Kamal Haasan Stalin : బీజేపీకి గట్టి షాక్ ఇచ్చేందుకు పావులు కదుపుతున్న కమల్ హాసన్!
ABN , First Publish Date - 2023-03-01T12:26:38+05:30 IST
ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) రానున్న లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఆయన ఒక్కొక్క అడుగు బీజేపీకి
చెన్నై : ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) రానున్న లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఆయన ఒక్కొక్క అడుగు బీజేపీ (BJP)కి షాక్ ఇచ్చే దిశగా పడుతోంది. తన భావాలకు తగినట్లు ఉండే కాంగ్రెస్ (Congress), డీఎంకే (DMK)లతో పొత్తు పెట్టుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలు సూచిస్తున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో ఆయన పార్టీ మనుగడ సాగించాలంటే ఈ పొత్తు తప్పనిసరి అని ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్లు అర్థమవుతోంది. ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ (MK Stalin) 70వ జన్మదినోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను కమల్ ప్రారంభించడంతో ఈ ఊహాగానాలకు మరింత ఊపు వచ్చింది.
స్టాలిన్ 70వ జన్మదినోత్సవాలు మార్చి 1న జరిగాయి. ఆయన జీవితంలోని ముఖ్య సంఘటనలకు సంబంధించిన ఫొటో ప్రదర్శనను కమల్ హాసన్ ఫిబ్రవరి 28న ప్రారంభించారు. అనంతరం కమల్ విలేకర్లతో మాట్లాడుతూ, స్టాలిన్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. తాము సన్నిహిత మిత్రులం కాకపోయినప్పటికీ, స్నేహితులుగానే ఉన్నామని చెప్పారు. తమ మధ్యగల స్నేహం రాజకీయాలకు అతీతమైనదని చెప్పారు. ఈ విషయం అవకాశం వచ్చినపుడు రుజువైందన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకుంటారా? అని అడిగినపుడు కమల్ బదులిస్తూ, కథలో ఒక సన్నివేశం నుంచి మరొక సన్నివేశానికి కదులుతూ ఉండటాన్ని తాను ఇష్టపడతానని, ముందుగానే క్లైమాక్స్ గురించి అడగవద్దని అన్నారు. స్టాలిన్ చరిత్రను ఫొటోల ద్వారా చూపిస్తున్నారని, ప్రస్తుతం ఈ సంబరాన్ని జరుపుకుందామని అన్నారు.
కమల్ హాసన్ 2018లో మక్కల్ నీధి మయ్యమ్ (Makkal Needhi Maiam) పార్టీని స్థాపించారు. అవినీతి నిండిన, వంశపారంపర్య పాలన సాగిస్తున్న ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తాను ఈ పార్టీని ఏర్పాటు చేశానని చెప్పారు. తాను నాస్తికుడినని ప్రకటించుకున్న కమల్ హాసన్ వామపక్ష దృక్పథం కానీ, సంప్రదాయవాదం కానీ లేకుండా కేవలం ప్రజల కోసమే, అందరి ప్రగతి కోసమే రాజకీయాలు చేయడానికి వచ్చానని చెప్పారు. దీంతో యువత ఆయన పార్టీవైపు మొగ్గు చూపింది. 2021 ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో ఈ పార్టీ తొలిసారి పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఆయన నటుడు శరత్ కుమార్ స్థాపించిన ఆలిండియా సమతువ మక్కల్ కట్చితోనూ, ఇందియ జననాయగ కట్చితోనూ పొత్తు పెట్టుకున్నారు. అయితే ఎంఎన్ఎం కనీసం ఒక స్థానాన్ని అయినా గెలుచుకోలేకపోయింది. కమల్ కూడా దక్షిణ కోయంబత్తూరు స్థానంలో బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో 1,728 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. కేవలం కమల్ మాత్రమే తాను పోటీ చేసిన స్థానంలో 33 శాతం ఓట్లను సంపాదించగలిగారు. మిగిలిన అభ్యర్థులు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయితే ఈ పార్టీ రాష్ట్రంలో 2.52 శాతం ఓట్లు సాధించగలిగింది. దీంతో సినీ తారలు రాజకీయాల్లో ఎదిగే రోజులు పోయాయని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
నిలబడాలంటే జట్టుకట్టక తప్పదు!
