Maharashtra : మహారాష్ట్ర పరిణామాల వెనుక శరద్ పవార్ హస్తం : రాజ్ థాకరే
ABN , First Publish Date - 2023-07-05T12:55:25+05:30 IST
మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే (Raj Thackeray) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ముంబై : మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే (Raj Thackeray) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ వర్గం బీజేపీ-శివసేన కూటమితో చేతులు కలపడం వెనుక ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ ప్రమేయం ఉండి ఉండవచ్చునని ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితులు చాలా రోత పుట్టిస్తున్నాయన్నారు. ఇదంతా రాష్ట్రంలోని ఓటర్లను అవమానించడమేనన్నారు.
రాజ్ థాకరే బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ, మహారాష్ట్రలో ఇలాంటి రాజకీయాలకు ఆద్యుడు శరద్ పవారేనని చెప్పారు. ఆయన మొదట పురోగామి లోక్‌షాహీ దళ్ ప్రభుత్వంతో 1978లో మొదటి ప్రయోగం చేశారన్నారు. అంతకుముందు రాష్ట్రంలో ఇటువంటి రాజకీయ పరిస్థితులు ఉండేవి కాదన్నారు. ఇవన్నీ శరద్ పవార్‌తోనే మొదలయ్యాయని, ఆయనతోనే ముగిశాయని అన్నారు.
అజిత్ పవార్ వర్గం ఎన్‌సీపీని చీల్చి, బీజేపీ-శివసేన కూటమిలో చేరడం వెనుక శరద్ పవార్ ప్రమేయం ఉండవచ్చునని చెప్పారు. ప్రఫుల్ పటేల్, దిలీప్ వాల్సే పాటిల్ , ఛగన్ భుజ్‌బల్ తమంతట తాము అజిత్ పవార్‌తో కలిసి వెళ్లే నాయకులు కాదన్నారు. శరద్ పవార్ ఆశీస్సులు లేకుండా వీరు ఆ పని చేయరని తెలిపారు.
శరద్ పవార్‌కు ఝలక్ ఇచ్చిన అజిత్ పవార్, మరో ఎనిమిది మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు జూలై 2న ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో చేరిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ముంబైలోని బాంద్రా, ఎంఈటీ భుజ్‌బల్ నాలెడ్జ్ సిటీలో ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా శరద్ పవార్ వైబీ చవాన్ సెంటర్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ రెండు సమావేశాలు బుధవారం జరుగుతాయి.
ఎన్‌సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో అజిత్ పవార్‌కు ఎందరు మద్దతిస్తున్నదీ బుధవారం స్పష్టంగా తెలిసిపోయే అవకాశం ఉంది. అజిత్ పవార్‌కు 24 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, శరద్ పవార్‌ను 14 మంది ఎమ్మెల్యేలు సమర్థిస్తున్నారని తెలుస్తోంది. మిగిలిన ఎమ్మెల్యేల గురించి స్పష్టత లేదు. అయితే తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అజిత్ పవార్ చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Destination weddings: శివపార్వతులు సత్య యుగంలో పెళ్లి చేసుకున్న చోట పెరుగుతున్న పెళ్లిళ్లు
Quran Desecration : స్వీడన్‌లో ఖురాన్‌కు అవమానం.. పాకిస్థాన్ ప్రభుత్వం నిరసన..