Nara Lokesh: ఉప్పు రైతులకు నారా లోకేష్ ఏం హామీ ఇచ్చారంటే..!
ABN , First Publish Date - 2023-07-08T16:11:34+05:30 IST
150వ రోజు ఉప్పు రైతులతో సమావేశం పెట్టుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఉప్పు లేనిదే కూర రుచి ఉండదు. ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు గాంధీ ఈ ప్రాంతానికి వచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తక్కువ ధరకే ఉప్పు రైతులకి విద్యుత్ అందజేశారు.
నెల్లూరు: జగన్ పాలనలో (YCP Government) ఉప్పు సాగు చేస్తున్న రైతులకు కనీస సాయం అందడం లేదని నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. కావలి నియోజకవర్గంలో ఉప్పు సాగు రైతులతో లోకేష్ సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. ‘‘150వ రోజు ఉప్పు రైతులతో సమావేశం పెట్టుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఉప్పు లేనిదే కూర రుచి ఉండదు. ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు గాంధీ ఈ ప్రాంతానికి వచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తక్కువ ధరకే ఉప్పు రైతులకి విద్యుత్ అందజేశారు. నేను పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఉప్పు సాగు చేసే పొలాలకు రోడ్లు కూడా వేశాం. జగన్ పాలనలో ఉప్పు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచి ఉప్పు రైతులను కోలుకోలేని దెబ్బతీశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఇచ్చిన ధరకే విద్యుత్ అందిస్తాం. జగన్ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉప్పు రైతులు పొలాల దగ్గరే నిల్వ చేసుకునే విధంగా షెడ్లు నిర్మాణం చేస్తాం. వరదలు, వర్షాలు వచ్చి ఉప్పు రైతులు నష్టపోయినప్పుడు ఇన్స్యూరెన్స్ కల్పించే అంశంపై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు వేస్తాం, మౌలిక వసతులు కల్పిస్తాం. ఇతర రైతులకు ఇచ్చిన్నట్టే సబ్సిడీలు అందిస్తాం. ట్రాక్టర్లు, ఇతర పనిముట్లు అందిస్తాం. ఉప్పు సాగు రైతులకు పట్టాలు ఇచ్చే అంశంపై పార్టీలో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన భూమి కూడా ఉందని చెబుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు తీసుకొని స్పందిస్తా.’’ అని లోకేష్ పేర్కొన్నారు.