Vangalapudi Anita: ‘నిన్న భాస్కర్‌రెడ్డి అరెస్ట్.. రేపు అవినాష్.. తర్వాత సీఎం దంపతులే’

ABN , First Publish Date - 2023-04-19T12:45:57+05:30 IST

జగన్ ఢిల్లీ పర్యటనలన్నీ కేంద్ర పెద్దలకు సాష్టాంగపడటానికే అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వ్యాఖ్యలు చేశారు.

Vangalapudi Anita: ‘నిన్న భాస్కర్‌రెడ్డి అరెస్ట్.. రేపు అవినాష్.. తర్వాత సీఎం దంపతులే’

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి (AP CM Jaganmohan Reddy) ఢిల్లీ పర్యటనలన్నీ కేంద్ర పెద్దలకు సాష్టాంగపడటానికే అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత Telugu woman state president Vangalapudi Anita) వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య (Viveka Murder Case) కేసు నుంచి తమ్ముడిని కాపాడటమే జగన్ ప్రధాన ఎజెండా అని అన్నారు. సొంత చెల్లికి అన్యాయం చేస్తూ, తమ్ముడిని కాపాడుకోవాలనుకుంటున్న ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని ఆడబిడ్డల్ని రక్షిస్తాడా అని ప్రశ్నించారు. జగన్ భయంతో ఢిల్లీ పర్యటనలు చేస్తుంటే, ప్రజల కోసం, రాష్ట్రం కోసమని ఎన్నాళ్లు కట్టు కథలు చెబుతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయ్ హత్యకేసులో నిన్న భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారని.. రేపు అవినాష్ రెడ్డి.. తరువాత అరెస్ట్ అయ్యేది ముఖ్యమంత్రి దంపతులే అని వ్యాఖ్యలు చేశారు. జగన్ నిజంగా రాష్ట్రం కోసం.. ప్రజల కోసం ఢిల్లీ వెళ్తే కేంద్రమంత్రులను, పెద్దలను కలిసిన వెంటనే మీడియాతో ఎందుకు మాట్లాడటంలేదని నిలదీశారు. జగన్ పాపాల్లో భాగస్వామి అవుతూ, ఆయన అసమర్థతను కప్పిపుచ్చుతూ జవహర్ రెడ్డి మాట్లాడారన్నారు. వసతిదీవెన కార్యక్రమం ఖజానాలో డబ్బుల్లేక వాయిదాపడిందని సీఎస్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలు సమర్పించడానికి, శ్రీరామనవమికి స్వామివారికి వస్త్రాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి దంపతులకు సమయం లేదని విమర్శించారు. స్వామీజీల నుంచి ఆశీర్వచనాలు తీసుకోవడానికి, వారిని ప్రత్యేక విమానాల్లో పిలిపించి, గంటల కొద్దీ సమయం వెచ్చిస్తారని మండిపడ్డారు. జగన్ క్షేమం కోసం కొట్టు సత్యనారాయణ ప్రభుత్వ సొమ్ముతో యాగాలు చేస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అవ్వాలని మంత్రి యాగాలు చేయిస్తే ప్రజలు సంతోషిస్తారని తెలిపారు. తన తండ్రి ఆత్మశాంతి కోసం, దోషుల్ని శిక్షించడం కోసం దేనికి వెరవకుండా పోరాడుతున్న డాక్టర్ సునీతకు మహిళాలోకం తరుపున చేతులెత్తి నమస్కరిస్తున్నామని అనిత పేర్కొన్నారు.

Updated Date - 2023-04-19T12:46:01+05:30 IST