Kavitha In Delhi: ఈ నెల 10న కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం
ABN , First Publish Date - 2023-03-08T21:26:29+05:30 IST
కల్వకుంట్ల కవిత(BRS MLC K Kavitha) హస్తిన చేరుకున్నారు. దీంతో తెలంగాణలో ఉత్కంఠ నెలకొంది.
హైదరాబాద్: బీఆర్ఎస్(BRS) పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు(KCR) కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC K Kavitha) హస్తిన చేరుకున్నారు. దీంతో తెలంగాణలో ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ (Delhi)లోని జంతర్‌మంతర్ వద్ద భారత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 10న కవిత నిరాహార దీక్ష చేపట్టనున్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 13 నుంచి జరిగే సమావేశాల్లోనే బిల్లు తీసుకురావాలని ఆమె కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ దీక్షలో పాల్గొనాలని అన్ని పార్టీలు, సంఘాలకు ఆమె ఆహ్వానాలు పంపారు. 18 పార్టీల ప్రతినిధులు కవితకు మద్దతుగా దీక్షలో పాల్గొంటారని తెలిసింది.
వాస్తవానికి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు(Delhi Liquor Policy Case)లో విచారణకు హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఆమెకు సమన్లు పంపింది. ఈ నెల 9న విచారణకు హాజరుకావాలని ఆమెకు సమన్లు అందాయి. అయితే ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేయబోతున్నానని చెప్పారు. దీంతో దీక్ష తర్వాత ఆమెకు మళ్లీ సమన్లు పంపుతారని తెలిసింది. ఈసారి విచారణకు పిలిచి కవితను అరెస్ట్ చేయవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీంతో ఢిల్లీతో పాటు తెలంగాణలో కూడా ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు ఈనెల 10వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన.. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటివ్ పార్టీ సహా, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరుగనుంది.
ఈ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ, శాసనమండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్‌లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్‌లు, డిసిఎమ్ఎస్, డిసిసిబి చైర్మన్‌లు పాల్గొంటారు.
ఇది ఎన్నికల సంవత్సరమైన నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ కార్యకలాపాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు.
ప్రతీఒక్కరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని అధినేత కేసీఆర్ సూచించారు.