Rahul Gandhi : మోదీని దేవుడి పక్కన కూర్చోబెడితే.. : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2023-05-31T11:30:39+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi : మోదీని దేవుడి పక్కన కూర్చోబెడితే.. : రాహుల్ గాంధీ

శాన్‌ఫ్రాన్సిస్కో : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తమకే అన్నీ తెలుసునని పరిపూర్ణంగా నమ్ముతున్న కొందరు వ్యక్తులు భారత దేశాన్ని పరిపాలిస్తున్నారన్నారు. ఆ వ్యక్తులు దేవుడి పక్కన కూర్చుని, దేవుడికే అన్ని విషయాలూ వివరించి చెప్పగలరన్నారు. అటువంటి వ్యక్తుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒకరని చెప్పారు.

‘‘మోదీని దేవుడి పక్కన కూర్చోబెడితే, ఈ విశ్వం ఎలా పని చేస్తోందో దేవుడికి మోదీ వివరిస్తారు. అప్పుడు దేవుడు కంగారుపడతాడు, నేను ఏం సృష్టించాను? అని అయోమయంలోకి వెళతాడు. ఇవి సరదా విషయాలు కానీ జరుగుతున్నది అదే. అన్ని విషయాలను అర్థం చేసుకునే ఓ బృందం ఉంది. వారు సైంటిస్టులకు సైన్స్‌ను వివరించి చెప్పగలరు. చరిత్రకారులకు చరిత్రను, సైన్యానికి యుద్ధాన్ని వివరించి చెప్పగలరు. కానీ వారిది మిడి మిడి జ్ఞానం, వారికి అసలు ఏదీ అర్థం కాదు. ఎందుకంటే జీవితంలో, వినడానికి సిద్ధంగా లేనపుడు మీరు దేనినీ అర్థం చేసుకోలేరు’’ అని ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ రాహుల్ చెప్పారు.

భారత దేశం ఏ సిద్ధాంతాన్నీ తిరస్కరించలేదన్నారు. అటువంటి భారత దేశానికి మీరు (ఎన్ఆర్ఐలు) ప్రాతినిధ్యంవహిస్తున్నారన్నారు. ఈ విలువలతో ఏకీభవించకపోతే మీరు ఇక్కడ (తన సమావేశంలో) ఉండేవారు కాదన్నారు. మీరు ఆగ్రహం, విద్వేషం, దురహంకారాలను నమ్మేవారైతే బీజేపీ సమావేశంలో ఉండేవారని, తాను ‘మన్ కీ బాత్’ చెప్పుకునేవాడినని తెలిపారు. భారత దేశంలో భారత దేశ జాతీయ జెండాను పట్టుకున్నందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పారు.

‘‘మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పమని నన్ను అడిగారు. ఇది కూడా బీజేపీలో జరగదు. బీజేపీలో ప్రశ్నలుండవు, కేవలం జవాబులు మాత్రమే ఉంటాయి’’ అన్నారు.

మోదీ, ఆయన ప్రభుత్వం నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆగ్రహం, విద్వేషం వంటి సమస్యలను పరిష్కరించలేకపోతున్నారని, వీటిపై వారు చర్చించరని, అందుకే ధర్మదండం, రాజదండం వంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. సాష్టాంగ ప్రణామాలు చేస్తుండటాన్ని మీరు చూస్తున్నారన్నారు. ‘‘నేను సాష్టాంగ ప్రణామం చేయకపోవడం పట్ల మీరు సంతోషంగా లేరా?’’ అని ప్రశ్నించారు.

మోదీ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించినపుడు, లోక్‌సభ సభాపతి ఆసనం వద్ద ధర్మదండాన్ని ప్రతిష్ఠించారు. అంతకుముందు ధర్మదండానికి ప్రత్యేక పూజలు చేసి, సాష్టాంగ ప్రణామం చేశారు. ఈ విషయాన్ని రాహుల్ ప్రస్తావించారు.

రాహుల్ గాంధీ అమెరికాలో 10 రోజులపాటు పర్యటిస్తారు. మొదట శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో ఆయన బుధవారం మాట్లాడారు. ఆయన బ్రిటన్‌లో పర్యటించినపుడు పెను దుమారం రేగింది. ఆయన భారత దేశ ప్రజాస్వామ్యాన్ని విదేశీ గడ్డపై అవమానించారని విమర్శలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి :

Minister: ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి ఉదయనిధి ఏమన్నారో తెలుసా.. టీచర్లకు మా ప్రభుత్వం..

President: 15న చెన్నై నగరానికి రాష్ట్రపతి

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-05-31T11:30:39+05:30 IST