New Parliament Building : ప్రతిపక్షాలకు అమిత్ షా హితవు
ABN , First Publish Date - 2023-05-24T15:16:34+05:30 IST
భారత దేశ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం నవ భారతాన్ని, ప్రాచీన సంప్రదాయాలతో అనుసంధానం చేయడమని కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా అభివర్ణించారు.
న్యూఢిల్లీ : భారత దేశ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం నవ భారతాన్ని, ప్రాచీన సంప్రదాయాలతో అనుసంధానం చేయడమని కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా అభివర్ణించారు. దీనిని రాజకీయం చేయవద్దని ప్రతిపక్ష పార్టీలకు హితవు పలికారు. దీని గురించి ప్రజలను ఆలోచించనిద్దామని, వారికి నచ్చిన విధంగా స్పందించనిద్దామని చెప్పారు.
నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మే 28న ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకాబోమని 19 ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా ప్రకటించాయి. రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి మోదీ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని, పార్లమెంటుకు ఆత్మ వంటి ప్రజాస్వామ్యానికే చోటు లేనప్పుడు కొత్త భవనానికి ఇక ఎలాంటి విలువ లేదని ఆరోపించాయి. కాంగ్రెస్, డీఎంకే, ఆప్, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, జార్ఖాండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ (మణి), విడుదలై చిరుతైగళ్ కట్చి, రాష్ట్రీయ లోక్ దళ్, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), ఎన్‌సీపీ, సీపీఎం, ఆర్జేడీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఎండీఎంకే ఈ ప్రకటనను విడుదల చేశాయి.
ఆంధ్ర ప్రదేశ్‌లోని తెలుగు దేశం పార్టీ, వైకాపా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లు తెలిపాయి. అదేవిధంగా పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్, ఒడిశా అధికార పార్టీ బీజేడీ కూడా హాజరుకాబోతున్నట్లు ప్రకటించాయి. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ గురువారం ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి కేంద్రంలోని అధికార కూటమి ఎన్డీయే పక్షాలు హాజరవుతాయి.
ఈ నేపథ్యంలో అమిత్ షా (Amit Shah) బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, భారత దేశ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం నవ భారతాన్ని, ప్రాచీన సంప్రదాయాలతో అనుసంధానం చేయడమని తెలిపారు. దీనిని రాజకీయం చేయవద్దని ప్రతిపక్ష పార్టీలకు హితవు పలికారు. దీని గురించి ప్రజలను ఆలోచించనిద్దామని, వారికి నచ్చిన విధంగా స్పందించనిద్దామని చెప్పారు.
ఇదిలావుండగా, కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి గతంలో జరిగిన ఇటువంటి కార్యక్రమాలను గుర్తు చేశారు. 1975 ఆగస్టులో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ (Indira Gandhi) పార్లమెంటు అనెక్స్‌ను ప్రారంభించారని, 1987లో అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) పార్లమెంటు గ్రంథాలయాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. మీ (కాంగ్రెస్) ప్రభుత్వాధినేత వాటిని ప్రారంభించినపుడు, మా (ఎన్డీయే) ప్రభుత్వాధినేత ఇప్పుడు అదే పని ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి :
New Parliament: కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంపై 19 విపక్ష పార్టీల కీలక నిర్ణయం
DK Shivakumar: పోలీసు శాఖను కాషాయీకరణ చేస్తే సహించం.. డీకే హెచ్చరిక