Karnataka Polls : అంతా నాటకం, కర్ణాటక కోసం ఏమీ లేదు.. మోదీపై జైరామ్ రమేశ్ మండిపాటు..

ABN , First Publish Date - 2023-04-29T20:01:34+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నదంతా కేవలం నాటకమని, కర్ణాటక కోసం ఆయన ఏమీ

Karnataka Polls : అంతా నాటకం, కర్ణాటక కోసం ఏమీ లేదు.. మోదీపై జైరామ్ రమేశ్ మండిపాటు..
Narendra Modi, Jairam Ramesh, Congress

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నదంతా కేవలం నాటకమని, కర్ణాటక కోసం ఆయన ఏమీ చెప్పడం లేదని కాంగ్రెస్ దుయ్యబట్టింది. ఓటర్లను బీజేపీ వైపు తిప్పుకునేందుకు పాచికలు వేసే పనిని ఆయన అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్‌లకు అప్పగించారని, తాను బాధితుడినని ఆయన చెప్పుకుంటున్నారని మండిపడింది. మోదీ శనివారం మాట్లాడుతూ, కాంగ్రెస్ తనను ఇంతవరకూ 91 సార్లు తిట్టిపోసిందని ఆరోపించిన నేపథ్యంలో ఆ పార్టీ ఈ విధంగా స్పందించింది.

కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం మోదీ ప్రచారం చేస్తున్నారు. శని, ఆదివారాల్లో వివిధ ప్రచార సభల్లో పాల్గొంటారు. దీనిలో భాగంగా శనివారం బీదర్ జిల్లా హుమ్నాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ (Congresss) మళ్లీ తనను నిందించడం మొదలుపెట్టిందని, ఆ పార్టీ తనను ఆడిపోసుకున్న ప్రతిసారి సోదిలోకి లేకుండా పోయిందని అన్నారు. కాంగ్రెస్ ఇంతవరకూ తనను 91 సార్లు తిట్టిపోసిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనను నిందించడమే పనిగా పెట్టుకున్నా, తాను మాత్రం కర్ణాటక ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటానని అన్నారు. పేదల కోసం, దేశం కోసం పని చేసేవారిని అవమానించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని, దాని చరిత్ర అదేనని చెప్పారు.

మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ (Jairam Ramesh) ట్విటర్ వేదికగా ఘాటుగా స్పందించారు. కర్ణాటకలో పోలరైజేషన్‌ చిట్కాలను అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్‌లకు వదిలిపెట్టేశారని, మోదీ తాను బాధితుడినని చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. మోదీ తొలి రోజు ప్రచారమంతా డబుల్ ఇంజిన్, నైరాశ్యం, నిస్పృహలతో నిండిపోయిందని ఎద్దేవా చేశారు. ఆయన ప్రసంగమంతా నాటకమేనని, కర్ణాటక ప్రజల కోసం గట్టిగా ఏమీ చెప్పలేదని అన్నారు.

కర్ణాటక ఎన్నికల ప్రచారాన్ని మోదీ చాలా ఆలస్యంగా ప్రారంభించారని, అయితే అనుకున్నట్లుగానే ఆయన విక్టిమ్ కార్డ్ (బాధితుడిననే ప్రచారం) వాడుకున్నారని చెప్పారు. ప్రజల నమ్మకం కోల్పోయిన డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరారన్నారు. అదే విధంగా కాంగ్రెస్‌ను దూషించారన్నారు. ఇవన్నీ ఆయన నిష్ప్రయోజనకరమైన ప్రయోగాలేనని చెప్పారు. నిస్సందేహంగా పోలరైజేషన్‌ చిట్కాలను అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్‌లకు వదిలేశారన్నారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా పోరాడుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఇటీవల మాట్లాడుతూ మోదీని విషపు నాగు అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఇటీవల సోనియా గాంధీని విషకన్య అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించాలని ఎన్నికల కమిషన్‌ను కాంగ్రెస్ కోరింది.

ఇవి కూడా చదవండి :

Mukhtar Ansari : ముక్తార్ అన్సారీకి పదేళ్ల జైలు శిక్ష

Karnataka Elections: నాకు లెక్కలు బాగా తెలుసు..141 సీట్లు గెలుస్తాం : డీకే

Updated Date - 2023-04-29T20:01:34+05:30 IST