One Nation-One Election : ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’పై ఏ పార్టీ ఏమంటోంది?

ABN , First Publish Date - 2023-09-01T10:51:07+05:30 IST

‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి బీజేపీ చేస్తున్న మరో ప్రయత్నం ఇదని దుయ్యబడుతున్నాయి.

One Nation-One Election : ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’పై ఏ పార్టీ ఏమంటోంది?

న్యూఢిల్లీ : ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ (One Nation-One Election) నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి బీజేపీ చేస్తున్న మరో ప్రయత్నం ఇదని దుయ్యబడుతున్నాయి. లోక్ సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల సమస్యలేమీ ఉండవని కేంద్రం చెప్తోంది. ఈ ప్రయత్నాన్ని అందరూ స్వాగతించాలని కోరింది.

రాజకీయ మైలేజి కోసమే..

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం రాజకీయ మైలేజి కోసమే ఇటువంటి ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టింది. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ స్పందిస్తూ, ఈ చర్య వెనుక రహస్య ఎజెండా ఉందని, ప్రాంతీయ పార్టీలను నిర్మూలించాలనే ఎజెండా ఉందని మండిపడింది.


రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో..

‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ కోసం కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) అధ్యక్షతన ఓ కమిటీని శుక్రవారం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా లోక్ సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించేందుకు కల అవకాశాలను పరిశీలించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో రాజ్యాంగ నిపుణులు ఉంటారని తెలుస్తోంది. కేబినెట్ కార్యదర్శి, మాజీ సీజేఐ, మాజీ ఈసీఐ, విశ్రాంత న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారని తెలుస్తోంది. రాజ్యాంగ సవరణలు అవసరం కాబట్టి ఈ కమిటీలో ఇద్దరు విశ్రాంత న్యాయమూర్తులను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. చట్టపరమైన, రాజకీయపరమైన అభిప్రాయాలను ఈ కమిటీ సేకరిస్తుంది.

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సెప్టెంబరు 18 నుంచి 22 వరకు జరుగుతాయని తెలిపారు. 17వ లోక్ సభలో 13వ సెషన్, రాజ్య సభ 261వ సెషన్ జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశాల్లో ఐదు సిట్టింగ్స్ ఉంటాయన్నారు. అమృత కాలంలో పార్లమెంటులో సత్ఫలితాలిచ్చే చర్చల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.


ఆమోదం ఎలా?

‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంటులో మూడింట రెండొంతుల మంది ఎంపీలు మద్దతు ఇవ్వాలి. అదేవిధంగా దేశంలోని 50 శాతానికిపైగా రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. అయితే ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం లేదని కొందరు చెప్తున్నారు.

గతంలో..

ఇదిలావుండగా, 1967 వరకు లోక్ సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతూ ఉండేవి. 1968-69లో కొన్ని రాష్ట్రాల శాసన సభలను పదవీ కాలం ముగియక మునుపే రద్దు చేయడంతో ఈ విధానానికి గండిపడింది. అదే విధంగా లోక్ సభ పదవీ కాలం ముగియడానికి ఒక ఏడాది ముందే రద్దు చేసి, 1971లో మధ్యంతర ఎన్నికలను నిర్వహించారు.

బీజేపీ మేనిఫెస్టోలో..

2014 లోక్ సభ ఎన్నికల ప్రణాళికలో బీజేపీ ఇచ్చిన హామీల్లో ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ కూడా ఉంది. నేరగాళ్లను నిర్మూలించేందుకు ఎన్నికల సంస్కరణలను తీసుకొస్తామని హామీ ఇచ్చింది. ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం వల్ల రాజకీయ పార్టీలతోపాటు ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా స్థిరత్వం లభిస్తుందని తెలిపింది.


ఇవి కూడా చదవండి :

Bomb Threat : ‘తాజ్ హోటల్‌ను ఇద్దరు పాకిస్థానీలు పేల్చేస్తారు’.. ముంబై పోలీసులకు బెదిరింపు ఫోన్ కాల్..

One Nation-One Election : ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ కోసం కేంద్రం మరో ముందడుగు

Updated Date - 2023-09-01T10:51:07+05:30 IST