AP Capital: ‘అమరావతే రాజధాని’... పార్లమెంట్ సాక్షిగా కేంద్రం సంచలన ప్రకటన
ABN , First Publish Date - 2023-02-08T14:50:38+05:30 IST
ఏపీ రాజధానిపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రం సంచలన ప్రకటన చేసింది. ఏపీ రాజధాని అమరావతే అంటూ కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది.
న్యూఢిల్లీ: ఏపీ రాజధాని (AP Capital)పై పార్లమెంట్ (Parliament) సాక్షిగా కేంద్రం (Central Government) సంచలన ప్రకటన చేసింది. ఏపీ రాజధాని అమరావతే (Amaravate is the capital of AP) అంటూ కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. విజభన చట్టం ప్రకారమే అమరావతి ఏర్పాటైందని స్పష్టం చేసింది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 లతో రాజధాని అమరావతిని కేంద్రం ముడిపెట్టింది. విభజన చట్టంలోని నిబంధనల ప్రకారమే అమరావతి ఏర్పాటు అయ్యిందని తేల్చిచెప్పింది. దీంతో రాజధానిని ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఏపీకి లేదని కేంద్ర చెప్పకనే చెప్పినట్టైంది.
మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం (Jagan Government) కేంద్రాన్ని సంప్రదించలేదని... జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల (Three capitals) కోసం చేసిన చట్టాలతో సంబంధం లేదని స్పష్టం చేసింది. జగన్ మూడు రాజధానుల చట్టాలతో తమకేమీ సంబంధం లేదని కేంద్రం సంకేతం ఇచ్చింది. అమరావతే రాజధాని అని 2015లో నిర్ణయించారని కేంద్రం స్పష్టం చేసింది. ఏపీ రాజధాని అంశంపై బుధవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
అమరావతిని రాజధానిగా ఏపీ ప్రభుత్వం 2015లోనే నోటిఫై చేసిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని కేంద్రం ముక్త కంఠంతో చెప్పిందా? అని ఎంపీ విజయసాయి రెడ్డి (YCP MP) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని (AP Capital Issue) అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని కేంద్రం పేర్కొంది. దీనిపై మాట్లాడటం కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం (Andhra Pradesh Redistribution Act) సెక్షన్ 5, 6 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నూతన రాజధాని నిర్మాణం అధ్యయనానికి ఏర్పాటు చేసిందని వెల్లడించింది. అధ్యయన నివేదికను తదుపరి చర్యలు నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించడం జరిగిందని... ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015లో అమరావతిని రాజధానిగా నోటిఫై చేసిందని పేర్కొంది. ఆ తర్వాత 2020లో మూడు రాజధానుల బిల్లు (Bill of three capitals)ను తీసుకువచ్చారని తెలిపింది. మూడు రాజధానుల బిల్లు తీసుకువచ్చే ముందు ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని చెప్పింది. రాజధాని అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)లో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందని... ప్రస్తుతం అమరావతి అంశం కోర్టు పరిధిలో ఉందని కేంద్రం వెల్లడించింది.
కాగా... అమరావతిపై కేంద్ర ప్రకటన గతంలో ఏపీ హైకోర్టు (AP HighCourt) ఇచ్చిన తీర్పును సమర్థించినట్లైంది. విభజన చట్టం ప్రకారమే అమరావతి ఏర్పడిందని... దాన్ని మార్చాలంటే మళ్లీ కేంద్రం జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని, విభజన చట్టంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు చెప్పిన విషయం తెలిసిందే. దాని ప్రకారమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో స్పష్టమైంది. దీంతో అమరావతి (Amaravati)ని రాజధానిగా మార్చాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం (Ap Government) సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే పార్లమెంట్‌లో బిల్లులో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది అన్నది కేంద్ర ప్రభుత్వం ఉద్దేశంగా తెలుస్తోంది. అయితే అమరావతిపై కేంద్ర వైఖరిని స్పష్టం చేయాలనే ఉద్దేశంతోనే రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడగని విషయాలను కూడా ఈ సందర్భంగా కేంద్రం చెప్పినట్లు తెలుస్తోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకుని, మొత్తం సమీక్షలు జరిపిన తర్వాత అమరావతి విషయంలో మార్పులు చేర్పులు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ జోక్యం తప్పనిసరి అని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.