Adani Vs Congress : అదానీ గ్రూప్ కార్యకలాపాలను ఎందుకు అనుమతిస్తున్నారు? : జైరామ్ రమేశ్
ABN , First Publish Date - 2023-04-09T19:53:37+05:30 IST
అదానీ గ్రూప్ (Adani Group)నకు చైనాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో భారత దేశంలో నౌకాశ్రయాల నిర్వహణకు
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ (Adani Group)నకు చైనాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో భారత దేశంలో నౌకాశ్రయాల నిర్వహణకు అదానీకి ఎందుకు అనుమతిస్తున్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఇటువంటి ఆరోపణలతోనే 2022లో ఓ కన్సార్షియంకు భద్రతపరమైన అనుమతులను భారత ప్రభుత్వం నిరాకరించిన విషయాన్ని గుర్తు చేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)కి కాంగ్రెస్ ‘‘హమ్ అదానీ కే హైఁ కౌన్’’ శీర్షికతో అనేక ప్రశ్నలను సంధిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ (Congress general secretary Jairam Ramesh) ఓ మీడియా కథనాన్ని ప్రస్తావించారు. 2022లో ఏపీఎం టెర్మినల్స్ మేనేజ్‌మెంట్, తైవాన్‌కు చెందిన వాన్ హై లైన్స్ కన్సార్షియంనకు భద్రతపరమైన అనుమతులను భారత ప్రభుత్వం నిరాకరించిందని ఈ మీడియా కథనం తెలిపింది. వాన్ హై డైరెక్టర్‌కు చైనా కంపెనీతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైందని దర్యాప్తు, నిఘా సంస్థలు కనుగొనడంతో ప్రభుత్వం ఈ అనుమతిని నిరాకరించిందని తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ వద్ద ఓ కంటెయినర్ హ్యాండ్లింగ్ టెర్మినల్‌ను నిర్వహించే అవకాశం ఈ కన్సార్షియంకు దక్కలేదని తెలిపింది.
జైరామ్ రమేశ్ విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో, చైనాతో సంబంధాలున్న చైనీస్ కంపెనీలు, సంస్థలు భారత దేశంలో పోర్టులు, టెర్మినల్స్‌ను నిర్వహించరాదనేది ప్రభుత్వ విధానమని చెప్పారు. చైనాతో అదానీ గ్రూప్‌నకు ఉన్న సంబంధాల గురించి తాజా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. చైనా పౌరుడు చాంగ్ చుంగ్-లింగ్ (Chang Chung-Ling)తో అదానీ గ్రూప్‌నకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తాము ‘‘హమ్ అదానీ కే హైఁ కౌన్’’ సిరీస్‌లో పదే పదే లేవనెత్తుతున్నామన్నారు.
చాంగ్ చుంగ్-లింగ్ కుమారునికి చెందినదే పీఎంసీ ప్రాజెక్ట్స్ అని తెలిపారు. అదానీ గ్రూప్ కోసం పీఎంసీ ప్రాజెక్ట్స్ అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించిందన్నారు. పోర్టులు, టెర్మినల్స్, రైల్ లైన్స్, పవర్ లైన్స్ వంటివాటిని నిర్మించిందన్నారు. అదానీ గ్రూప్, పీఎంసీ రూ.5,500 కోట్ల పవర్ ఎక్విప్‌మెంట్ ఓవర్ ఇన్వాయిసింగ్ కుంభకోణానికి పాల్పడినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ ఆరోపించిందన్నారు.
అదానీ గ్రూప్ షాంఘైలో రెండు షిప్పింగ్ కంపెనీలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోందని, వీటిలో ఓ కంపెనీ చైనా మిత్ర దేశమైన ఉత్తర కొరియాకు చట్టవిరుద్ధంగా పెట్రోలియం ఉత్పత్తులను అమ్ముతున్నట్లు తెలుస్తోందని ఆరోపించారు. ఈ విధంగా చైనాతో సన్నిహిత సంబంధాలు ఉన్న అదానీ గ్రూప్‌నకు పోర్టులను నిర్వహించే అవకాశాన్ని ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఒక పోర్టు తర్వాత మరొక పోర్టును కొనడానికి ఎందుకు అనుమతిస్తున్నారని నిలదీశారు. కొన్ని పోర్టుల యజమానులపై దాడులు చేసిన తర్వాత అదానీ వశమవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. తీవ్రమైన భద్రతపరమైన పర్యవసానాలను పట్టించుకోకుండా ఎందుకు అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించారు.
అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) నివేదిక వెల్లడించినప్పటి నుంచి కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అదానీ గ్రూప్ లావాదేవీలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అయినప్పటికీ సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్, ఇతర పార్టీలు పట్టుబడుతున్నాయి. అయితే ఈ ఆరోపణల్లో పస లేదని అదానీ గ్రూప్ తెలిపింది. తాము చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి :
PM Modi : ‘ది ఎలిఫెంట్ విస్పరర్’ జంట బొమ్మన్, బెల్లీలతో మోదీ మాటమంతి
Tigers : దేశంలో పులుల సంఖ్య పెరిగింది : మోదీ