Yuvagalam: ముగిసిన యువగళం పాదయాత్ర.. గాజువాక జనసంద్రం
ABN , Publish Date - Dec 18 , 2023 | 06:06 PM
తెలుగుదేశం పార్టీ ( TDP ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) చేపట్టిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర ( Yuvagalam Padayatra ) కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సోమవారం నాడు గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ వడ్లమూడి జంక్షన్ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు.
విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీ ( TDP ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) చేపట్టిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర ( Yuvagalam Padayatra ) కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సోమవారం నాడు గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ వడ్లమూడి జంక్షన్ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. యువనేతతో తల్లి భువనేశ్వరి, అత్త నందమూరి వసుంధరాదేవి, ఇతర కుటుంబసభ్యులు కలసి ఈ పాదయాత్రలో నడిచారు. లోకేష్‌కి సంఘీభావంగా వేలాదిమంది ప్రజలు కలసి నడిచారు. శివాజీనగర్ వద్ద పైలాన్‌ను లోకేష్ ఆవిష్కరించారు. దీంతో గాజువాక ప్రధాన రహదారి జనసంద్రంగా మారింది. ఏపీ నలుమూలల నుంచి పెద్దఎత్తున టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గాజువాకకు తరలివచ్చారు. 2 కి.మీ.ల మేర భారీ ర్యాలీ కారణంగా గాజువాక ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ నెలకొంది.
నియంతృత్వంపై ప్రజా యుద్ధమే యువగళం
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర కాసేపటి క్రితమే ముగిసింది. ముగింపు సభకు వందలాదిమంది జనం తరలివచ్చారు. యువగళం పాదయాత్రలో భాగస్వామ్యం అయిన ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ...‘‘నియంతృత్వంపై ప్రజా యుద్ధమే యువగళం పాదయాత్ర. అణిచివేతకు గురైన వర్గాల గొంతుకైంది మన యువగళం. ప్రజాగళమై, ప్రజలే బలమై 226 రోజులు, 3132 కి.మీ పాదయాత్ర నిర్విరామంగా కొనసాగింది. అసమర్థుడు గద్దెనెక్కి ప్రజాస్వామ్యంపై చేసిన దాడి, వ్యవస్థల విధ్వంసాన్ని కళ్లారా చూశాను. భవిష్యత్తుపై ఆశలు కోల్పోయిన యువతకు భరోసా ఇచ్చాను. అందరి సహకారంతో యువగళం పాదయాత్రను దిగ్విజయంగా గాజువాక నియోజకవర్గం అగనంపూడి వద్ద ముగిస్తున్నాను. పాదయాత్రలో నేను ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటాను. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాను’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.