Delhi liquor Scam Case: మరి కొన్నిగంటల్లో కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. తీర్పు ఎలా వస్తుందో ఏమో అని బీఆర్ఎస్ టెన్షన్

ABN , First Publish Date - 2023-03-26T21:59:08+05:30 IST

సుప్రీం తీర్పు ఎలా వస్తుందో ఏమో అని బీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

Delhi liquor Scam Case: మరి కొన్నిగంటల్లో కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. తీర్పు ఎలా వస్తుందో ఏమో అని బీఆర్ఎస్ టెన్షన్
BRS MLC Kavitha

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో(Delhi liquor Scam Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kavitha) పిటిషన్‌పై ఈ నెల 27న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కవిత పిటిషన్ ఐటెం నెంబర్ 36 గా లిస్ట్ అయింది. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టనుంది. తనకు ఈడీ సమన్లు ఇవ్వడాన్ని ఆమె సవాల్ చేశారు. ఈడీ సమన్లు రద్దు చేయాలని, మహిళలను ఇంటి వద్దే విచారణ చేయాలని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కవిత కోరారు.

మరోవైపు కవితను ఈడీ అధికారులు (Kavitha ED Enquiry) ఇప్పటి వరకూ మూడుసార్లు విచారించారు. మూడు రోజులు మొత్తం 27 గంటలకు పైగా సుదీర్ఘ విచారణ జరిగింది. మూడోరోజు విచారణ పూర్తయిన తర్వాత మాత్రం మళ్లీ విచారణ రావాల్సి ఉంటే మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని కవితతో పాటు ఆమె న్యాయవాది సోమా భరత్‌కు (Soma Bharath) క్లియర్‌గా చెప్పి పంపారని తెలిసింది.

కవితను మొదటిసారి ప్రశ్నించినప్పుడు లిక్కర్ పాలసీ విధానంలో పాత్ర.. అసలు మీరెందుకు ఇందులో తలదూర్చారు..? ఎవరెవరికి ఎంత ముడుపులు ఇచ్చారు..? ప్రత్యేక ఫ్లైట్‌‌ను ఎవరు అరెంజ్ చేశారు..? అసలు కోటాను కోట్లు డబ్బులు మీకు ఎలా వచ్చాయి..? ఆ డబ్బులు ఎవరి దగ్గర్నుంచి తీసుకున్నారు.. ఎందుకిచ్చారు.. ? ఇలా సుమారు 20 ప్రశ్నలకుపైగా కవితపై సంధించి మొదటి రోజు ఉక్కిరిబిక్కిరి చేశారని వార్తలు వచ్చాయి. అంతేకాదు మొదటిరోజే కవిత తన వ్యక్తిగత ఫోన్‌ను కూడా ఈడీ అధికారులకు ఇచ్చేశారు.

రెండోరోజు .. రామచంద్ర అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai) ఎవరు..? గోరంట్ల బుచ్చిబాబు (Gorantla Buchi Babu) ఎవరు..? ఆ ఇద్దరితో మీకున్న సంబంధాలేంటి..? ఈ ఇద్దరికి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఉన్న పాత్రేంటి..? ముఖ్యంగా మనీష్ సిసోడియాతో (Manish Sisodia) మీకు పరిచయం ఎలా ఏర్పడింది..? ఆయనకు ఎంత ముట్టజెప్పారు..? ఇందులో ఇంకా సూత్రదారులు..పాత్రదారులెవరు..? అనే విషయాలతోపాటు 15 ప్రశ్నల వరకూ సంధించారని వార్తలొచ్చాయి.

మూడో రోజు .. కవిత ఫోన్లు (Kavitha Phones) ధ్వంసం చేశారని ఈడీ స్వయంగా ఆరోపణలు చేసింది. తనపై ఈడీ (Enforcement Directorate) లేనిపోని అభియోగాలు మోపుతోందని ఈడీ అధికారులు ఎన్ని ఫోన్లయితే అడిగారో వాటన్నింటినీ కవిత భద్రంగా ప్యాక్ చేసి సీల్డ్ కవర్‌లో ఈడీకి అందజేశారు కవిత. ఈ ఫోన్ల గురించే మూడోరోజు మొత్తం విచారణ జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

సుప్రీంకోర్టులో 27న వచ్చే పిటిషన్‌లో తన తరఫున ఎలాంటి వాదనలు వినిపించాలనే దానిపై సీఎం కేసీఆర్‌, లీగల్ సెల్, న్యాయ నిపుణులతో ప్రగతి భవన్‌ వేదికగా కవిత కూడా చర్చించారు. కవితతో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా సుమారు కొన్ని గంటల పాటు ఈ విషయాలపై చర్చించారు. రాజకీయంగా బీజేపీని.. న్యాయపరంగా ఈడీని ఎలా ఎదుర్కోవాలనే దానిపై నిశితంగా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

సుప్రీం తీర్పును బట్టి ఈడీ అధికారులు ముందుకెళ్తారని తెలుస్తోంది. అయితే ఈసారి విచారణకు వెళ్తే కచ్చితంగా కవితను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే సుప్రీం తీర్పు ఎలా వస్తుందో ఏమో అని బీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

Updated Date - 2023-03-26T21:59:36+05:30 IST