కమల్ హాసన్ కాంగ్రెస్, డీఎంకేలకు చేరువవుతున్నట్లు సంకేతాలు గత డిసెంబరు, ఈ ఏడాది జనవరి నెలల్లోనే వచ్చాయి. ఆయన కాంగ్రెస్ నేత ఈవీకేఎస్ ఇలంగోవన్‌తో సమావేశమైన తర్వాత మాట్లాడుతూ, తూర్పు ఈరోడ్ శాసన సభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో ఇలంగోవన్‌కు తన పార్టీ ఎంఎన్ఎం మద్దతిస్తుందని ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రస్తుత పరిస్థితికి సంబంధించినదేనని, ఓ ఏడాది తర్వాత మా వైఖరి ఎలా ఉంటుందో మేం చెబుతామని మీరు ఆశించకూడదని అన్నారు. ఈ ప్రకటనపై స్పందించిన ఇలంగోవన్ మాట్లాడుతూ, తనకు ఎంఎన్ఎం మద్దతివ్వడం 2024 లోక్‌సభ ఎన్నికలకు శుభారంభమని వ్యాఖ్యానించారు.
పొత్తుతో మేలు
డీఎంకే, ఏఐఏడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా వచ్చినప్పటికీ, ఎంఎన్ఎం అధికార డీఎంకే-కాంగ్రెస్ కూటమిలో చేరడం వల్ల తన స్థానాన్ని స్థిరపరచుకోవడం సాధ్యమవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. డీఎంకే సీనియర్ నేత ఒకరు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2021 శాసన సభ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన ఎంఎన్ఎం ప్రస్తుతం కాంగ్రెస్‌కు మద్దతివ్వడం వల్ల కమల్ హాసన్‌కే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. మనుగడ కోసం ఎంఎన్ఎంకు అసాధారణమైన వ్యూహాలు అవసరమని తెలిపారు.
భారత్ జోడో యాత్రలో...
మరోవైపు కమల్ హాసన్ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. దీనినిబట్టి తాను ఏ పక్షం సానుభూతిపరుడినో, తన రాజకీయాలు ఏ దిశగా ఉంటాయో స్పష్టమవుతుందని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. ఇదే సమయంలో డీఎంకే నేత ఒకరు మాట్లాడుతూ, రాహుల్ గాంధీ యాత్రలో భాగస్వామి కావడమంటే మరో పార్టీ తమ కూటమిలో చేరుతుండటమేనని చెప్పారు.
గతంలో ఫలించని కమల్ ప్రయత్నాలు
2021 శాసన సభ ఎన్నికలకు ముందే డీఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి కమల్ హాసన్ ప్రయత్నించారు. తమిళనాడు రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి ఇది తప్పనిసరి అని ఆయన భావించారు. దీనికోసం ఆయన కాంగ్రెస్ సాయం కూడా తీసుకోవాలనుకున్నారు. కానీ ఎంఎన్ఎంకు ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తున్నారని డీఎంకే, కాంగ్రెస్ భావించాయి. ఫలితంగా కాంగ్రెస్-డీఎంకే కూటమిలో ఎంఎన్ఎం చేరలేకపోయింది. ప్రస్తుతం ఎంఎన్ఎంలో ప్రముఖ నేతలెవరూ లేరు. గతంలో ఆయనకు అండగా ఉన్న ప్రముఖులు ఆయన వ్యవహార శైలిని నిందిస్తూ పార్టీ నుంచి తప్పుకున్నారు.
భావ సారూప్యత
స్టాలిన్‌తో స్నేహాన్ని బాహాటంగా ప్రదర్శించే అవకాశం ఆయన పుట్టిన రోజు సందర్భంగా కమల్ హాసన్‌కు వచ్చింది. ఇప్పటికి ఈ సంబరాలు చేసుకుందాం, మా స్నేహం రాజకీయాలకు అతీతం అని చెప్తున్నప్పటికీ, రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే, ఇక ఎంతమాత్రం ఒంటరి పోరు సాగించడం ప్రయోజనకరం కాదని ఆయన గుర్తించారు. అదే సమయంలో డీఎంకే కూడా ఆయనను మంచి మిత్రుడిగా అభివర్ణిస్తూ, 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కూటమిలో ఎంఎన్ఎం భాగస్వామి అయ్యే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు ఇస్తోంది. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ మాట్లాడుతూ, తమ పార్టీ నేతృత్వంలోని కూటమి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో ఘన విజయం సాధిస్తుందన్నారు. కమల్ హాసన్ భావసారూప్యతగలవారని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Rahul Gandhi : రాహుల్ గాంధీ న్యూ లుక్స్... చూసి తీరాల్సిందే...
Naveen Case : ఒకరికి తెలియకుండా మరొకరితో యువతి ప్రేమాయణం.. యువతి సెల్‌ఫోన్‌లో షాకింగ్ విషయాలు..