Ganta Srinivasrao: అలా చెప్పడం ఈతరానికి అతి పెద్ద పొలిటికల్ జోక్ జగన్ గారు...
ABN , First Publish Date - 2023-07-25T10:01:24+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈతరానికి అతిపెద్ద పొలిటికల్ జోక్ జగన్ అంటూ సెటైర్ విసిరారు. రైతుల ప్రాథమిక హక్కులను కాలరాశారని, రాజధాని నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ప్రతీ సమావేశంలో తాను అమాయకుడినంటూ పేదరికపు హాస్యాన్ని బాగా రక్తికట్టిస్తున్నారు అంటూ గంటా వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan reddy) వైఖరిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Former Minister Ganta Srinivas rao) ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పేదల పక్షాన ఉన్నానన్న జగన్ వ్యాఖ్యలు ఈతరానికి అతిపెద్ద పొలిటికల్ జోక్ అంటూ సెటైర్ విసిరారు. రైతుల ప్రాథమిక హక్కులను కాలరాశారని, రాజధాని నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ప్రతీ సమావేశంలో తాను అమాయకుడినంటూ పేదరికపు హాస్యాన్ని బాగా రక్తికట్టిస్తున్నారు అంటూ గంటా వ్యాఖ్యలు చేశారు.
గంటా ట్వీట్ ఇదే...
‘‘అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో కోర్టు తుది ఉత్తర్వులు వెల్లడించకుండానే మీరు ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడమనేది నిరుపేదల జీవితాలతో ఆడుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారు. ఒక వేళ రేపు తుది తీర్పు వ్యతిరేకంగా వస్తే ఆ సెంటు భూమిలో ఇంటి నిర్మాణానికి ఖర్చు చేసిన ప్రజాధనానికి ఎవరు బాధ్యత వహిస్తారు. మీ మూర్ఖత్వపు చర్యల వలన ఇల్లు కట్టుకున్న అమాయకమైన పేదలు నిలువునా బలైపోతారు. గత నాలుగున్నరేళ్లుగా నిద్దురపోయి తుది తీర్పు వెలువడక ముందే ఇప్పుడు ఆగమేఘాల మీద పట్టాలు పంపిణీ, శంకుస్థాపనలు చెయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది జగన్ గారు. రైతుల ప్రాథమిక హక్కులను కాలరాస్థూ రాజధాని నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసి. పేదల సంక్షేమం ముసుగులో అమరావతి మాస్టర్ ప్లాన్ను ధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు రాజధానిలో పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో అమరావతిని నాశనం చేసేందుకే ఇలాంటి ఎత్తులు వేస్తూ నాటకాలు ఆడుతున్నారు’’ అంటూ మాజీ మంత్రి ట్వీట్ చేశారు.
‘‘ఒక పక్క... మీ స్వార్ధపూరిత రాజకీయ జిత్తులకు అమాయకమైన నిరుపేదలను బలిచేస్తూ. మరోపక్క.... నేను పేదల పక్షాన పోరాడుతున్నాను, రాష్ట్రంలో పేదలకు పెట్టుబడిదారులకు మధ్య వర్గపోరు నడుస్తోందంటూ.. దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా వెలుగొందుతున్న మీరు చెప్పడం ఈతరానికి అతి పెద్ద పొలిటికల్ జోక్ జగన్ గారు.....!. ప్రతి మీటింగ్లో ప్రతి సారి నేను ఒక నిరుపేదని, నాకు అంగబలం లేదు, నాకు ఆర్థిక బలం లేదు, నాకు మీడియా బలం లేదు, నాకు మోసం చేయడం తెలియదు, నాకు నక్కజిత్తులు తెలియవు, నేను ఒక అమాయకుడుననే పేదరికపు హాస్యాన్ని బాగా రక్తికట్టిస్తున్నారు. ప్రజలేమి అమాయకులు కాదు జగన్ గారు. తెలిసో, తెలియకో... 2019లో "ఒక్క అవకాశం" మాయలో పడి కోలుకోలేని అతి పెద్ద తప్పు చేశారనేది తెలుసుకున్నారు. విముక్తి కోసం అదే ప్రజలు ఎప్పుడు ఎప్పుడా అని 2024 కోసం ఎదురు చూస్తున్నారు’’ అంటూ సీఎం జగన్ను ఉద్దేశించి గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.