Bharat Jodo Yatra : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన నిర్ణయం
ABN , First Publish Date - 2023-01-11T19:15:37+05:30 IST
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ముగింపు సమావేశానికి
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ముగింపు సమావేశానికి హాజరుకావాలని భావ సారూప్యతగల పార్టీలను ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కోరారు. తమిళనాడులోని కన్యా కుమారిలో సెప్టెంబరు 7న ప్రారంభమైన ఈ యాత్ర జనవరి 30న జమ్మూ-కశ్మీరులోని శ్రీనగర్‌లో ముగుస్తుందని, ఈ సందర్భంగా తాము నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనాలని కోరారు. నేతలంతా పాల్గొంటే ఈ యాత్ర సందేశం బలోపేతమవుతుందని చెప్పారు. సత్యం, కారుణ్యం, అహింస ఈ యాత్ర సందేశమని వివరించారు.
21 రాజకీయ పార్టీల అధ్యక్షులకు ఖర్గే రాసిన లేఖలో, ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి భావ సారూప్యతగల పార్టీల భాగస్వామ్యాన్ని కాంగ్రెస్ కోరుతోందని తెలిపారు. రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకు వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు వివిధ దశల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ నెల 30 మధ్యాహ్నం శ్రీనగర్‌లో నిర్వహించే ముగింపు సభకు వ్యక్తిగతంగా హాజరుకావాలని తాను ఆహ్వానిస్తున్నానని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ స్మృత్యర్థం ఈ కార్యక్రమాన్ని అంకితం చేస్తున్నామన్నారు. మహాత్మా గాంధీ జనవరి 30న ప్రాణాలు విడిచిన విషయాన్ని గుర్తు చేశారు.విద్వేషం, హింస సిద్ధాంతానికి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడుతూ ఆయన ప్రాణాలు విడిచారని తెలిపారు.
ఈ సందర్భంగా మనమంతా విద్వేషం, హింసలతో పోరాడటానికి మనల్ని మనం అంకితం చేసుకుందామని పిలుపునిచ్చారు. సత్యం, కారుణ్యం, అహింస సందేశాన్ని వ్యాపింపజేయడానికి కట్టుబడదామని కోరారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, అందరికీ న్యాయం అనే రాజ్యాంగ విలువలను కాపాడదామన్నారు. ప్రస్తుతం ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లిస్తున్నారని ఆరోపించారు. దేశం ఎదుర్కొంటున్న ఈ సంక్షోభ సమయంలో ఈ యాత్ర శక్తిమంతమైన గళంగా ఆవిర్భవించిందని తెలిపారు. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, దాని సందేశాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు.
భారత్ జోడో యాత్రలో భాగంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర జరిగింది. ఇప్పటి వరకు సుమారు 3,300 కిలోమీటర్ల మేరకు ఈ యాత్ర సాగింది.