INDIA: ఇండియా కూటమి సంచలన నిర్ణయం.. పలువురు యాంకర్లపై నిషేధం!

ABN , First Publish Date - 2023-09-14T11:24:46+05:30 IST

నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది. తమకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేసే టీవీ ఛానెళ్లు, యాంకర్లు, టీవీ షోలను బహిష్కరించాలని నిర్ణయించింది.

INDIA: ఇండియా కూటమి సంచలన నిర్ణయం.. పలువురు యాంకర్లపై నిషేధం!

న్యూఢిల్లీ: నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది. తమకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేసే టీవీ ఛానెళ్లు, యాంకర్లు, టీవీ షోలను బహిష్కరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా మీడియా ఛానెళ్లు, టీవీ షోలు, యాంకర్లపై నిషేధం విధించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో నిషేధం విధించాల్సిన వారి జాబితాను తయారు చేసే పనిలో పడింది. దీంతో కోఆర్డినేషన్ కమిటీలోని సబ్‌ గ్రూప్ నిషేధం విధించాల్సిన వారి జాబితాను నేడు సిద్ధం చేయనుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఇంట్లో జరిగిన భారత సమన్వయ కమిటీ తొలి సమావేశంలో నిషేంధించాల్సిన యాంకర్లు, టీవీ షోల జాబితాపై నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా మీడియాలోని ఒక వర్గం తమపై పదే పదే విష ప్రచారం చేస్తోందని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు మీడియాలోని ఒక వర్గం తక్కువ కవరేజీ ఇస్తోందని కాంగ్రెస్ చెబుతోంది. నిజానికి రాహుల్ గాంధీ భారత్ జోడా యాత్రకు సాధారణ జనం నుంచి భారీగా మద్దతు లభించిందని అంటోంది. సోషల్ మీడియాలో సైతం జోడో యాత్రకు భారీగా మద్దతు లభించిందని కాంగ్రెస్ చెబుతోంది.


కానీ పలు ప్రధాన మీడియా సంస్థలు కావాలనే జోడో యాత్రను బహిష్కరించాయని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ ఆరోపించారు. బీజేపీకి వత్తాసు పలుకుతూ రాహుల్ గాంధీ జోడో యాత్ర గురించి ప్రసారం చేయడం లేదని ఆయన చెబుతున్నారు. దీంతో రాహుల్ గాంధీ జోడో యాత్రను బహిష్కరించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని పలువురు నాయకులు సూచించినట్లు తెలిపారు. "రాహుల్ గాంధీ జోడో యాత్రను ఎడిటర్లు బహిష్కరించారనేది నా ఆరోపణ. లక్షల మంది జనం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంత భారీ ఎత్తున జరుగుతున్న జోడో యాత్రను మీరు చూపలేరా?" అని అశోక్ గెహ్లోత్ ప్రశ్నించారు. "ఒక నెల పాటు టీవీ చర్చలకు తమ అధికార ప్రతినిధులను పంపకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. అన్ని మీడియా ఛానెల్‌లు/ఎడిటర్‌లు తమ షోలలో కాంగ్రెస్ ప్రతినిధులను ఉంచవద్దని అభ్యర్థిస్తున్నాం" అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రణదీప్ సూర్జేవాలా ట్విట్టర్‌లో(ఎక్స్) ఓ ట్వీట్ పెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ మీడియాను నిషేధించడం ఇది కొత్తేం కాదు. 2019లో కూడా ఒక నెల పాటు టెలివిజన్ షోలను నిషేధించింది. కాగా వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీట్ల పంపకాల ప్రక్రియను కూడా ప్రారంభించాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది.

Updated Date - 2023-09-14T11:24:46+05:30 IST