Annamalai Vs DMK : తమిళ గీతానికి అవమానం.. అణ్ణామలైపై డీఎంకే ఆరోపణ..
ABN , First Publish Date - 2023-04-28T21:53:52+05:30 IST
తమిళనాడు బీజేపీ చీఫ్ కే అణ్ణామలై (K Annamalai) తమిళ తల్లి గీతాన్ని అవమానించారని డీఎంకే ఆరోపించింది. కర్ణాటకలోని శివమొగ్గలో గురువారం
చెన్నై : తమిళనాడు బీజేపీ చీఫ్ కే అణ్ణామలై (K Annamalai) తమిళ తల్లి గీతాన్ని అవమానించారని డీఎంకే ఆరోపించింది. కర్ణాటకలోని శివమొగ్గలో గురువారం ఈ సంఘటన జరిగిందని డీఎంకే నేతలు కనిమొళి, తదితరులు ఆరోపించారు. దీనిపై స్పందించిన అణ్ణామలై ‘‘ఒకరితో మరొకరు పోట్లాడుకోవడానికి ఇది డీఎంకే వేదిక కాదు’’ అని చెప్పారు.
కర్ణాటక శాసన సభ ఎన్నికలకు బీజేపీ సహ ఇన్‌ఛార్జిగా అణ్ణామలై వ్యవహరిస్తున్నారు. ఆయన గురువారం శివమొగ్గలో ఓ సభలో పాల్గొన్నారు. నిర్వాహకులు తమిళ తల్లి గీతాన్ని ప్లే చేశారు. అదే వేదికపై ఉన్న సీనియర్ బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప జోక్యం చేసుకుని, తమిళ గీతానికి బదులుగా కర్ణాటక రాష్ట్ర గీతాన్ని వినిపించాలని కోరారు.
దీనిపై డీఎంకే నేత కనిమొళి స్పందిస్తూ, తమిళ తల్లి గీతాన్ని అవమానించకుండా తన పార్టీ సభ్యులను నిలువరించలేని వ్యక్తి తమిళనాడు ప్రజల గురించి ఏం పట్టించుకోగలుగుతారు? అని ప్రశ్నించారు.
దీనిపై అణ్ణామలై స్పందిస్తూ, కర్ణాటక రాష్ట్ర గీతాన్ని ముందుగా వినిపించిన తర్వాత మాత్రమే ఇతర గీతాలను వినిపించాలని ఈశ్వరప్ప అన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 2020లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అణ్ణామలై పోస్ట్ చేశారు. స్టాలిన్ జాతీయ గీతాన్ని అవమానించారని తెలిపారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించాలని తెలియని వ్యక్తి స్టాలిన్ అని తెలిపారు. తమిళ తల్లి రాష్ట్ర గీతం నుంచి ‘కన్నడముంగ్ కలితెలుంగుమ్ కవిన్మలయాలముమ్ తులువుమ్’ అనే మాటలను తొలగించిన చరిత్ర మీది కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు బీజాలు నాటిన చరిత్ర మీది కాదా? అని ప్రశ్నించారు.
‘‘మీ నుంచి, డీఎంకే నుంచి తమిళనాడు ప్రజలను కాపాడటమే మా ఏకైక లక్ష్యం. ఆందోళన చెందకండి’’ అని అణ్ణామలై అన్నారు.
తమిళనాడు మంత్రి, స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా అణ్ణామలైని విమర్శించారు. తమిళ తల్లి గీతానికి అణ్ణామలై ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో దీనిని బట్టి స్పష్టమవుతోందన్నారు.
ఇవి కూడా చదవండి :
Supreme Court : విద్వేష ప్రసంగాలపై తక్షణం కేసులు నమోదు చేయాలి.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం..
Sri Ram Navami : శ్రీరామ నవమి హింసాకాండలో మమత పాత్రపై దర్యాప్తు జరగాలి : వీహెచ్‌పీ