Arvind Kejriwal: సమస్యలు వచ్చినప్పుడల్లా మోదీ పారిపోయారు.. ప్రధానిపై ఢిల్లీ సీఎం ధ్వజం

ABN , First Publish Date - 2023-08-17T20:03:00+05:30 IST

రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై ఉక్కుపాదం మోపుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం అసెంబ్లీలో..

Arvind Kejriwal: సమస్యలు వచ్చినప్పుడల్లా మోదీ పారిపోయారు.. ప్రధానిపై ఢిల్లీ సీఎం ధ్వజం

రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై ఉక్కుపాదం మోపుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం అసెంబ్లీలో మోదీని టార్గెట్ చేస్తూ.. సమస్యలు వచ్చిన ప్రతీసారి ప్రధానమంత్రి మౌనంగానే ఉన్నారని, మైదానం వదిలి పారిపోతున్నారని దుయ్యబట్టారు. చైనా అంశంపై కేజ్రీవాల్ మాట్లాడుతూ.. గత 9 సంవత్సరాల నుంచి భారత్‌పై చైనా కన్నేసిందని, కానీ ప్రధాని మాత్రం మౌనవ్రతం పాటిస్తున్నారని, ఆయన నోటి నుంచి చైనా అనే పదం కూడా రాదని ఎద్దేవా చేశారు.


ఇదే సమయంలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ భారత పర్యటనని కేజ్రీవాల్ ప్రస్తావించారు. 2019 అక్టోబర్ నెలలో చైనా అధ్యక్షుడు భారతదేశానికి వచ్చినట్లు తనకు గుర్తుందని.. ఆ సమయంలో తమిళనాడులోని మహాబలేశ్వరం ఆలయంలో మోదీ, జి జిన్‌పింగ్ చెయ్యి చెయ్యి కలిపి నడుస్తూ ఫోటోలు దిగారని గుర్తు చేసుకున్నారు. అయితే.. అంతకుముందు అంటే 2020 జూన్ 15వ తేదీన గాల్వన్ లోయలో చైనా సైన్యం మన సైనికులపై దాడి చేసి, ఏకంగా 20 మంది సైనికులను హతమార్చిందని పేర్కొన్నారు. జవహర్‌లాల్ నెహ్రూను దుర్భాషలాడే ఈ వ్యక్తులు (బీజేపీ).. చైనాకు పూర్తిగా లొంగిపోయారని ఆరోపించారు. కానీ.. నెహ్రూ అలా లొంగిపోలేదని, వారి కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తూ యుద్ధం చేశారన్నారు. చైనా మన దేశంపై దాడి చేసి 2000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటే.. బీజేపీ దాన్ని బహుమతిగా ఇచ్చేసిందన్నారు.

అలాగే మణిపూర్ అల్లర్లపై కూడా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మోదీపై ధ్వజమెత్తారు. మణిపూర్‌లో ఇప్పటివరకు 6500 కేసులు నమోదయ్యాయని, వేలాది మంది తమ ఇళ్లు వదిలి వెళ్లాల్సి వచ్చిందని, 150 మంది మరణించారని అన్నారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన ఘటన గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరిగాయని.. ప్రధాని మోదీ మాత్రం మౌనం వహించారని తూర్పారపట్టారు. ప్రధాని తండ్రిలాంటి వారని మణిపూర్ సీఎం చెప్తున్నారని.. మరి ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి ఆయన కాపాడారా? అని ప్రశ్నించారు. తాము ఈశాన్య ప్రాంతాలకు చాలాసార్లు వెళ్లామని బీజేపీ వాళ్లు చెప్తున్నారని.. కానీ ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం వెళ్లలేదని అన్నారు. అటు.. మహిళా రెజ్లర్లు పథకాలు గెలిచినప్పుడు ఫోటోలు దిగిన మోదీ.. జంతర్ మంతర్ వద్ద న్యాయం కోసం ధర్నా చేసినప్పుడు మాత్రం మౌనం పాటించారన్నారు.

Updated Date - 2023-08-17T20:03:00+05:30 IST