Money laundering case: ఆప్‌ను వదలని ఈడీ.. మరో కీలక నేత ఇంట్లో సోదాలు
ABN , First Publish Date - 2023-10-10T11:51:42+05:30 IST
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను మనీలాండరింగ్, మద్యం పాలసీ కేసులు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. తాజాగా మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను మనీలాండరింగ్, మద్యం పాలసీ కేసులు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. తాజాగా మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అమానతుల్లా ఖాన్ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం దాడులు చేసింది. మంగళవారం ఉదయం నుంచి అమానతుల్లా ఖాన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ చర్యలు ప్రారంభించింది. అమానతుల్లా ఖాన్ ఛైర్మన్‌గా ఉన్న ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలకు సంబంధించి ఆయనపై కేసులు నమోదయ్యాయి. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) నిబంధనల ప్రకారం ఈ సోదాలు జరుగుతున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీలోని ఓఖ్లా నియోజకవర్గానికి చెందిన 49 ఏళ్ల అమానతుల్లా ఖాన్‌ను ఇదే కేసులో గతేడాది ఢిల్లీ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 2022లో బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి బయటికొచ్చారు. అమానతుల్లా ఖాన్ ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న సమయంలో అన్ని నిబంధనలను, ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ 32 మందిని అక్రమంగా రిక్రూట్ చేసుకున్నారని ఆయనపై ఆరోపణలున్నాయి. ఆ ఆరోపణల ఫిర్యాదు ఆధారంగానే ఖాన్‌పై కేసు నమోదైంది. ఫిర్యాదులో ఆయనపై అవినీతి, పక్షపాతం ఆరోపణలు కూడా ఉన్నాయి. ఢిల్లీ మద్యం పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆప్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం (అక్టోబర్ 4) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ కొద్ది రోజులకే ఖాన్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ తర్వాత ఢిల్లీలోని అధికార ఆప్ పార్టీలో అరెస్టైన రెండో పెద్ద నాయకుడు సంజయ్ సింగ్ కావడం గమనార్హం. మరోవైపు సంజయ్ సింగ్ అరెస్టును నరేంద్ర మోదీ ప్రభుత్వం నియంతృత్వ చర్యగా ఆప్ పార్టీ అభివర్ణించింది.