నకిలీ బంగారం తాకట్టు పెట్టి బురిడీ
ABN , First Publish Date - 2023-01-31T00:25:07+05:30 IST
కాకినాడ యూసీవో బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ మాయాజాలాన్ని పోలీసులు బయటపెట్టారు.
కాకినాడ క్రైం, జనవరి 30: కాకినాడ యూసీవో బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ మాయాజాలాన్ని పోలీసులు బయటపెట్టారు. 8 కిలోల 316 గ్రాముల నకిలీ బంగారం తాకట్టు పెట్టి 31 మంది ఖాతాలతో 3 నెలల్లో 60 దఫాలుగా రూ.2,45,84,000 కోట్లు తీసుకుని యూసీవో బ్యాంకును బురిడీ కొట్టించి మోసం చేసినట్లు చెప్పారు. బ్యాంకు మోసం కేసును ఎస్పీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేయించారు. ప్రధాన నిందితుడి అరెస్ట్ కోసం నాలుగు ప్రత్యేక బృందాలు కష్టపడి ఎట్టకేలకు పట్టుకున్నాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల అరెస్ట్ వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్పీ(అడ్మిన్) పి.శ్రీనివాస్ సోమవారం వెల్లడించారు. కాకినాడ రామకృష్ణారావుపేటకు చెందిన తాడోజు శ్రీనివాసరావు ఏడాదిన్నరకాలంగా స్థానిక యూసీవో బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. అతను నకిలీ బంగారం తాకట్టు పెట్టి 60 గోల్డ్ లోన్లను 31 మందిపై పెట్టి రూ.2 కోట్ల 45 లక్షల 84 వేల రుణం తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. నకిలీ బంగారం తాకట్టు విషయమై యూసీవో బ్యాంకు జోనల్ మేనేజర్ జనవరి 6న కాకినాడ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జెడ్‌ఎం ఫిర్యాదు మేరకు సీఐ నాగేశ్వర నాయక్ కేసు నమోదు చేశారు. కోట్లాది ప్రజాధనం మోసం కేసు దృష్ట్యా దర్యాప్తు కోసం ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ప్రత్యేక చర్యలు తీసుకుని దర్యాప్తు అధికారిగా కాకినాడ ఎస్‌డీపీవో పి.మురళీకృష్ణారెడ్డిని నియమించారు. ఏఎస్పీ పి.శ్రీనివాస్ నేతృత్వంలో కేసు పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దర్యాప్తు చేస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుడు గోల్డ్ అప్రైజర్ తాడోజు శ్రీనివాసరావు కేసు నమోదు ముందు నుంచి పరారీలో ఉన్నట్లు తెలిపారు. బ్యాంకును మోసం చేసిన ప్రధాన నిందితుడికి సహకారం అందించిన అతడి బంధువులు కాకినాడకు చెందిన కొత్తల రాంబాబు, కొండేపూడి కొండరాజు(రాజు)లను కూడా సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. నిందితులను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ ఫైల్ చేశామన్నారు. నకిలీ బంగారం కేసులో ప్రధాన నిందితుడు కోసం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేసులో బ్యాంకు అధికారులు, సిబ్బంది, ఇతరుల ప్రమేయంపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామన్నారు. కేసు దర్యాప్తులో చురుగ్గా వ్యవహరించి కేసును ఛేదించిన ఎస్‌డీపీవో మురళీకృష్ణారెడ్డి, టూటౌన్ సీఐ నాగేశ్వర నాయక్, ఇతర పోలీసు అధికారులు, క్రైం పార్టీ, సిబ్బందిని ఎస్పీ రవీంద్రనాఽథ్‌బాబు అభినందించారు.