Karnataka CM Race : కర్ణాటక ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించబోతోంది?.. రాహుల్‌‌తో భేటీ కానున్న సిద్ధూ, డీకే..

ABN , First Publish Date - 2023-05-17T11:24:35+05:30 IST

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిని ఎంపిక చేయడంలో కాంగ్రెస్ ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఈ ప్రక్రియను చూసినపుడు ఎన్నికల్లో విజయం సాధించడమే సునాయాసమైన విషయంగా కనిపిస్తోంది.

Karnataka CM Race : కర్ణాటక ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించబోతోంది?.. రాహుల్‌‌తో భేటీ కానున్న సిద్ధూ, డీకే..
Siddaramaiah, DK Shiva Kumar

న్యూఢిల్లీ : కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిని ఎంపిక చేయడంలో కాంగ్రెస్ ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఈ ప్రక్రియను చూసినపుడు ఎన్నికల్లో విజయం సాధించడమే సునాయాసమైన విషయంగా కనిపిస్తోంది. ఈ పదవి కోసం పోటీలో ఉన్న ఇద్దరు ప్రధాన నేతలు సిద్ధరామయ్య, డీకే శివ కుమార్ పంతం వీడటం లేదు. ఈ నేపథ్యంలో వీరిరువురూ బుధవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమావేశం కాబోతున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థి ఎంపిక ప్రక్రియ నాలుగో రోజు కూడా కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (75), కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ (61) హోరాహోరీగా తలపడుతున్నారు. వీరిద్దరూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)తో మంగళవారం సమావేశమయ్యారు. అనంతరం వీరిరువురిని ఢిల్లీలోనే ఉండాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.

రాహుల్ గాంధీతో సమావేశమవడానికి ముందు డీకే, సిద్ధూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మరోసారి కలుస్తారని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, సిద్ధరామయ్యకు అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలుస్తోంది. ఆయన విషయంలో వెనుకకు తగ్గబోనని శివ కుమార్ స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్య సోమవారం నుంచి ఢిల్లీలో కాంగ్రెస్ నేతలను కలుస్తున్నారు. ముఖ్యమంత్రి ఎవరో ఎప్పుడు ప్రకటిస్తారని మీడియా అడిగినపుడు సిద్ధరామయ్య స్పందిస్తూ, తనకు తెలియదని, వేచి చూద్దామని చెప్పారు.

మరోవైపు తిరుగుబాటు ప్రసక్తే లేదని డీకే శివ కుమార్ చెప్తున్నారు. పార్టీ కోరుకుంటే తనకు బాధ్యతను ఇవ్వవచ్చునని, తాము ఐకమత్యంగా ఉన్నామని చెప్పారు. తాను వెన్నుపోటు పొడవబోనని, బ్లాక్‌మెయిల్ చేయబోనని చెప్పారు.

ఇదిలావుండగా, బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కర్ణాటక ముఖ్యమంత్రి పేరును కాంగ్రెస్ ప్రకటిస్తుందని వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

Gujarat CM : గుజరాత్ ముఖ్యమంత్రి నిరాడంబరత.. ఇలాంటి నేత కదా కావాలి..

India Vs EU : రష్యన్ చమురు రీసెల్లింగ్.. యూరోపియన్ దౌత్యవేత్తకు ఘాటు జవాబిచ్చిన జైశంకర్..

Updated Date - 2023-05-17T11:27:47+05:30 IST