యాయమూర్తులపై ఇంత దుర్మార్గంగా మాట్లాడటం దేశంలో జగన్‌రెడ్డి పాలనలోనే చూస్తున్నామని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ( Bonda Umamaheswara Rao ) వ్యాఖ్యానించారు.
అమరావతి: గౌరవ ప్రదమైన న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై ఇంత దుర్మార్గంగా మాట్లాడటం దేశంలో జగన్‌రెడ్డి పాలనలోనే చూస్తున్నామని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ( Bonda Umamaheswara Rao) విమర్శించారు. గురువారం టీడీపీ కార్యాలయంలో టీడీపీ సమావేశం జరిగింది. అనంతరం బోండా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ‘‘ 16 నెలలు జైల్లో ఉన్న ఆర్థిక నేరస్తుడు జడ్జిలపై ఫిర్యాదు చేసేస్థాయికి రావడం వ్యవస్థల దుర్వినియోగానికి పరాకాష్టగా మారింది. జైలు జీవితం గడిపిన జగన్ ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులపై, సుప్రీంకోర్టు జడ్జీపై అపవాదు వేయడం దేశచరిత్రలో ఎన్నడూ చూడలేదు. సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటూ, రాజకీయ నాయకులకన్నా హీనంగా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. జగన్‌రెడ్డి చెప్పినట్టు ఆడుతూ కట్టుకథలతో ప్రజలను మోసగిస్తూ, వ్యవస్థలను కుంగదీస్తున్నారు’’ అని బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.
సుధాకర్‌రెడ్డి జగన్‌రెడ్డి పాలేరా..?
‘‘సుధాకర్‌రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరలా.. లేక జగన్‌రెడ్డి పాలేరా? ముఖ్యమంత్రిపై సుధాకర్‌రెడ్డికి వల్లమాలిన ప్రేమాభిమానాలుంటే.. నల్లకోటు వదిలేసి శాశ్వతగా జగన్‌కు ఊడిగం చేసుకోవచ్చు. చంద్రబాబు అవినీతి చేస్తే... తెలుగుదేశానికి ఇతర ఖాతాల నుంచి డబ్బులొస్తే నాలుగేళ్ల 8 నెలలుగా కోర్టుల్లో ఎందుకు నిరూపించలేకపోయారు? వేలకోట్ల అవినీతి జరిగిందని బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడటం తప్ప, ఒక్క రూపాయి అవినీతిని అయినా ఆధారాలతో నిరూపించారా? న్యాయస్థానాల్లో బిక్కముఖాలు వేసి సిగ్గులేకుండా మీడియా, సాక్షి పత్రిక..ఛానెళ్ల ముందు ప్రతాపం చూపుతున్నారా’’ అని బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.