Congress Files : కాంగ్రెస్ అవినీతి రూ.48,20,69,00,00,000 : బీజేపీ

ABN , First Publish Date - 2023-04-02T15:12:59+05:30 IST

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ (UPA) ప్రభుత్వం పాల్పడిన అవినీతిపై బీజేపీ ఓ వీడియోను ఆదివారం విడుదల చేసింది.

Congress Files : కాంగ్రెస్ అవినీతి రూ.48,20,69,00,00,000 : బీజేపీ
BJP released Congress Files

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ (UPA) ప్రభుత్వం పాల్పడిన అవినీతిపై బీజేపీ ఓ వీడియోను ఆదివారం విడుదల చేసింది. ఇది బీజేపీ విడుదల చేసే ‘కాంగ్రెస్ ఫైల్స్’లో మొదటి ఎపిసోడ్. కాంగ్రెస్ పాలనలో అవినీతి, కుంభకోణాలు ఏ విధంగా జరిగాయో చూడాలని బీజేపీ ఓ ట్వీట్‌లో కోరింది.

‘‘కాంగ్రెస్ ఫైల్స్‌లో మొదటి ఎపిసోడ్ ఇది. కాంగ్రెస్ పాలనలో ఒకదాని తర్వాత మరొక అవినీతి, కుంభకోణాలు ఎలా జరిగాయో చూడండి’’ అని బీజేపీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌తో ఓ వీడియోను జత చేసింది. ఈ వీడియో మెసేజ్‌కు ‘కాంగ్రెస్ అంటే అవినీతి’ అని తెలిపింది. కాంగ్రెస్ పరిపాలించిన 70 ఏళ్లలో రూ.48,20,69,00,00,000 దోచుకుంది. ఈ సొమ్మును భద్రత, అభివృద్ధి కోసం అనేక విధాలుగా ఉపయోగించుకుని ఉండవచ్చు’’ అని తెలిపింది.

మూడు నిమిషాల నిడివిగల ఈ వీడియోలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi), యూపీఏ హయాంలో ప్రధాన మంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్ (Manmohan Singh) కూడా ఉన్నారు.

ప్రజల కష్టార్జితం రూ.48,20,69,00,00,000ను కాంగ్రెస్ దోచుకుందని బీజేపీ ఈ వీడియోలో ఆరోపించింది. ఈ సొమ్ముతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఉండవచ్చునని చెప్పింది. దేశ భద్రత నుంచి అభివృద్ధి వరకు అనేక పథకాలను పూర్తి చేసి ఉండవచ్చునని తెలిపింది. 24 ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌకలను, 300 రఫేల్ యుద్ధ విమానాలను కొనవచ్చునని, 1,000 మంగళ్ మిషన్స్‌‌ను నిర్వహించవచ్చునని తెలిపింది. కాంగ్రెస్ అవినీతి వల్ల పడిన భారాన్ని దేశం మోయవలసి వస్తోందని తెలిపింది. అభివృద్ధిలో దేశం వెనుకబడిందని పేర్కొంది.

రూ.1.86 లక్షల కోట్ల బొగ్గు కుంభకోణం గురించి కూడా దీనిలో ప్రస్తావించింది. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోని చిట్ట చివరి పదేళ్లలో జరిగిన అవినీతిని వివరించింది. వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలులో అగస్టావెస్ట్‌లాండ్ సీఈఓ రూ.350 కోట్లు ముడుపులు చెల్లించారని పేర్కొంది. టూజీ స్పెక్ట్రమ్ కుంభకోణం విలువ రూ.1.76 లక్షల కోట్లు అని తెలిపింది. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కుంభకోణం జరిగిందని, కామన్వెల్త్ కుంభకోణం రూ.70 వేల కోట్లు అని, రైల్వే బోర్డు చైర్మన్‌కు ముడుపులు రూ.12 కోట్లు అని వివరించింది. కాంగ్రెస్ అవినీతిలో ఇది చాలా చిన్న భాగం మాత్రమేనని, సినిమా పూర్తి కాలేదని తెలిపింది.

కాంగ్రెస్ కూడా బీజేపీ అవినీతిపై అనేక ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ కంపెనీలకు మోదీ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు కట్టబెడుతోందని కాంగ్రెస్ దుయ్యబట్టింది.

ఇవి కూడా చదవండి :

Modi Vs Sibal : మోదీ ‘సుపారీ’ ఆరోపణలపై కపిల్ సిబల్ అనూహ్య స్పందన

Modi Surname Case : జైలుకెళ్లేందుకు రాహుల్ గాంధీ సిద్ధమేనా?.. కాంగ్రెస్ వర్గాల కీలక సంకేతాలు..

Updated Date - 2023-04-02T15:12:59+05:30 IST