Muralidharan: ఏపీ ప్రజలు చాలా నిరాశలో ఉన్నారు
ABN , First Publish Date - 2023-01-24T16:47:52+05:30 IST
ఏపీ ప్రజలు చాలా నిరాశలో ఉన్నారని కేంద్ర మంత్రి మురళీధరన్ అభిప్రాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు
ఏలూరు: ఏపీ ప్రజలు చాలా నిరాశలో ఉన్నారని కేంద్ర మంత్రి మురళీధరన్ (Muralidharan) అభిప్రాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘2019లో అవినీతి, మిస్ మేనేజ్‌మెంట్‌కు వ్యతిరేకంగా ఓటు వేసి చంద్రబాబు (Chandrababu)ని ఓడించారు. ప్రజలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని వైసీపీకి ఓటు వేశారు. కానీ ప్రజలపై అప్పు మోపారు. నాలుగేళ్లలో నాలుగు కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఈ అప్పులకు టీడీపీ (tdp), వైసీపీ (ycp) బాధ్యత వహించాలి. కేంద్రం నాలుగు లక్షల కోట్లు అంటే.. గణాంకాలు మాత్రం తొమ్మిది లక్షల కోట్ల అప్పుగా చెబుతున్నాయి. తెలివైన ఏపీ ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు చూడాలి. రాష్ట్రంలో మొదటి తేదీన జీతాలు ఇవ్వడం లేదంటే ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో అంచనా వేయవచ్చు. స్వాతంత్య్ర సమరానికి వందలాది మంది స్వాతంత్య్ర సమరయోధులను ఇచ్చిన కీలక రాష్ట్రం ఏపీ. మోదీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలదే. అలాగే రాష్ట్రంలో ఉన్న అవినీతీని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి. వైసీపీ ప్రభుత్వ పాలనపై ఛార్జ్‌షీటు వేస్తాం. బీజేపీ (bjp) ఒక్కటే రాష్ట్రానికి ప్రత్యామ్నాయ పార్టీ.’’ అని చెప్పుకొచ్చారు.
‘‘దేశంలో 80 శాతం మందికి ఆహార ధాన్యాలు సరఫరా చేస్తున్నాం. పేదరికం వల్ల, ఆహారం కొరత వల్ల కోవిడ్ సమయంలో ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదు. ప్రపంచ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్లు వస్తున్నా మన దేశంలో పూర్తిగా కట్టడి చేయగలిగాం. అయోధ్య రామజన్మభూమి దేవాలయం త్వరలోనే రాబోతుంది. భారత స్వాతంత్య్ర సమరం ఒక కుటుంబానికి చెందినది కాదు. ఒక ఫ్యామిలీ కొన్నేళ్లుగా ఆ ఫలితం అనుభవిస్తుంది. కానీ స్వాతంత్య్ర పోరాటం అందరూ చేసినది. వారందరిని గుర్తించి వారి పేర్లు మీద కార్యక్రమాలు మోదీ నిర్వహిస్తున్నారు.’’ అని వెల్లడించారు.