Women's Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి తెలుసుకుంటే అవాక్కవుతారు

ABN , First Publish Date - 2023-03-10T11:11:30+05:30 IST

మహిళా రిజర్వేషన్లు అనేది గొప్ప ప్రజాకర్షక నినాదం. అయితే ఇది ఎంత ఆకర్షణీయమైనదో, అంత వివాదాస్పదమైనదిగా కొనసాగుతోంది.

Women's Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి తెలుసుకుంటే అవాక్కవుతారు
Women's Reservation Bill

హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్ల బిల్లును (Women's Reservation Bill) పార్లమెంటులో వెంటనే ఆమోదించి చట్టంగా చెయ్యాలన్న డిమాండ్‌తో బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Brs Mlc Kavitha)దేశరాజధాని ఢిల్లీలో నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీజం పడినప్పటి నుంచీ నేటివరకూ ఉన్న పరిస్థితిపై ప్రత్యేక కథనం.

చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయాలనే ఆలోచనకు మూలం గ్రామ పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన రాజ్యాంగ సవరణ. గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవుల్లో మూడింట ఒక వంతు (33 శాతం) మహిళలకు కేటాయిస్తూ 1993లో జరిగిన రాజ్యాంగ సవరణ ఈ బిల్లుకు మూలం. మహిళా రిజర్వేషన్ బిల్లును 1996 సెప్టెంబరు 12న అప్పటి ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మొదటిసారి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే ఇప్పటికీ ఇది చట్ట రూపం దాల్చలేదు.

లోక్‌సభ, శాసన సభ స్థానాల్లో 33 శాతం స్థానాలను మహిళలకు కేటాయించాలని, చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలని, వారి ప్రతిభాపాటవాలను దేశం కోసం, ప్రజల కోసం వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. మూడు సార్వత్రిక ఎన్నికల్లో రొటేషనల్ ప్రాతిపదికపై ఈ రిజర్వేషన్లను అమలు చేయవలసి ఉంటుంది. అంటే మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఒకసారి మాత్రమే ఒక నియోజకవర్గాన్ని మహిళలకు కేటాయిస్తారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill)ను 1996 సెప్టెంబరు 12న అప్పటి ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ (HD Deve Gauda) నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం (United Front Government) మొదటిసారి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కానీ దీనికి ఆమోదం లభించలేదు. గీతా ముఖర్జీ నేతృత్వంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (Joint Parliamentary Committee)కి ఈ బిల్లును నివేదించింది. ఈ కమిటీ తన నివేదికను 1996 డిసెంబరు 9న లోక్‌సభకు సమర్పించింది.

1998 జూలై 13న ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు అప్పటి న్యాయ శాఖ మంత్రి ఎం తంబిదురై (ఎన్డీయే ప్రభుత్వం) సమాయత్తమవుతుండగా, ఆర్జేడీ ఎంపీ సురేంద్ర ప్రసాద్ యాదవ్ సభ వెల్‌లోకి వెళ్ళి స్పీకర్ జీఎంసీ బాలయోగి (GMC Bala Yogi) వద్దనున్న ఈ బిల్లు ప్రతులను లాక్కొని, చింపేశారు.

ఈ బిల్లును 1999లో ఎన్డీయే ప్రభుత్వం (NDA Government) లోక్‌సభ (Lok Sabha)లో ప్రవేశపెట్టింది, కానీ ఆమోదం లభించలేదు. 2002లో మరోసారి ప్రవేశపెట్టింది. దీనికి మద్దతిస్తామని కాంగ్రెస్ (Congress), వామపక్షాలు (Left Parties) హామీ ఇచ్చాయి.

2003లో అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పాయి (Atal Bihari Vajpayee) నేతృత్వంలోని ప్రభుత్వం రెండుసార్లు ఈ బిల్లును పార్లమెంటు (Parliament)లో ప్రవేశపెట్టింది. ఏకాభిప్రాయం కుదరకపోయినా ఈ బిల్లుకు ఆమోదం పొందాలనుకుంటున్నామని బీజేపీ అప్పట్లో ప్రకటించింది. అదే సంవత్సరం మే నెలలో ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభ వెల్‌లోకి దూసుకెళ్లి, ఈ బిల్లును ప్రస్తుత రూపంలో అనుమతించబోమని స్పష్టం చేశారు. 2004లో లోక్‌సభ ఎన్నికలకు కాస్త ముందు వాజ్‌పాయి మాట్లాడుతూ, ఈ బిల్లు నిలిచిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు.

2004 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ (UPA) కనీస ఉమ్మడి కార్యక్రమంలో ఈ బిల్లు గురించి ప్రస్తావించారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే లోక్‌సభ, శాసన సభల్లో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు కేటాయిస్తూ చట్టం చేసేందుకు నాయకత్వం వహిస్తామని తెలిపింది. 2005లో బీజేపీ ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అయితే మహిళలకు కోటాలో కోటా కులం ప్రాతిపదికపై ఉండాలని బీజేపీ (BJP) నేతలు కొందరు డిమాండ్ చేశారు.

ఈ బిల్లుకు కాలదోషం పట్టకూడదనే ఉద్దేశంతో 2008లో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 2010 మార్చి 9న ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party), లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) నేతృత్వంలోని ఆర్జేడీ (RJD) ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించాయి. వెనుకబడిన కులాలకు చెందిన మహిళలకు మహిళా రిజర్వేషన్లలో ప్రత్యేక రిజర్వేషన్లు ఉండాలని ఈ పార్టీలు పట్టుబట్టాయి.

ఎల్‌జేపీ (LJP), బీజేడీ (BJD) పార్టీల నేతలు బహిరంగ సభలు, ఉపన్యాసాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ బిల్లుకు మోక్షం కలగాలంటే లోక్‌సభ (Lok Sabha) కూడా ఆమోదించవలసి ఉంది. లోక్‌సభలో ఆధిక్యతగల పార్టీయే దీనిని ఆమోదించే విధంగా పరిస్థితులను చక్కదిద్దగలుగుతుంది. అనేక సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తల్చుకుంటే దీనిని కూడా ఆమోదింపజేసి, ప్రజాదరణను సొంతం చేసుకోగలుగుతారు.

ఇవి కూడా చదవండి :

Avinash Reddy: సస్పెన్స్‌కు తెర.. మొత్తానికి అవినాష్ ఇలా ముందుకు..!

Minister: ఎన్ని కనెక్షన్లున్నా వంద యూనిట్ల ఉచిత విద్యుత్‌

Updated Date - 2023-03-10T17:55:01+05:30 IST