తమిళనాడులో మరోసారి ఈడీ దాడుల కలకలం.. డీఎంకే మంత్రి ఇంట్లో..
ABN , First Publish Date - 2023-07-17T13:29:02+05:30 IST
తమిళనాడులో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. మనీలాండరింగ్ కేసులో అధికార డీఎంకే కీలక నేత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి, ఆయన కుమారుడు ఎంపీ గౌతం సిగమణి నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. చెన్నై, విల్లుపురంలోని తండ్రికొడుకుల ఇళ్ల వద్ద ఈడీ దాడులు జరుగుతున్నాయి.
చెన్నై: తమిళనాడులో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. మనీలాండరింగ్ కేసులో అధికార డీఎంకే కీలక నేత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి, ఆయన కుమారుడు ఎంపీ గౌతం సిగమణి నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. చెన్నై, విల్లుపురంలోని తండ్రికొడుకుల ఇళ్ల వద్ద ఈడీ దాడులు జరుగుతున్నాయి. కాగా ఈ దాడులను అధికార డీఎంకే పార్టీ ‘రాజకీయ ప్రతీకారం’గా అభివర్ణించింది. 72 ఏళ్ల మంత్రి కె.పొన్ముడి విల్లుపురం జిల్లాలోని తిరుక్కోయిలూరు నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆయన 49 ఏళ్ల కుమారుడు గౌతం సిగమణి కల్లకురిచ్చి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కాగా ఈ మనీలాండరింగ్ కేసు ఇప్పటికాదు. 2007 నుంచి 2011 మధ్య పొన్ముడి తమిళనాడు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో క్వారీ లైసెన్స్ షరతులను ఉల్లంఘించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. పరిమితికి మంచి ఎర్ర ఇసుకను తవ్వారని పలువురు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.28 కోట్లు నష్టం వాటిల్లిందని అంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రి, ఆయనతో సంబంధం ఉన్నవారిపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదు నమోదైంది. ఈ క్రమంలోనే మంత్రి, మంత్రి కుమారుడిపై ఈడీ దాడులు మొదలుపెట్టింది. అయితే ఈ కేసుపై విచారణను నిలిపివేయాలని సిగమణి మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కానీ మంత్రి, మంత్రి కుమారుడు నేరం చేసినట్లు భావించడానికి కారణాలు ఉన్నాయని, అందువల్ల విచారణను ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
కాగా డీఎంకే మంత్రులపై మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు దాడులు నిర్వహించడం కొత్తేం కాదు. ఇటీవల రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ మనీలాండరింగ్ కేసులోనే అరెస్ట్ అయ్యారు. ఆ వెంటనే స్టాలిన్ కేబినెట్‌లోని మరో మంత్రిపై ఈడీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.