Defamation Case: ఉద్ధవ్ థాకరే, సంజయ్ రౌత్‌కు హైకోర్టు సమన్లు
ABN , First Publish Date - 2023-03-28T14:45:12+05:30 IST
పరువునష్టం కేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఆదిత్య థాకరే, సంజయ్ రౌత్ లకు...
న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray), ఆదిత్య థాకరే (Aditya Thackeray), సంజయ్ రౌత్ (Sanjay Raut)లకు ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు నోటీసులు పంపింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం నేత రాహుల్ షెవాలే ఈ పరువునష్టం కేసు వేశారు. శివసేన గుర్తును ఏక్‌నాథ్ షిండే వర్గం రూ.2,000 కోట్లకు కొనుగోలు చేసిందంటూ థాకరేలు, సంజయ్ రౌత్ చేసిన ఆరోపణలపై ఈ పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ ప్రతీక్ జలన్ సమన్లు జారీ చేశారు. తదుపరి విచారణను ఏప్రిల్ 17కు వాయిదా వేశారు.
షెవాలే తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాది రాజీవ్ నాయర్ తన వాదన వినిపిస్తూ, ప్రతివాదులు పరువునష్టం కలిగించే మరిన్ని వ్యాఖ్యలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే కోర్టు ఇందుకు నిరాకరిస్తూ, సంబంధిత పార్టీలు స్పందన తర్వాత మాత్రమే ఆదేశాలు ఇవ్వగలమని చెప్పారు. ఈ కేసులో ఆరోపణలు తప్పా, ఒప్పా అనేది ఇప్పటికిప్పుడు తేల్చలేమని, అఫిడవిడ్ రికార్డ్ అయిన తర్వాత ఒక నిర్ణయానికి రాగలమని, మొదటి రోజే ఆదేశాలు ఇవ్వలేమని అన్నారు.
వివాదం ఏమిటంటే..
శివసేన పార్టీ, ఆ పార్టీ ఎన్నికల గుర్తు అయిన విల్లు-బాణం ఏక్‌నాథ్ షిండే వర్గానికి ఇటీవల భారత ఎన్నికల కమిషన్ కేటాయించింది. పార్టీ పేరు, గుర్తు కోల్పోవడంపై ఉద్ధవ్ వర్గం నేతలు సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం అన్యాయమని సంజయ్ రౌత్ పేర్కొంటూనే, పార్టీ పేరు, గుర్తును కొనుగోలు చేసేందుకు భారీగా డీల్ చేశారని అన్నారు. ఇందుకోసం రూ.2,000 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయన్నారు. అధికార పక్షానికి దగ్గరగా ఉండే ఓ బిల్టర్ ఈ విషయం వెల్లడించాడని, త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు, ఎంపీలకు రూ.100 కోట్లు, తమ కౌన్సిలర్లను కొనుగోలు చేసేందుకు రూ.50 లక్షల నుంచి కోటి వరకూ చెల్లించి పార్టీ మారేలా చేశారని రౌత్ ఆరోపించారు.